డిఫెన్స్, క్లైమేట్​ చేంజ్​పై చర్చలు కూడా రద్దు

డిఫెన్స్, క్లైమేట్​ చేంజ్​పై చర్చలు కూడా రద్దు

పెలోసీ పర్యటన మా సార్వభౌమత్వాన్ని కించపరిచింది: చైనా

బీజింగ్: తన అభ్యంతరాలను లెక్కపెట్టకుండా తైవాన్​లో పర్యటించిన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ ​నాన్సీ పెలోసీ, ఆమె కుటుంబంపై చైనా ఆంక్షలు విధించింది. తైవాన్​లో పర్యటించరాదని ఎంతగా విజ్ఞప్తి చేసినా విననందుకు ఈ ఆంక్షలు విధించామని చైనా తెలిపింది. చైనాకు అమెరికా దౌత్యవేత్త క్రిస్​బర్స్న్ ను పిలిపించుకుని నిరసన వ్యక్తం చేసింది. తైవాన్ ​జలసంధిలో నాలుగు రోజులపాటు సైనిక విన్యాసాలు నిర్వహిస్తామని క్రిస్​కు చైనా విదేశీ మంత్రిత్వశాఖ స్పష్టంచేసింది. డిఫెన్స్,​ క్లైమేట్​చేంజ్ తదితర అంశాలపై యూఎస్​తో నిర్వహించాల్సిన చర్చలనుకూడా రద్దు చేసుకున్నామని ఓ ప్రకటనలో తెలిపింది. తమ భూభాగంలో తైవాన్ ​భాగమని చైనా వాదిస్తోంది. తమ అనుమతి లేకుండానే పెలోసీ.. తైవాన్​లో అడుగుపెట్టడంతో అమెరికాపై చైనా ఆగ్రహంగా ఉంది. ‘‘మా అనుమతి లేకుండా తైవాన్​లో పెలోసీ పర్యటించడం మా దేశ అంతర్గత వ్యవహారాల్లో తల దూర్చడమే అవుతుంది. చైనా సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను కూడా ఆమె పర్యటన  కించపరచినట్లయింది. అందువల్లే పెలోసీ, ఆమె కుటుంబం మా దేశంలో పర్యటించకుండా నిషేధం విధించాం” అని చైనా విదేశీ మంత్రిత్వశాఖ పేర్కొంది. 

జిన్​పింగ్​కు అవమానకరం: మీడియా

తైవాన్​లో పెలోసీ పర్యటించకుండా అడ్డుకోవడంలో చైనా ప్రభుత్వం ఫెయిలైందని ఆ దేశ లోకల్​మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె పర్యటన ప్రెసిడెంట్ ​షీ జిన్​పింగ్ ​ఇమేజీకి అవమానకరమని మీడియాలో కథనాలు వచ్చాయి. కాగా, తైవాన్ ​నుంచి పెలోసీ వెళ్లిపోయిన తర్వాత తైవాన్ జలసంధిలో చైనా గురువారం సైనిక విన్యాసాలు చేసింది. ఈ విషయాన్ని తైవాన్ ​ధ్రువీకరించింది. చైనా సైనిక విన్యాసాలను అమెరికా విదేశాంగ శాఖ సెక్రటరీ ఆంటొనీ బ్లింకెన్​ ఖండించారు.

పెలోసీపై ఆంక్షలు న్యాయమైనవే

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్​ నాన్సీ పెలోసీ, ఆమె కుటుంబంపై తాము విధించిన ఆంక్షలు న్యాయమైనవే అని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి హువా చున్​యింగ్​అన్నారు. పెలోసీ విషయంలో చైనా అతిగా ప్రవర్తించిందని వైట్​హౌస్​ నేషనల్​సెక్యూరిటీ కౌన్సిల్​ ప్రతినిధి జాన్​కిర్బీ అంతకుముందు చేసిన వ్యాఖ్యలకు 
చున్​యింగ్​ ఈవిధంగా స్పందించారు.

తైవాన్​లో పర్యటించకుండా మమ్మల్ని అడ్డుకోలేరు: పెలోసీ

టోక్యో: అమెరికా అధికారులను తైవాన్​లో పర్యటించకుండా చైనా అడ్డుకోలేదని అమెరికా స్పీకర్​నాన్సీ పెలోసీ అన్నారు. తన ఆసియా టూర్​చివరి రోజున ఆమె శుక్రవారం జపాన్​లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వరల్డ్​ హెల్త్​ ఆర్గనైజేషన్​లో చేరకుండా తైవాన్​ను అడ్డగించి, ఏకాకిని చేయాలని చైనా ప్రయత్నించిందని అన్నారు. ‘‘తైవాన్​కు బయటి ప్రపంచంతో సంబంధాలను చైనా తెంపవచ్చేమో కానీ మమ్మల్ని (అమెరికా అధికారులు) తైవాన్​కు వెళ్లకుండా వారు (చైనా) అడ్డుకోలేరు” అని పెలోసీ వ్యాఖ్యానించారు.