గ్రామం నుంచి కలెక్టరేట్ వరకు గ్రామస్తుల పాదయాత్ర

గ్రామం నుంచి కలెక్టరేట్ వరకు గ్రామస్తుల పాదయాత్ర
  • వాగు వద్ద 6 రోజులుగా రాత్రి, పగలు దీక్ష
  • ఎవరూ పట్టించుకోకపోవడంతో గ్రామం నుంచి కలెక్టరేట్ కు పాదయాత్ర

కుమ్రంభీం జిల్లా: తమ గ్రామం వద్ద వాగుపై బ్రిడ్జి.. రోడ్డు నిర్మించాలని కోరుతూ.. చింతలమానేపల్లి మండలం దిందా గ్రామస్తులు ఇవాళ  ఆసిఫాబాద్ కలెక్టరేట్ కు పాదయాత్రగా బయల్దేరారు. దిందా వాగుపై బ్రిడ్జి నిర్మించాలని కొన్నేళ్లుగా గ్రామస్తులు డిమాండ్ చేశారు. ప్రతి ఏటా వర్షాకాలంలో వాగు పొంగి తమ గ్రామం జలదిగ్బంధం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల 6 రోజులు రాత్రి పగలు అనే తేడా లేకుండా వాగు దగ్గర దీక్ష చేసినా అధికారులు గానీ ప్రజాప్రతినిధులు గానీ స్పందించలేదు. దీంతో విసిగిపోయిన గ్రామస్తులు ఇవాళ ఆసిఫాబాద్ కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు. తమ గ్రామస్తుల సమస్యను నేరుగా కలెక్టరుకే విన్నవించుకుంటామని చెప్పారు.

గత ఏడాది వర్షాకాలంలో 4 రోజులపాటు దీక్ష చేయగా స్పందించి వాగు పై బ్రిడ్జి, రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చినా నెరవేర లేదు. దీంతో మళ్లీ 6 రోజులపాటు వాగు వద్ద రాత్రి, పగలు దీక్ష చేసిన దిందా గ్రామస్తులు ఇవాళ కలెక్టరేట్ కు పాదయాత్రగా బయలుదేరారు. తమ సమస్యపై అటో ఇటో తేల్చుకుంటామని.. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధుల స్పందనను బట్టి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకుంటామని చెబుతున్నారు.