ఇదేం క్రమశిక్షణ?..కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చిన్న నేతలపైనే చర్యలు

ఇదేం క్రమశిక్షణ?..కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చిన్న నేతలపైనే చర్యలు
  • పెద్ద నేతలకు షోకాజ్‌‌‌‌‌‌‌‌ నోటీస్‌‌‌‌‌‌‌‌లతో సరి
  • సమస్య పరిష్కారంపై దృష్టిపెట్టని పీసీసీ క్రమశిక్షణ కమిటీ
  • కోల్డ్​స్టోరేజీలో పెడ్తున్న తీరుపై క్యాడర్​లో అయోమయం
  • ఆయా నియోజకవర్గాల్లో ఎప్పట్లాగే విభేదాలు
  • ఇలాగైతే భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో నష్టం తప్పదనే అభిప్రాయాలు

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​లో కట్టుతప్పుతున్న నేతలపై క్రమశిక్షణ చర్యలు కరువయ్యాయి. పార్టీ లైన్​కు భిన్నంగా తమ మాటలు, చేతల ద్వారా నష్టం కలిగిస్తున్నవారిపై వేటు వేయాల్సిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ, కేవలం షోకాజ్ నోటీసులకే పరిమితమవుతోందనే చర్చ జరుగుతోంది. చోటా నేతలపై సస్పెన్షన్​లాంటి పెద్ద చర్యలు తీసుకుంటూ బడా నేతలను మాత్రం షోకాజ్​నోటీసులతో వదిలేస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి.

నిజానికి చిన్న నేతలకంటే పెద్దనేతల వల్లే రాజకీయంగా పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతున్నప్పటికీ చర్యలకు క్రమశిక్షణ కమిటీ వెనుకాడుతున్న తీరు హాట్​టాపిక్​లా మారింది. ఆయా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఎక్కడ గ్యాప్​ ఉందో, ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో తేల్చి, బాధ్యులపై చర్యలు తీసుకుంటే పార్టీ గాడిన పడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా సమస్యను కోల్డ్​స్టోరేజ్​లో పెడ్తున్నారని, దీనివల్ల భవిష్యత్​లో పార్టీకి నష్టం తప్పదనే ఆందోళన క్యాడర్​లో వ్యక్తమవుతోంది. 

ఎన్నో ఉదాహరణలు.. 
    
పాలకుర్తి కాంగ్రెస్​ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డి వర్గానికి, పార్టీలోని మరో వర్గానికి నడుమ ఆధిపత్యపోరు నడుస్తోంది. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఇటీవల పీసీసీ క్రమశిక్షణ కమిటీకి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. తమ నియోజకవర్గంపై కన్నేసిన ఇద్దరు బడా నేతలు.. వచ్చే ఎన్నికలనాటికి తమను బలహీనపరిచే లక్ష్యంతో పావులు కదుపుతున్నారని, తమ పని తమను చేసుకోకుండా పార్టీలో, ప్రభుత్వంలో అడ్డుతగులుతున్నారని అత్తాకోడళ్లిద్దరూ ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని సాక్ష్యాత్తూ అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే, పీసీసీ ఉపాధ్యక్షురాలు వచ్చి ఫిర్యాదు చేసినా సదరు నేతలపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 
    
కామారెడ్డి నియోజకవర్గంలో పాత, కొత్త నేతల నడుమ పంచాయతీ నడుస్తోంది. సీనియర్ నేత షబ్బీర్ అలీ అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో చేరిన చంద్ర శేఖర్ రెడ్డి వర్గాల నడుమ వివాదం  చినికిచినికి గాలివానలా మారింది.  వీరిలో చంద్ర శేఖర్ రెడ్డికి షోకాజ్ నోటీసు ఇవ్వగా, షబ్బీర్ అలీ వర్గంపై ప్రత్యర్థి వర్గం చేసిన ఫిర్యాదును పరిశీలిస్తున్నట్లు క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది. ఈ విషయంలో ఇంతకుమించి అడుగు ముందరపడలేదు. 
    
సిద్దిపేట జిల్లాకు అప్పటి డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డికి, మరో సీనియర్ నేత హరికృష్ణకు మధ్య వివాదం ముదిరి పంచాయితీ గాంధీ భవన్ కు చేరినా.. షోకాజ్ నోటీసులు తప్ప చర్యలు లేవు.
    
కొండా సురేఖ దంపతులు, ఉమ్మడి వరంగల్​జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల మధ్య అప్పట్లో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళిపై ఆ జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇతర నేతలు.. క్రమశిక్షణ కమిటీకి వరుస ఫిర్యాదులు చేసుకున్నారు. వాటిని స్వీకరించిన క్రమశిక్షణ కమిటీ.. ఇప్పటి వరకు ఏ ఒక్కరిపై చర్యలు తీసుకోలేదు.
    
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  పలుమార్లు పార్టీ లైన్​దాటి, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.  క్రమశిక్షణ కమిటీ ఆయనకు కేవలం షోకాజ్ నోటీసు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. ఆయన ఇప్పటివరకు నోటీసుకు స్పందించి కమిటీ ముందు హాజరుకాలేదు. కేవలం తన వివరణను లేఖ ద్వారా కమిటీకి పంపించారు. ఆ లేఖతోనే కమిటీ తృప్తి పడింది తప్ప రాజగోపాల్​రెడ్డిపై ఇప్పటివరకు చర్యలకు సాహసించలేదు.
    
గద్వాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్  రెడ్డి, ఆయనపై పోటీచేసి ఓడిపోయి, ప్రస్తుతం ఓ కార్పొరేషన్ చైర్​పర్సన్​గా ఉన్న సరిత తిరుపతి యాదవ్​ వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలో ఇరువర్గాలు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నా ఇప్పటివరకు షోకాజ్ నోటీసులే తప్ప చర్యలు లేవు. దీంతో వీరి మధ్య విభేదాలు ఎప్పట్లాగే కొనసాగుతున్నాయి.  
    
పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ లైన్​కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ  కాటం శ్రీనివాస్ గౌడ్ పలుమార్లు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రత్యేక కమిటీ వేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆ నియోజకవర్గంలోని సీనియర్ నేతలు క్రమశిక్షణ కమిటీ పై బహిరంగంగా తీవ్ర విమర్శలు గుప్పించారు.