చెరువులో పడ్డ ట్రాక్టర్.. 11 మంది మృతి..మధ్యప్రదేశ్ లో దుర్గాదేవి నిమజ్జనోత్సవంలో అపశ్రుతి

చెరువులో పడ్డ ట్రాక్టర్.. 11 మంది మృతి..మధ్యప్రదేశ్ లో దుర్గాదేవి నిమజ్జనోత్సవంలో అపశ్రుతి

భోపాల్: దసరా పండుగ వేళ మధ్యప్రదేశ్ లో దుర్గాదేవి నిమజ్జనోత్సవంలో విషాదం చోటు చేసుకుంది. ఖండ్వా జిల్లాలో దుర్గమాత విగ్రహాలను తరలిస్తున్న ట్రాక్టర్‌‌‌‌ చెరువులో పడటంతో11 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎనిమిది మంది టీనేజీ బాలికలు ఉన్నారు. ఖండ్వా జిల్లా పంధానా తహసీల్ లోని అర్దలా గ్రామంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే స్పాట్ కు చేరుకున్నారు. 

సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్ లో 25మందికిపైగా ఉన్నారని తెలిపారు. పలువురికి గాయాలయ్యాయని చెప్పారు. బాధితులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. నిమజ్జనం కోసం ట్రాక్టర్ ను చెరువు సమీపంలోని కల్వర్టు పై ఉంచగా అదుపు తప్పి బోల్తా పడిందని వివరించారు. 

స్థానిక కాపలాదారు హెచ్చరించినప్పటికి ట్రాక్టర్ లోని వారు ఖాతరు చేయకపోవడంతో ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషీయా ప్రకటించారు.