‘ఆచార్య’ నుంచి కాజల్ కట్?

‘ఆచార్య’ నుంచి కాజల్ కట్?
  • క్లారిటీ ఇచ్చిన కొరటాల శివ

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకున్న చిత్రం ‘ఆచార్య’. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కొరటాల శివ ఈ మూవీకి దర్శకుడు. ఆలయాల నేపథ్యంలో సిద్ధమైన ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. చరణ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. అయితే ‘లాహే లాహే’ పాటలో చిరుతో స్టెప్పులేయడం మినహాయిస్తే.. ట్రైలర్ లో కనిపించకపోవడంతో కాజల్ పాత్రపై సస్పెన్స్ ఏర్పడింది. చిరంజీవితో ‘ఆచార్య’ ప్రాజెక్ట్ ప్రకటించిన సమయంలో.. కాజల్ హీరోయిన్ గా నటించనుందని ప్రకటించారు. అయితే సినిమా ట్రైలర్స్ తో పాటు ప్రమోషన్స్ లోనూ ఆమె పేరు వినిపించ లేదు. ఈ విషయంపై కొరటాల శివ క్లారిటీ ఇచ్చారు. ‘ఆచార్య’ నుంచి కాజల్ ను తొలగించామని తెలిపారు. 

‘తొలుత సినిమా అనుకున్నప్పుడు హీరోకి జోడీగా హీరోయిన్ ఉంటే బాగుంటుందనిపించింది. కథా నేపథ్యం సాగే ధర్మస్థలిలో ఉండే ఓ ఫన్నీ క్యారెక్టర్ గా హీరోయిన్ పాత్రను డిజైన్ చేశాం. ఆ రోల్ కు కాజల్ ను ఎంపిక చేశాం. సాధారణంగా సినిమాల్లో హీరో పాత్రలకు లవ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఈ మూవీలో ఆచార్య క్యారెక్టర్ కు లవ్ ఇంట్రెస్ట్ ఉండకూడదు. అయినా కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు ఉంటాయనే ఫార్ములాతో.. ఫస్ట్ షెడ్యూల్ లో కాజల్ తో మూడ్నాలుగు రోజులు షూట్ చేశాం. కానీ షూట్ చేసుకున్న భాగం చూస్తున్నప్పుడు ఓ సందేహం వచ్చింది. అంత పెద్ద హీరోయిన్ ను హీరోకు లవ్ ఇంట్రెస్ట్ లేనప్పుడు కొనసాగించడం నచ్చలేదు. అందులోనూ హీరో, హీరోయిన్ కు పాటలు కూడా పెట్టలేని పరిస్థితి. హీరోయిన్ పాత్రకు మంచి ముగింపునూ ఇవ్వలేమని అనిపించింది. దీంతో చిరుతోపాటు అందరి సలహాలు తీసుకుని, కాజల్ తో మాట్లాడా. ఆమెకు ఇవన్నీ వివరించా. కాజల్ అర్థం చేసుకున్నారు. ఈ మూవీ జర్నీని మిస్సవుతానని.. భవిష్యత్ లో నాతో కలసి పని చేయాలనుందన్నారు. అలా సినిమాలో ఆమె పాత్రను తీసేశాం’ అని కొరటాల శివ చెప్పారు. మరి ‘లాహె లాహె’ సాంగ్ లో అయినా కాజల్ ఉంటారా లేదా అనే ప్రశ్నకు.. థియేటర్ లోనే సమాధానం దొరుకుతుందని ఆయన జవాబిచ్చారు. 

మరిన్ని వార్తల కోసం:

సమ్మర్​లో.. నల్ల కళ్లద్దాలు పెట్టాల్సిందే

నెయ్యి తప్పకుండా తినిపించాలి

రైతుల ఆత్మహత్యలు కనిపించడం లేదా?