గోల్డ్ మెడల్ విజేత, బాక్సర్ డింకో సింగ్ మృతి

గోల్డ్ మెడల్ విజేత, బాక్సర్ డింకో  సింగ్ మృతి

ఆసియా గేమ్స్ స్వర్ణ పతాక విజేత, మాజీ బాక్సర్ డింకో సింగ్ (42)  అనారోగ్యంతో మృతిచెందారు. కాలేయ క్యాన్సర్‌తో చాలా కాలంగా బాధపడుతున్న ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన 2017 నుంచి క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. మణిపూర్‌కు చెందిన డింకో సింగ్‌ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ‘డింకో సింగ్ ఒక స్పోర్టింగ్ సూపర్ స్టార్. ఆయన అనేక పురస్కారాలను సంపాదించాడు. బాక్సింగ్ పట్ల ప్రజాదరణను పెంచడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఆయన మరణం నన్ను కలచివేసింది. ఆయన కుటుంబ సభ్యులకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను’ అని పీఎం మోడీ ట్వీట్ చేశారు.

డింకో మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. డింకో ఒక గొప్ప బాక్సర్ అని వారన్నారు. ఆయన జీవించింది కొంతకాలమే అయినా.. రాబోయేతరాలకు స్పూర్తిగా ఉంటాడని, ముఖ్యంగా మణిపూర్ వాసులకు ప్రేరణగా నిలుస్తాడని వారన్నారు.

డింకో సింగ్ మృతిపట్ల కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు సంతాపం వ్యక్తం చేశారు. దేశంలోని అత్యుత్తమ బాక్సర్లలో డింకో సింగ్ ఒకరని ఆయన అన్నారు. 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడలలో డింకో సాధించిన గోల్డ్ మెడల్.. బాక్సింగ్ పట్ల చాలామందికి ఆసక్తిని పెంచిందని ఆయన అన్నారు. డింకో సింగ్ మరణం రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఒలంపిక్ విజేత, బాక్సర్ విజేందర్ సింగ్ అన్నారు. డింకో కుటుంబం ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని ఆయన అన్నారు. 

డింకో సింగ్ ఆసియా క్రీడలలో స్వర్ణాన్ని గెలుచుకున్న తర్వాత అదే సంవత్సరం అర్జున అవార్డును కూడా అందుకున్నాడు. బాక్సింగ్ కోసం ఆయన చేసిన కృషికిగాను కేంద్ర ప్రభుత్వం ఆయనను 2013లో పద్మశ్రీతో సత్కరించింది. ప్రస్తుతం డింకో సింగ్ నేవీలో ఉద్యోగం చేస్తున్నారు.