 
                                    నటుడిగా పలు చిత్రాల్లో మెప్పించిన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన సినిమా ‘గర్ల్‌ఫ్రెండ్’. రష్మిక, దీక్షిత్ శెట్టి జంటగా నటించారు. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. నవంబర్ 7న పాన్ ఇండియా వైడ్‌గా సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా రాహుల్ రవీంద్రన్ చెప్పిన విశేషాలు.
‘‘నేను కాలేజ్‌లో చూసిన ఒక ఇన్సిడెంట్ ఆధారంగా ఈ కథ రాశా. ఆహా ఓటీటీలో సిరీస్ చేయాలనుకున్నా. కానీ అల్లు అరవింద్ గారు ఈ కథలో సినిమాకు కావాల్సిన కంటెంట్ ఉంది.. ఈ స్క్రిప్ట్ తోనే సినిమా స్టార్ట్ చేయాలని అన్నారు. అలాగే రష్మిక, గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా చేయాల్సి ఉంది. తనకు స్క్రిప్ట్ పంపగా రెండు రోజుల్లోనే మొత్తం చదివేసింది.
‘‘ఈ మూవీ మనం వెంటనే చేస్తున్నాం. ఇలాంటి కథ ఆడియెన్స్‌కు చెప్పాలి. ఒక అమ్మాయిగా నేను ఈ కథకు చాలా కనెక్ట్ అయ్యాను. బయట ఉన్న అమ్మాయిలు అందరికీ నేను ఇచ్చే బిగ్ హగ్ ఈ సినిమా’’ అని చెప్పింది. ఒక జంట లైఫ్‌లో ఇలా జరిగింది అనేది నాకు తెలిసిన పద్ధతిలో చూపించాను. అంతే కానీ ఎలాంటి సందేశాలు, నీతులు చెప్పలేదు.
టీజర్, ట్రైలర్‌లో ఆడియెన్స్‌ను కావాలనే మిస్ డైరెక్ట్ చేశాం. మెయిన్ కంటెంట్ థియేటర్‌లో చూస్తేనే ఎంజాయ్ చేస్తారు. ఈ హై వోల్టేజ్ ఇంటెన్స్ డ్రామా సర్‌ప్రైజ్ చేస్తుంది. ఈ కథలో హీరో హీరోయిన్ ఇద్దరి పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుంది. అయితే హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథను చూపిస్తున్నాం. విక్రమ్ క్యారెక్టర్‌లో దీక్షిత్ శెట్టి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాడు. కాలేజ్ లెక్చరర్‌గా నేనూ ఓ పాత్రలో కనిపిస్తా. అను ఇమ్మాన్యుయేల్ క్యారెక్టర్ సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది.
హేషమ్ అబ్దుల్ వాహాబ్ మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది. నేను పలు సినిమాల్లో నటించినా.. నా ఆలోచన ఎప్పుడూ డైరెక్షన్, రైటింగ్‌పైనే ఉండేది. నటించడాన్ని ఎంజాయ్ చేస్తాను కానీ డైరెక్షన్‌నే నా కెరీర్‌గా భావిస్తా. అసిస్టెంట్ డైరెక్టర్‌గా వచ్చి అనుకోకుండా హీరో అయ్యాను.
ఇప్పటికీ హీరో అవకాశాలు వస్తున్నాయి. కానీ క్యారెక్టర్స్ మినహా ఇకపై హీరోగా నటించకూడదని నిర్ణయించుకున్నా. ప్రస్తుతం దర్శకుడిగా రెండు సినిమాలు లైనప్‌లో ఉన్నాయి. అలాగే రష్మిక, నేను మరో మూవీ చేయాలనుకుంటున్నాం’’ అని డైరెక్టర్ రాహుల్ తెలిపారు.

 
         
                     
                     
                    