పేదోడి సొంతింటి కల నిజం చేస్తాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

పేదోడి సొంతింటి కల నిజం చేస్తాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
  • మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
  • ఏదులాపురంలో రూ. 1.07 కోట్ల పనులకు శంకుస్థాపన

ఖమ్మం రూరల్ , వెలుగు : గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో పేదవారికి గూడు కల్పించకుండా అబద్ధపు మాటలతో కాలక్షేపం చేసిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి విమర్శించారు. ఆదివారం ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురంలో రూ. 1.07 కోట్లతో పలు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత పాలకుల వైఫల్యాలకు ప్రజలే గుణపాఠం చెబుతారని, తమ ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే రూ. 22,500 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని వెల్లడించారు. ఏదులాపురం మున్సిపాలిటీ అభివృద్ధికి గత రెండేండ్లలో రూ. 70 కోట్లు ఖర్చు చేశామని, ఇప్పటికే ఇక్కడ 560 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు.

ఏప్రిల్ నెలలో రెండో విడత ఇండ్ల మంజూరు ఉంటుందని, మరో మూడు విడతల్లో అర్హులైన ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు కట్టించి తీరుతామని ఆయన భరోసా ఇచ్చారు. మాట ఇస్తే వెనక్కి తగ్గని ప్రభుత్వం తమదని, మున్సిపాలిటీ పరిధిలో మిగిలిపోయిన డ్రైనేజీలు, రోడ్లు, హైటెన్షన్ విద్యుత్ లైన్ల తొలగింపు లాంటి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కండ్లుగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు 40 శాతం, కాస్మెటిక్ చార్జీలు 200 శాతం పెంచడంతో పాటు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీ ద్వారా పేదల ముఖాల్లో చిరునవ్వు చూస్తున్నామన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ, పాత కార్డుల్లో పేర్ల నమోదు ప్రక్రియను కూడా వేగవంతం చేశామని, ప్రజా సమస్యలే లక్ష్యంగా పనిచేస్తున్న తమ ప్రభుత్వానికి ప్రజల దీవెనలు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ  సునీల్ దత్, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలు మద్దినేని బేబీ స్వర్ణ కుమారి, హరినాథ్ బాబు, ఇతర అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు 
పాల్గొన్నారు.

అభివృద్ధికి చిరునామా ఏదులాపురం...

టెంపుల్ సిటీలో రూ. 35 లక్షలు, చిన్నతండాలో రూ. 22 లక్షలు, సూర్యనగర్‌లో రూ. 25 లక్షలు, 4వ తరగతి ఉద్యోగుల కాలనీలో రూ. 25 లక్షలతో సీసీ రోడ్ల పనులకు శ్రీకారం చుట్టారు. కాలనీల్లో పర్యటిస్తున్న సమయంలో మహిళలు తనను ఆపి సమస్యలు వివరించారని వారి కోరిక మేరకు మిగిలిపోయిన ప్రతీ రోడ్డును, డ్రైన్‌ను పూర్తి చేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. హైటెన్షన్ లైన్ల తొలగింపు లాంటి సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.