
- 66వ రోజు కొనసాగుతున్న వైఎస్ షర్మిల పాదయాత్ర
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కష్టాలు చుట్టుముడుతుంటే.. బతుకు భారమై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదా...? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. రైతులు సాగు చేసుకుంటున్న భూములకు దగ్గరుండి పట్టాలిప్పిస్తానని చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చి 8 ఏళ్లైనా రైతుల గోడును పట్టించుకోవడం లేదని ఆమె మండిపడ్డారు. దిక్కుమాలిన ప్రభుత్వాన్ని సాగనంపాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం 66వ రోజు పాదయాత్రను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉదయం 10 గంటలకు పినపాక నియోజకవర్గం బూర్గంపాడు మండలం ఇరవండి కొత్తూరు క్యాంప్ నుంచి ప్రారంభించారు. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ.. వారి కష్టాలు, సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ 8 ఏళ్లుగా సీఎంగా ఉన్న కేసీఆర్ ఇళ్ల పట్టాలు ఎందుకివ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు పోడు భూములకు పట్టాలిస్తానని.. అధికారులతో కలసి వస్తాను.. పరిష్కరిస్తానని చెప్పి ఎందుకివ్వలేదని నిలదీశారు. పోడు భూములు మాకవసరం.. పట్టాలివ్వమని లక్షల మంది దరఖాస్తు చేసుకున్నా... పట్టాలివ్వక పోగా ఉన్న భూముల్ని గుంజుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి వారిని పాలకులంటారా..? రాక్షసులంటారా..?
భూములు లేకపోతే బతుకుతెరువు పోతుందని పేదలు గగ్గోలు పెడుతుంటే ఏ మాత్రం కనికరం చూపడంలేదని షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు.వేల ఎకరాలు లాక్కుని.. కంచెలు వేసి స్వాధీనం చేసుకున్నారని.. ఇలాంటి వారిని పాలకులు అంటారా..? రాక్షసులంటారా..? అని ఆమె ప్రశ్నించారు. భూముల కోసం ఆందోళనకు దిగిన నిరుపేద రైతులను ముఖ్యంగా చంటి పిల్లల తల్లులని చూడకుండా జైళ్లలో పెట్టి లాఠీలతో కొట్టారని.. దాహమేస్తోందని కాళ్లు పట్టుకుని అడిగినా.. కనీసం మంచినీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. పోడు భూములకు పట్టాలివ్వకపోగా.. వాటిని లాక్కుని మీవి కావని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను కోటీశ్వరులను చేయడం, రాజులను చేయడం అంటే ఇదేనా అని షర్మిల ఎద్దేవా చేశారు.
8 సంవత్సరాల్లో 8 వేల మంది రైతులు ఆత్మహత్య
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 సంవత్సరాలలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని షర్మిల అన్నారు. రాష్ట్రంలో రైతులందరూ కోటీశ్వరులైతే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు..? అని ప్రశ్నించారు. అప్పులు ఎక్కువై.. కష్టాలు పెరిగి దిక్కుతోచక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదా..? అని నిలదీశారు. ఎన్నికల ముందు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక రుణమాఫీ చేయకపోగా.. రైతుల అప్పులకు వడ్డీ పెరుగుతుంటే పట్టించుకోవడం లేదన్నారు. రైతుల అప్పు అలాగే ఉండిపోయింది.. మరో వైపు వడ్డీ పెరుగుతోందని, అలాగే ఉచిత విద్యుత్ 24 గంటలు ఇస్తామని 7 గంటలు మాత్రమే ఇస్తున్నారని, పంటలు ఎండుతుంటే.. భరించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు.
వరి రైతులను నిండా ముంచేశారు
‘గతేడాది 52 లక్షల ఎకరాల్లో వరి వేస్తే.. ఈ ఏడు 35 లక్షల ఎకరాల్లో మాత్రమే వేశారు..కేసీఆర్ వరి వేసుకుంటే ఉరే అని చెప్పడం వల్ల.. 17 లక్షల మంది వరి వేసుకోలేకపోయారు.. వారు నష్టపోతే పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదా..? కేసీఆర్ తప్పు చేస్తే రైతులు నష్టపోయారు.. వరి వేయని రైతులకు ఎకరాకు రూ.25వేలు ఇవ్వాలి’’ అని షర్మిల డిమాండ్ చేశారు. ‘రైతులు పండించిన 35లక్షల ఎకరాల వడ్లు కొనడం ప్రభుత్వానికి చేతకావడం లేదు.. గతంలో 7వేల కొనుగోలు కేంద్రాలు ఉంటే.. ఇప్పటి వరకు వెయ్యి కూడా తెరవలేదు. కేసీఆర్ ఒకచేత్తో 5వేలు రైతు బంధు ఇచ్చి.. మరో చేత్తో రూ.25 వేలు తీసుకుంటున్నాడని.. రూ.25వేలు వచ్చే పథకాలన్నీ బందు పెట్టి.. రూ.5వేలు రైతు బంధు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నాడు.. కౌలు రైతుల గురించి పట్టించుకునే నాథుడే లేదు..కేసీఆర్ దిక్కుమాలిన పాలన..’ అని షర్మిల విమర్శించారు.
ఇవి కూడా చదవండి
12 రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా ఉధృతి
ఎల్ఐసీలో 3.5% వాటా అమ్మకానికి ఓకే
ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ ఘన విజయం