
‘ధమాకా’ చిత్ర దర్శకుడు త్రినాథరావు నక్కిన, నటుడు, నిర్మాత బండ్ల గణేష్ లు వెంటనే క్షమాపణలు చెప్పాలని సగర ఉప్పర సంఘం డిమాండ్ చేసింది. వారు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సగర (ఉప్పర) సామాజిక వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా కామెంట్లు చేస్తున్నారంటూ హైదరాబాద్ ఫిలిం చాంబర్ వద్ద నాయకులు ఆందోళన చేపట్టారు. వారి దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు.
ధమాకా చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆ చిత్ర దర్శకుడు త్రినాథరావు నక్కిన తమ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడారని, ఇలాంటి వారిని సహించబోమని సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర వెల్లడించారు. నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కూడా తమ మనోభావాలను దెబ్బ తీసే విధంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి సినిమాలు ఆడకుండా ఆపేస్తామని తెలంగాణ సగర (ఉప్పర) సామాజికవర్గం నాయకులు వెల్లడించారు. బహిరంగ క్షమాపణ చెప్పకపోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదని, సినిమాలను ఆపేస్తామని హెచ్చరించారు.