రిటైర్మెంట్ ఏజ్ పెంపుతో నిరుద్యోగులకు నిరాశ

రిటైర్మెంట్ ఏజ్ పెంపుతో నిరుద్యోగులకు నిరాశ

రిటైర్మెంట్ ఏజ్ పెంపుతో మూడేండ్ల వరకు కొత్తగా ఖాళీలు ఏర్పడవ్​
పెండింగ్​లో పడనున్న 18 వేల పోస్టులు 
2024  మార్చి దాకా ప్రభుత్వానికి రిటైర్మెంట్​ బెనిఫిట్స్ ఆదా


ఉద్యోగుల రిటైర్మెంట్  ఏజ్ ను 58 నుంచి 61 ఏండ్లకు పెంచడంతో నిరుద్యోగులపై తీవ్ర ఎఫెక్ట్​ పడనుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఈ నెలాఖరు నుంచి 2024 మార్చి 31 దాకా గవర్నమెంట్​ పోస్టుల వేకెన్సీ ఉండదు. దీంతో కొత్తగా రిక్రూట్​మెంట్లు జరగవు. మూడు నెలల కింద సీఎం ప్రకటించిన 50 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసి, నోటిఫికేషన్లను ఆపేసే అవకాశం ఉందని అధికార వర్గాలు అంటున్నాయి. అన్ని శాఖల్లో కలుపుకొని ఏటా  సగటున 6 వేల మంది ఉద్యోగులు రిటైర్​ అవుతుంటారు. ఇక నుంచి మూడేండ్ల వరకు ఈ రిటైర్మెంట్లు ఉండవు. అంటే మూడేండ్లలో నిరుద్యోగులకు దక్కాల్సిన దాదాపు 18 వేల ఖాళీలు అందుబాటులోకి రావు. 
 
ఏటా రూ. 2,700 కోట్లు సర్కారుకు సర్దుబాటు

రిటైర్మెంట్​ వయసు పెంపుతో ప్రభుత్వానికి మూడేండ్ల దాకా ఆదాయ సర్దుబాటు జరుగనుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏటా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు సుమారు రూ. 2,700 కోట్ల బెనిఫిట్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ బెనిఫిట్స్​ను మూడేండ్ల తర్వాత చెల్లించే వెసులుబాటు కలిగింది.  ‘‘ఈ నెలాఖరున రిటైర్​ కావాల్సిన దాదాపు 650 మంది ఉద్యోగులు సీఎం కేసీఆర్ ప్రకటనతో మరో మూడేండ్ల పాటు సర్వీస్ లో ఉంటారు. వారికి చెల్లించాల్సిన బెనిఫిట్స్​ను మూడేండ్ల తర్వాతే ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వానికి ఆదాయ సర్దుబాటు జరుగుతుంది’’ అని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొన్నాయి.

21 నెలల బకాయిలు గాయబ్​

33  నెలలు ఆలస్యంగా ప్రభుత్వం పీఆర్సీని అమలు చేస్తోంది. నిజానికి 2018 జులై  నుంచి కొత్త ఫిట్​మెంట్​ అమలు చేయాలి. కానీ 12 నెలల ఫిట్​మెంట్​ బకాయిలను చెల్లిస్తామని, అదికూడా రిటైర్మెంట్​ బెనిఫిట్స్ తో కలిపి ఇస్తామని ప్రకటించింది. ఫలితంగా ఉద్యోగులకు  21 నెలల ఫిట్​మెంట్​ బకాయిలు అందకుండాపోతున్నాయి. దీంతో ప్రభుత్వానికి సుమారు రూ. 12 వేల కోట్లు ఆదా అవుతాయని అధికార వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వం చెల్లిస్తామని చెప్పిన 12 నెలల బకాయిల అమలు కూడా రిటైర్మెంట్​ ఏజ్​ పెంపుతో మూడేండ్ల తర్వాత నుంచి మొదలు కానుంది. అప్పటివరకు ఆ డబ్బులను కూడా ప్రభుత్వం సర్దుబాటు చేసుకునే వీలుంటుంది. సీపీఎస్ ఎంప్లాయీస్ కు 12 నెలల బకాయిలను రిటైర్మెంట్ సమయంలో ఇచ్చే చాన్స్ లేదు. మరి వీరికి బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో ప్రభుత్వం
ప్రకటించలేదు. 

కొత్తగా టీచర్, పోలీస్​ కొలువులు లేనట్లే

ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువ ఖాళీలు ఉండేది ఎడ్యుకేషన్, పోలీస్​ డిపార్ట్​మెంట్​లోనే. రిటైర్మెంట్​ ఏజ్​ పెంపుతో  మూడేండ్ల వరకు ఈ డిపార్ట్​మెంట్లలోనూ ఎలాంటి ఖాళీలు ఉండవు. ఇప్పటికే లక్షలాది మంది డీఎడ్​, బీఎడ్​ పూర్తి చేసి టీచర్​ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారు. పోలీస్​ ఉద్యోగాల కోసం కూడా చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ తాజా ప్రకటనతో వీరందరి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఆరేండ్లుగా ప్రభుత్వం పెద్దగా నోటిఫికేషన్లు వేయడం లేదని, వేసినా అవి చిన్నా చితకవేనని నిరుద్యోగులు ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు రిటైర్మెంట్​ ఏజ్​ను పెంచి మూడేండ్ల పాటు పోస్టులు భర్తీ చేయకుండా తప్పించుకోవాలని చూస్తోందని మండిపడుతున్నారు. ఏటా 2,500 మంది టీచర్లు, పోలీసు శాఖలో వివిధ హోదాల్లో 2 వేల మంది రిటైర్ట్ అవుతుంటారు. మూడేండ్ల దాకా ఈ రిటైర్మెంట్లు ఆగిపోయి.. రిక్రూట్మెంట్లకు బ్రేకులు పడనున్నాయి.

వయోపరిమితి పెంపుతో నిరుద్యోగులకు అన్యాయం
ఓయూలో  కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన స్టూడెంట్స్

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని 61 ఏళ్లకు పెంచడాన్ని నిరసిస్తూ సోమవారం ఓయూ స్టూడెంట్స్ క్యాంపస్‌లో సీఎం కేసీఆర్​ దిష్టిబొమ్మను దహనం చేశారు. తర్వాత టీజీవీఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సురేశ్‌ యాదవ్ మాట్లాడుతూ.. ఒక వైపు నిరుద్యోగం పెరిగిపోతుంటే ఉద్యోగుల వయో పరిమితి పెంచడం ఏంటని ప్రశ్నించారు. కేవలం ఉద్యోగ సంఘాల మెప్పుకోసమే వయో పరిమితి పెంచి నిరుద్యోగులకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఫలితాలు వచ్చిన వెంటనే ఉద్యోగుల పీఆర్సీపై నిర్ణయం తీసుకున్న కేసీఆర్​కు  ఉద్యోగాల ప్రకటన ఎందుకు గుర్తుకు రాలేదన్నారు. వెంటనే నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో టీజీవీఎఫ్ నాయకులు ఉపేందర్ నాయక్, శ్రావణ్ యాదవ్, మహేశ్‌ గౌడ్, గౌతమ్, మహేశ్‌ యాదవ్ పాల్గొన్నారు.