శ్రీమంతుడు సినిమా కథపై విచారణ ఎదుర్కోవాల్సిందే .. డైరెక్టర్‌‌‌‌ కొరటాల శివకు హైకోర్టు ఆదేశం

శ్రీమంతుడు సినిమా కథపై విచారణ ఎదుర్కోవాల్సిందే .. డైరెక్టర్‌‌‌‌ కొరటాల శివకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: మహేశ్‌‌ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు సినిమాకు సంబంధించి కాపీ రైట్‌‌ యాక్ట్ కింద డైరెక్టర్‌‌‌‌ కొరటాల శివ విచారణ ఎదుర్కోవాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. అయితే, ఆ మూవీ నిర్మాత ఎర్నేని రవి, ఎంబీ ఎంటర్‌‌టైన్‌‌మెంట్‌‌లపై కాపీ రైట్‌‌యాక్ట్‌‌ కేసు చెల్లదని చెప్పింది. వీళ్లపై ఫోర్జరీ, చీటింగ్‌‌ కేసులు నమోదు చేయాలన్న కథ రచయిత శరత్‌‌ చంద్ర (ఆర్డీ విల్సన్‌‌) అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ మేరకు జస్టిస్‌‌ సురేందర్‌‌ ఇటీవల తీర్పు వెలువరించారు. ‘చచ్చేంత ప్రేమ’ పేరిట తాను రాసిన నవలలో స్వల్ప మార్పులు చేసి శ్రీమంతుడు పేరిట సినిమా తీశారంటూ ఆ మూవీ డైరెక్టర్‌‌‌‌ కొరటాల శివ, నిర్మాతలు ఎర్నేని రవి, ఎంబీ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్లపై రచయిత శరత్‌‌ చంద్ర క్రిమినల్‌‌ కేసు పెట్టారు. దీనిని సవాల్‌‌ చేస్తూ ఆ ముగ్గురూ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

ఇదే సమయంలో వారిపై చీటింగ్, ఫోర్జరీ కేసుల నమోదుకు ఉత్తర్వులివ్వాలని శరత్‌‌చంద్ర తన పిటిషన్‌‌లో కోరారు. ‘‘శ్రీమంతుడు కథలో స్వల్ప మార్పులు ఉన్నాయని 8 మంది రచయితల కమిటీ చెప్పింది. దీంతో డైరెక్టర్‌‌‌‌ కాపీ రైట్‌‌ యాక్ట్‌‌ నిబంధనల ప్రకారం విచారణను ఎదుర్కోవాలి. ఎందుకంటే, దర్శకుడే కథా రచయతకు, స్రీన్‌‌ప్లేకు సొమ్ము చెల్లించారు. కథనంలో మార్పులు చేసి తన కథ అంటే కుదరదు. ఇలాంటి వ్యవహారాలపై విచారణను ఎదుర్కోవాలి. ఈ వ్యవహారంతో నిర్మాతకు సంబంధం లేదు. ఇదే సమయంలో దర్శకుడు, నిర్మాత, ఎంటర్‌‌టైన్‌‌మెంట్ సంస్థలపై చీటింగ్, ఫోర్జరీ కేసులు చెల్లవు” అని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.