- చోరీలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్
- రూ. 57 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం
నారాయణపేట, వెలుగు: డైరెక్టర్ కావాలన్న ఆశతో డబ్బు కోసం చోరీల బాట పట్టిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను నారాయణపేట ఎస్పీ యోగేశ్ గౌతమ్ వెల్లడించారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన అప్పలనాయుడు (43) హైదరాబాద్‌లో ఉంటూ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు డైరెక్టర్‌గా మారాలన్న ఆశతో గతంలో లైవ్ అండ్ క్రైమ్ అనే షార్ట్ ఫిల్మ్ కూడా తీశాడు.
అయితే జల్సాలకు అలవాటుపడిన అప్పలనాయుడు చోరీలు చేసేందుకు ప్లాన్ చేశాడు. ఇలా మార్చి 24 నుంచి జులై 7 వరకు మరికల్, నారాయణపేట, మక్తల్ పరిధిలో ఆరు చోరీలు చేశాడు. మక్తల్‌లో చివరిసారిగా చోరీ చేసిన ఇంట్లో సీసీ కెమెరాలు ఉండడంతో ఆ ఫుటేజీ ఆధారంగా పోలీసులు స్పెషల్ టీం ఏర్పాటు గాలింపు మొదలు పెట్టారు. ఈ క్రమంలో గురువారం అప్పలనాయుడును పట్టుకున్నారు.
నిందితుడిపై గతంలో 45 చోరీ కేసులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. అతడి వద్ద నుంచి రూ. 57 లక్షల విలువైన సుమారు 75 తులాల బంగారం, 35 తులాల వెండి, రూ.4 లక్షలు రికవరీ చేసినట్లు చెప్పారు.
