
నటుడు, దర్శకుడు సూర్య కిరణ్ (48) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. మాస్టర్ సురేష్ పేరుతో బాలనటుడిగా రెండు వందలకు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. అలాగే సహాయనటుడిగానూ పలు చిత్రాల్లో నటించారు. సుమంత్ హీరోగా 2003లో వచ్చిన ‘సత్యం’ చిత్రంతో తెలుగులో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ధన 51, బ్రహ్మాస్త్రం, రాజు భాయ్, చాప్టర్ 6 లాంటి చిత్రాలు తెరకెక్కించారు. ఇటీవల ‘అరసి’ అనే తమిళ చిత్రానికి దర్శకత్వం వహించారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. రాక్షసుడు, దొంగమొగుడు, స్వయం కృషి, సంకీర్తన, ఖైదీ నం.786, కొండవీటి దొంగ లాంటి చిత్రాల్లో ఆయన బాలనటుడిగా నటించారు. హీరోయిన్ కళ్యాణిని సూర్య కిరణ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో వీళ్లిద్దరూ విడిపోయారు. టీవీ నటి సుజిత ఆయనకు స్వయానా చెల్లి. సూర్యకిరణ్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం చెన్నైలో జరుగనున్నాయి.