అగ్నిపథ్ నిరసనల్లో కాంగ్రెస్ నేతల మధ్య బయటపడ్డ వర్గ పోరు

అగ్నిపథ్ నిరసనల్లో కాంగ్రెస్ నేతల మధ్య బయటపడ్డ వర్గ పోరు

వెలుగు నెట్ వర్క్: కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వర్గ పోరు బయటపడింది. సోమవారం అగ్నిపథ్ స్కీంపై సత్యాగ్రహ దీక్షలు చేయాలని పార్టీ హైకమాండ్ ఆదేశాలు ఇవ్వగా.. ఎవరికి వారుగా నియోజకవర్గాల్లో దీక్షలు చేశారు. కొన్నిచోట్ల గొడవలు కూడా జరిగాయి. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ఓవైపు ఎన్నికలు దగ్గరపడుతుండడం, మరోవైపు పార్టీలో ఐక్యత లేకపోవడంతో ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.

కొండా, ఇనగాల వర్గీయుల మధ్య లొల్లి

పరకాల, వెలుగు: పరకాలలో చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో కొండా, ఇనగాల వర్గీయులు గొడవకు దిగారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి ఇనగాల వెంకట్రాంరెడ్డి, కొండా దంపతుల వర్గీయులు స్థానిక మున్సిపాలిటీ ఆఫీసు వద్ద చెరో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కొండా వర్గీయులు తెచ్చిన ఫ్లెక్సీలో ఇనగాల వెంకట్రాంరెడ్డి ఫొటో లేకపోవడంతో గొడవ జరిగింది. ఈక్రమంలో కొండా దంపతుల కూతురు సుస్మితా పటేల్ వేదికపైకి వచ్చింది. దీక్షలో గొడవ సరికాదని ఇరు వర్గాలకు నచ్చజెప్పింది. చివరకు ఫ్లెక్సీలు పెట్టకుండానే దీక్ష చేశారు. ఇదిలా ఉండగా.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇనగాల దీక్షకు రాలేదు. కాగా, సుస్మితా పటేల్ ఎన్నడూ లేని విధంగా తెరపైకి రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.

వరంగల్ తూర్పులో..

వరంగల్ సిటీ, వెలుగు: సత్యాగ్రహ దీక్షకు  పరకాల ఇన్​చార్జిగా కొండా సురేఖను హైకమాండ్ నియమించగా.. పరకాలలో కాదని ఆమె వరంగల్ తూర్పులో సత్యాగ్రహ దీక్ష చేశారు. తూర్పు బాధ్యతలను మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు అప్పగించగా.. ఆయన పోచమ్మమైదాన్ సెంటర్​లోని పెట్రోల్ పంప్ వద్ద దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో కొండా సురేఖ వర్గీయులు అక్కడికి చేరుకుని దీక్ష చేసేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య కొంత వాగ్వాదం జరిగింది. తూర్పు బాధ్యతలు తనకు అప్పగించారని, తమకు సమాచారం ఇవ్వకుండా దీక్ష చేపట్టడం సరికాదని రాజయ్య చెప్పారు. కొద్దిసేపటికి అక్కడికి చూరుకున్న 
కొండా సురేఖ.. నాయకులతో మాట్లాడి గొడవను సద్దుమణిగించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచే పోటీ చేస్తానని అందుకే ఇక్కడ దీక్ష చేపట్టానన్నారు. సినిమా షూటింగ్ వల్ల నియోజకవర్గంలో తిరగలేకపోయానన్నారు.

స్టేషన్ ఘన్ పూర్​లో ఎవరికి వారుగా..

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో రెండు చోట్ల సత్యాగ్రహ దీక్షలు చేపట్టడంతో ఆ పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. స్టేషన్​ఘన్​పూర్​లోని జఫర్ గఢ్ రోడ్డులో అంబేడ్కర్ విగ్రహం ముందు టీపీసీసీ మెంబర్ గంగారపు అమృతరావు దీక్ష ప్రారంభించగా.. స్థానిక ఆర్డీవో ఆఫీసు ముందు పార్టీ సీనియర్ లీడర్​ దొమ్మాటి సాంబయ్య సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. దీంతో కార్యకర్తలు ఎటు వెళ్లాలో తెలియక అయోమయానికి గురయ్యారు. రెండు శిబిరాల నాయకులు రహస్యంగా కార్యకర్తలకు ఫోన్లు చేసి ఎంతమంది, ఎవరెవరు పాల్గొన్నారో తెలుసుకున్నారు.

డోర్నకల్ లోనూ..

మరిపెడ, వెలుగు: డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్​లో విభేదాలు బయటపడ్డాయి. పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జి జాటోతు రామచంద్రు నాయక్ మరిపెడలో దీక్ష చేపట్టగా.. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మాలోత్ నెహ్రూనాయక్ కురవిలో దీక్ష చేశారు. కొద్దిరోజులుగా ఇరువురికి పడడం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఇద్దరు కలిసి ఒకే చోట కాకుండా వేర్వేరుగా నిర్వహించారని 
పేర్కొంటున్నాయి.