వైరా, వెలుగు: వైరా మున్సిపాలిటీని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. వైరా మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డుల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 15 కోట్లతో చేపట్టనున్న లింక్ రోడ్లు, అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. తొలుత వైరా రిజర్వాయర్ అలుగు వద్ద ఉన్న దాసాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రిజర్వాయర్ విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి ఆలయం వరకు రూ. కోటితో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. కూరగాయల మార్కెట్ వద్ద సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి, నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ప్రారంభించారు.
వీటితో పాటు జాలాది రామకృష్ణ వాటర్ సర్వీసింగ్ సెంటర్ నుంచి కేవీసీఎం డిగ్రీ కాలేజీ మీదుగా కమ్మవారి కళ్యాణ మండపం వరకు నిర్మించే రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ20 వార్డుల్లోని ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ప్రాధాన్యత క్రమంలో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, వైరా ఏఎంసీ చైర్మన్ బోళ్ల గంగారావు, మార్క్‌ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మున్సిపల్ మాజీ చైర్మన్ సూతకాని జైపాల్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శీలం వెంకట నర్సిరెడ్డి, ఇతర పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
అప్పాయిగూడెం గ్రామ అభివృద్ధికి కృషి
కారేపల్లి : అప్పాయిగూడెం గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. అప్పాయిగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ దండు ప్రవీణ్, కాంగ్రెస్ లీడర్ సపావట్ నాగులుతో కలిసి గ్రామస్తులు ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు. సంక్షేమ ఫలాలు అర్హులైన వారందరికీ అదేవిధంగా సర్పంచులు కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
