Dinesh Karthik: భారత మాజీ వికెట్ కీపర్, -బ్యాటర్ దినేష్ కార్తిక్– స్క్వాష్ స్టార్ దీపిక పల్లికల్ దంపతులు తమ కుటుంబంలోకి కొత్త సభ్యురాలిని ఆహ్వానించారు. ఈ దంపతులకు ఆడబిడ్డ పుట్టిన సందర్భంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఈ శుభవార్తను షేర్ చేసుకున్నారు. తమ కుమార్తెకు “రాహా పల్లికల్ కార్తిక్” అని పేరు పెట్టినట్లు ఇంస్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఇప్పటికే వీరికి కవల పిల్లలు (కొడుకులు) కబీర్, జియాన్ తమ చెల్లిని ఎంతో ఆనందంగా స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు.
దినేష్ కార్తీక్ – దీపికా పల్లికల్ జోడీ ఈ పాపకు “రాహా పల్లికల్ కార్తిక్” అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. దీంతో ఫ్యాన్స్ వారిద్దరికి విషెస్ తెలియజేస్తున్నారు. 2015 ఆగస్టు 25న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం జరిగిన వారి వివాహం విశేషంగా నిలిచింది. 2021లో వీరికి ఇద్దరు మగ కవల పిల్లలు పుట్టారు.. వారి పేర్లు కబీర్, జియాన్ గా నామకరణం చేశారు. ఇప్పుడు 40 ఏళ్ల వయసులో డీకే థర్డ్ టైమ్ తండ్రి అయ్యాడు.
కాగా క్రికెట్ కి వీడ్కోలు పలికిన దీనేష్ కార్తీక్.. ప్రస్తుతం కామెంటేటర్, కోచ్ గా మాత్రమే కొనసాగుతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి బ్యాటింగ్ కోచ్ గా డీకే వ్యవహరిస్తున్నాడు. ఇక దీపికా పల్లికల్ విషయానికి వస్తే.. ఆమె చివరగా ఆసియాగేమ్స్-2023లో మిక్సిడ్ డబుల్స్ లో గోల్డ్ మెడల్ తో మెరిసింది. అంతకు ముందు వరల్డ్ డబుల్స్ ఛాంపియన్ షిప్- 2022లో రెండు స్వర్ణ పథకాలు సాధించింది. దీంతో ఆమె సేవలకుగాను ఇండియన్ గవర్నమెంట్ ఆమెను పద్మశ్రీతో సత్కరించింది.
