దేవాదుల ప్రాజెక్టు సీఈ ఎక్స్‌‌‌‌టెన్షన్‌‌‌‌ పై అధికార పార్టీలో విభేదాలు

దేవాదుల ప్రాజెక్టు సీఈ ఎక్స్‌‌‌‌టెన్షన్‌‌‌‌ పై అధికార పార్టీలో విభేదాలు
  • పనిచేయని సీఈ వద్దంటున్న ఎమ్మెల్యేలు
  • కొనసాగించాలంటూ ఒత్తిడి తెస్తున్న మంత్రులు
  • ఇరిగేషన్‌‌‌‌ వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: దేవాదుల ప్రాజెక్టు సీఈ ఎక్స్‌‌‌‌టెన్షన్‌‌‌‌ వ్యవహారం అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు సృష్టిస్తోంది. పని చేయని సీఈని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించొద్దని ఎమ్మెల్యేలు పట్టుబడుతుండగా, ఆయనకే ఎక్స్‌‌‌‌టెన్షన్‌‌‌‌ ఇవ్వాలని ఇద్దరు మంత్రులు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంపై ఇరిగేషన్‌‌‌‌ వర్గాల్లో ఎక్కువగా చర్చ జరుగుతోంది. దేవాదుల సీఈ పదవీకాలం రెండేళ్ల క్రితమే ముగియగా, అప్పటినుంచి ఆయన ఎక్స్‌‌‌‌టెన్షన్‌‌‌‌లో కంటిన్యూ అవుతున్నారు. ఇంకో నాలుగైదు రోజుల్లో ఆయన బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి ఉంది. అయితే మళ్లీ తనకు అవకాశం ఇవ్వాలని మంత్రులతో ఆయన పెద్ద ఎత్తున లాబీయింగ్‌‌‌‌ చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ సీఈపై ఉన్న ఆరోపణలను ప్రభుత్వ పెద్దల వద్దకు తీసుకెళ్లి కొనసాగింపు దక్కకుండా చేయాలని ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు.

ఏడాదిలో ఒక్కసారే విజిట్‌‌‌‌

దేవాదుల ప్రాజెక్టు మూడో ప్యాకేజీని సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్‌‌‌‌తో కలిసి విజిట్‌‌‌‌ చేసిన సీఈ మళ్లీ ఏడాది వరకు అటువైపు కన్నెత్తి చూడలేదు. ప్రాజెక్టు ప్రోగ్రెస్‌‌‌‌ చూసేందుకు ఈ మధ్య స్మితా సబర్వాల్ వచ్చిన రోజే సీఈ మళ్లీ అడుగు పెట్టారని ఇంజనీర్లు చెప్తున్నారు. ప్రాజెక్టు సైట్‌‌‌‌లో ఉండి పనిచేయాల్సిన సీఈ.. హైదరాబాద్‌‌‌‌ క్యాంపు ఆఫీసులో ఉంటారని చెప్తున్నారు. ప్రాజెక్టు పనులు మొదలు పెట్టి ఇన్నేళ్లయినా ఇప్పటికీ డిజైన్స్‌‌‌‌ కూడా ఫైనల్‌‌‌‌ కాలేదని అంటున్నారు. ‘‘దేవాదుల ప్రాజెక్టు తొమ్మిది జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. కలెక్టర్‌‌‌‌ ఒక్క జిల్లాకే అధికారి. నేను తొమ్మిది జిల్లాలకు బాస్‌‌‌‌ను” అని సదరు సీఈ పలు సందర్భాల్లో కామెంట్ చేసినట్లు తెలిసింది.

కడిగి పారేసిన ఎమ్మెల్యేలు

దేవాదుల ప్రాజెక్టు పనులు చాలాకాలంగా పూర్తి కాకపోవడంతో ఫీల్డ్‌‌‌‌ విజిట్‌‌‌‌ చేసి, తనకు రిపోర్ట్‌‌‌‌ ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీంతో నవంబర్‌‌‌‌ 6న ఇరిగేషన్‌‌‌‌ ప్రిన్సిపల్‌‌‌‌ సెక్రటరీ రజత్‌‌‌‌ కుమార్‌‌‌‌, సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్‌‌‌‌, ఈఎన్సీ, ఇతర ఇంజనీర్లు ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జనగామ ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి సీఈ తీరును వారి వద్ద కడిగి పారేశారు. సీఈ తీరు వల్లే ప్రాజెక్టు ముందుకు పోవడం లేదని ఉమ్మడి వరంగల్‌‌‌‌ జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా కంప్లైంట్‌‌‌‌ చేశారు. కనీసం తాము ఫోన్‌‌‌‌ చేస్తే సరిగా ఆన్సర్‌‌‌‌ చేయడని, మాట్లాడుతుండగానే కట్‌‌‌‌ చేస్తారని ఫిర్యాదు చేశారు. అయినా ఆయన్నే కొనసాగించాలని ఉమ్మడి జిల్లాకు చెందిన ఒక మంత్రి ఇరిగేషన్‌‌‌‌ ఈఎన్సీపై ఒత్తిడి తెస్తున్నారని వరంగల్‌‌‌‌ జిల్లా ఎమ్మెల్యేలు చెప్తున్నారు. సదరు సీఈకి బంధువైన కరీంనగర్‌‌‌‌ జిల్లాకు చెందిన మరో మంత్రి కూడా ఎక్స్‌‌‌‌టెన్షన్‌‌‌‌ కోసం ఈఎన్సీపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. కేసీఆర్‌‌‌‌ దృష్టికి ఈ విషయాలు తీసుకెళ్తామని, మరో సీఈని నియమించి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయించాలని కోరుతామని అంటున్నారు.

బిల్లు ఇప్పిస్తా..రూ.2.50 కోట్ల విల్లా గిఫ్ట్‌‌‌‌ ఇవ్వు

దేవాదుల ప్రాజెక్టు పనులు చేసిన ఒక వర్క్‌‌‌‌ ఏజెన్సీకి పెద్ద మొత్తంలో బిల్లు పెండింగ్‌‌‌‌లో ఉంది. ఆ మొత్తాన్ని త్వరగా ఇప్పిస్తానని, అందుకు తనకు గిఫ్టుగా రూ.2.50 కోట్ల విలువైన విల్లా ఇవ్వాలని సీఈ డిమాండ్‌‌‌‌ చేసినట్లు ఆరోపణలున్నాయి. తాను అప్పులు తెచ్చి పనులు చేయించానని, అంతభారీగా ఇచ్చుకోలేనని కాంట్రాక్టర్ చెప్పినా ఇవ్వాల్సిందేనని సీఈ తేల్చిచెప్పినట్టు సమాచారం. ఇప్పుడు ఆ పోస్టును ఖాళీ చేస్తే విల్లా అందకుండా పోతుందని, అందుకే మరోసారి ఎక్స్‌‌‌‌టెన్షన్‌‌‌‌ కోసం ఆయన ప్రయత్నిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది.