రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించడం పట్ల వికలాంగుల సంబరాలు..

రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించడం పట్ల వికలాంగుల సంబరాలు..

కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా  రేవంత్ రెడ్డిని  ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తు కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర ఛైర్మన్ ముత్తినేని వీరయ్య  ఆధ్వర్యంలో వికిలాంగులు సంబరాలు చేసుకున్నారు.  డిసెంబర్ 6వ తేదీ బుధవారం హైదరాబాద్ మలక్ పేటలోని వికలాంగుల రాష్ట్ర కమిషనరేట్ ప్రాంగణంలో  వికలాంగులు  కేక్ కట్ చేసి  పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి వారు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ..  తెలంగాణ రాష్ట్రంలో గడిచిన తొమ్మిదన్నర సంవత్సరాలలో వికలాంగులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాలలో తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొన్నారన్నారని చెప్పారు. కెసిఆర్ ప్రభుత్వం.. వికలాంగుల హక్కులకు భంగం కలిగిందని మండిపడ్డారు.  ఏ ఒక్కనాడు కూడా వికలాంగుల దినోత్సవాలకు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ హాజరు కాకపోవడం,  వికలాంగుల సమస్యల పట్ల కనీస అవగాహన లేని పరిపాలన చేయడం వల్ల వికలాంగుల సమాజం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని తెలిపారు.

ఎన్నికల ముందు వికలాంగుల విభాగం విజయ సంకల్ప యాత్ర చేపట్టి అన్ని నియోజకవర్గాలలో పెన్షనర్లకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి 100 రకాల అన్యాయాన్ని వివరిస్తూ..  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలను తెలియజేస్తూ యాత్ర చేశామని తెలిపారు. ఈ యాత్రలో కాంగ్రెస్ 6 గ్యారంటిలతో పాటు, వికలాంగులకు ఉచిత ప్రయాణం, బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీ, వికలాంగుల హక్కుల చట్టం అమలు,  వికలాంగులకు రూ.6 వేల- పెన్షన్ వంటి పథకాలను వివరిస్తూ..119 నియోజకవర్గాలల్లో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అహర్నిశలు పని చేసిన వికలాంగుల విభాగం అసెంబ్లీ ఇన్ చార్జులు, సోషల్ మీడియా కోఆర్డినేటర్లకు వీరయ్య ధన్యవాదాలు  తెలిపారు.