డిండి నిర్వాసితులకు 44 కోట్లు ఇయ్యాలె...  

డిండి నిర్వాసితులకు 44 కోట్లు ఇయ్యాలె...  
  • డిండి నిర్వాసితుల ఆందోళన ఉధృతం
  • మర్రిగూడలో కొనసాగుతున్న నిరాహార దీక్ష
  • మంత్రి రాకపోవడంతో విద్యుత్ టవర్ ఎక్కిన యువకులు
  • సూసైడ్ చేసుకుంటామని హెచ్చరిక.. 6 గంటల పాటు టెన్షన్ 
  • న్యాయం చేస్తామన్న అధికారుల హామీతో దిగిన యువకులు 
  • మునుగోడు ఉప ఎన్నిక వేళ సర్కార్​తో తేల్చుకునేందుకు  సిద్ధమైన బాధితులు

నల్గొండ, వెలుగు:  న్యాయమైన పరిహారం కోసం ఏండ్ల తరబడి కొట్లాడి అలసిపోయిన డిండి ప్రాజెక్టు నిర్వాసితులు.. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో సర్కార్ తో చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఓట్లు అడిగేందుకు వచ్చే టీఆర్ఎస్ లీడర్లను నిలదీద్దామని వారం రోజులుగా మర్రిగూడ, నాంపల్లి మండలాలకు చెందిన చర్లగూడెం, వెంకే, వెంకేపెల్లి తండా, నర్సిరెడ్డి గూడెం, కిష్టరాయునిపల్లి గ్రామాల నిర్వాసితులు.. మర్రిగూడ మండల కేంద్రంలో నిరాహార దీక్ష చేస్తున్నారు. శుక్రవారం నాంపల్లి, మునుగోడు మండలాల్లో పర్యటించిన మంత్రి జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మర్రిగూడ వైపు రాకపోవడంతో నిర్వాసితులు ఆగ్రహానికి గురయ్యారు. కొందరు యువకులు అక్కడి విద్యుత్ టవర్ ఎక్కి సూసైడ్ చేసుకుంటామని హెచ్చరించారు. మంత్రి, కలెక్టర్ వచ్చే వరకూ కిందికి దిగబోమని పట్టుబట్టారు. దీంతో దాదాపు 6 గంటల పాటు టెన్షన్ కొనసాగింది. 

కన్నీరుమున్నీరైన తల్లులు.. 

కిష్టరాయునిపల్లికి చెందిన ఆరుగురు యువకులు టవర్‌ ఎక్కి ఆందోళనకు దిగిన విషయం తెలుసుకున్న వాళ్ల తల్లిదండ్రులతో పాటు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సీఐ విఠల్‌రెడ్డితో పాటు ఎస్సై సైదాబాబా యువకులకు ఎంత నచ్చజెప్పినా టవర్‌ దిగేందుకు ఒప్పుకోలేదు. దీంతో యువకుల తల్లులు టవర్ కింద రోదించారు. ‘‘భూములిచ్చి నిండా మునిగాం. మీరు చనిపోయి కడుపు కోత మిగిల్చవద్దు. పరిహారం రాకున్నా సరే, కూలినాలి చేసుకొని బతుకుదం.. దిగిరండి బిడ్డా” అంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఇదే టైంలో ప్రధాన చౌరస్తాలో నిర్వాసితులు, వివిధ పార్టీల నాయకులతో కలిసి ధర్నా చేశారు. మంత్రి, కలెక్టర్‌ వచ్చి హామీ ఇచ్చే వరకు టవర్‌ నుంచి దిగేది లేదని, దీక్ష విరమించేది లేదని పట్టుబట్టారు. దేవరకొండ ఆర్డీవో గోపీరాం నాయక్‌, డీఎస్పీ నాగేశ్వరరావు దీక్షా స్థలానికి వచ్చి నిర్వాసితులతో మాట్లాడారు. రూ.15 లక్షల ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వచ్చేలా కలెక్టర్‌తో మాట్లాడుతామని హామీ ఇవ్వడంతో యువకులు కిందికి దిగారు. కాగా, దీక్ష చేస్తున్న నిర్వాసితులకు కాంగ్రెస్ నాయకులు మల్లు రవి, చెరుకు సుధాకర్‌ సంఘీభావం తెలిపారు. ఇండ్లు కోల్పోయిన వారికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద రూ.20 లక్షలు ఇవ్వాలని, చింతపల్లి మండలంలో కాకుండా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

మల్లన్న సాగర్ తరహాలో పరిహారం ఇవ్వాలంటూ... 

డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలో భాగంగా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో తాగు, సాగు నీటి కోసం 9 రిజర్వాయర్లకు సీఎం కేసీఆర్ 2015లో శంకుస్థాపన చేశారు. ఈ రిజర్వాయర్లు, కెనాల్స్​కోసం నల్గొండ, రంగారెడ్డి, పాలమూరు జిల్లాలో కలిపి 16,334 ఎకరాలు సేకరించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 10,875 ఎకరాలు సేకరించారు. ఒక్కో ఎకరాకు సగటున రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పరిహారం చెల్లించారు. ఇందుకోసం ఏండ్లకేండ్లు  టైమ్ తీసుకోవడంతో.. ఈలోగా బయట భూముల రేట్లు ఎకరానికి రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలకు చేరుకున్నాయి. సకాలంలో పరిహారం ఇస్తే తాము వేరే చోట్ల భూములు కొనుగోలు చేసే వాళ్లమని, సర్కారు లేట్​గా పరిహారం ఇవ్వడం వల్ల నష్టపోయామని నిర్వాసితులు అంటున్నారు. మల్లన్న సాగర్​తరహాలో ఎకరాకు రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని, లేదంటే భూమికి బదులు మరోచోట భూమి ఇవ్వాలని డిమాండ్​చేస్తున్నారు. ఈ క్రమంలో రిజర్వాయర్లు కడ్తున్న చోట కొద్ది నెలలుగా ఆందోళనలకు దిగుతున్నారు. 

నిర్వాసితులకు 44 కోట్లు ఇయ్యాలె...  

రిజర్వాయర్ల కోసం మరో 5,459 ఎకరాలు సేకరించాల్సి ఉన్నప్పటికీ రైతులు ఒప్పుకోవడం లేదు. అదే సమయంలో సర్కార్ బిల్లులు చెల్లించడం లేదని కాంట్రాక్టర్లు కూడా పనులను మధ్యలోనే వదిలేసిపోవడంతో రిజర్వాయర్ల పనులు సైతం పెండింగ్​లో పడ్డాయి. ప్రస్తుతం ఉప ఎన్నిక జరుగుతున్న మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో శివన్నగూడెం, కిష్టరాయునిపల్లి రిజర్వాయర్లు నిర్మాణంలో ఉన్నాయి. శివన్నగూడెం కింద చర్లగూడెం, వెంకేపల్లి తండా, నర్సిరెడ్డిగూడెం, వెంకేపల్లి గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. కిష్టరాయునిపల్లి కింద లక్ష్మాపురం, ఈదుల గండి గ్రామాలు మునిగిపోతున్నాయి. ఈ ఆరు గ్రామాల్లో కలిపి 1267 ఇండ్లు ఉన్నాయి. వీళ్లలో చాలా మంది రైతులకు ఇంకా రూ.44 కోట్ల మేర నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. ఇండ్లకు కూడా పరిహారాలు పెండింగ్​పెట్టడంతో నిర్వాసితులు నిరాహార దీక్షకు దిగారు.