అనుకున్న దాని కంటే ఎక్కువే డైరెక్ట్ ట్యాక్స్.. రూ.19.58 లక్షల కోట్ల ఆదాయం

అనుకున్న దాని కంటే ఎక్కువే డైరెక్ట్ ట్యాక్స్.. రూ.19.58 లక్షల కోట్ల ఆదాయం

న్యూఢిల్లీ :  డైరెక్ట్ ట్యాక్స్ (ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌, కార్పొరేట్ ట్యాక్స్‌‌‌‌) వసూళ్లు ప్రభుత్వం వేసిన అంచనాలను మించాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో  నికరంగా రూ.19.58 లక్షల కోట్లు వసూళ్లయ్యాయి. ఇది అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రూ.16.64 లక్షల కోట్లతో  పోలిస్తే 17.7 శాతం ఎక్కువ. బడ్జెట్‌‌‌‌లో వేసుకున్న అంచనా కంటే  రూ.1.35 లక్షల కోట్లు ఎక్కువగా వచ్చాయని ట్యాక్స్ డిపార్ట్‌‌‌‌మెంట్ ఆదివారం ప్రకటించింది. సవరించిన అంచనా కంటే రూ.13,000 కోట్లు ఎక్కువ వచ్చాయని తెలిపింది. 

2023–24 ఆర్థిక సంవత్సరంలో  డైరెక్ట్ ట్యాక్స్ ఆదాయం రూ.19.45 లక్షల కోట్లు వస్తుందని ఈ ఏడాది ఫిబ్రవరి 1 న ప్రకటించిన ఇంటెరిమ్‌‌‌‌ బడ్జెట్‌‌‌‌లో ప్రభుత్వం పేర్కొంది. కిందటేడాది  బడ్జెట్‌‌‌‌లో వేసిన అంచనాలను సవరించింది. మరోవైపు గ్రాస్ డైరెక్ట్‌‌‌‌ ట్యాక్స్ ఆదాయాన్ని రూ. 34.37 లక్షల కోట్లకు సవరించింది. కానీ, రిఫండ్స్ పెరగడంతో  2023–24 లో  రూ.23.37 లక్షల కోట్ల గ్రాస్ డైరెక్ట్ ట్యాక్స్ వసూళ్లయ్యింది. 2022–23 లో వచ్చిన గ్రాస్ డైరెక్ట్ ట్యాక్స్ అమౌంట్ కంటే ఇది 18.48 శాతం ఎక్కువ. కిందటి ఆర్థిక సంవత్సరంలో  ప్రభుత్వం రూ.3.79 లక్షల కోట్లను రిఫండ్‌‌‌‌ చేసింది. 

దీనిని బట్టి ప్రజల ఆదాయాలు పెరిగాయని తెలుస్తోందని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఎకానమీ స్ట్రాంగ్‌‌‌‌గా ఉందనే విషయం అర్థమవుతోందన్నారు. డైరెక్ట్ ట్యాక్స్‌‌‌‌ వసూళ్లలో గ్రాస్‌‌‌‌ కార్పొరేట్ ట్యాక్స్ ఆదాయం రూ. 11.32 లక్షల కోట్లు (నికరంగా రూ. 9.11 లక్షల కోట్లు) గా రికార్డయ్యింది. గ్రాస్ పర్సనల్ ట్యాక్స్ ఆదాయం 24 శాతం పెరిగి రూ. 12.01 లక్షల కోట్లకు చేరుకుంది. నికరంగా రూ.10.44 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది.