ఆర్టీసీ సమ్మెపై 27న చర్చలు?

ఆర్టీసీ సమ్మెపై 27న చర్చలు?

హైదరాబాద్‌‌, వెలుగు:సమ్మె చేస్తున్న ఆర్టీసీ యూనియన్లను సర్కారు ఈ నెల 27వ తేదీన చర్చలకు ఆహ్వానించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. 28న విచారణ చేపడతామని హైకోర్టు చెప్పడంతో.. అంతకు ఒక రోజు ముందు చర్చలకు పిలవాలని, అప్పటిదాకా వేచి చూడాలని నిర్ణయించినట్టు సమాచారం. వాస్తవానికి ఈ నెల 19న ఉదయమే చర్చలు ప్రారంభించాలని హైకోర్టు ఆదేశించినా సర్కారు ఇప్పటివరకు ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. కోర్టు ఉత్తర్వుల కాపీ అందలేదంటూ కాలయాపన చేస్తున్నట్టు తెలిసింది. ఆదివారం సెలవు కావడంతో కాపీ రాలేదని, సోమవారం అందినా స్పందన ఉండే అవకాశం లేదని సమాచారం. ఉత్తర్వుల కాపీని అధ్యయనం చేయడానికి సమయం పట్టిందని సర్కారు చెప్పుకొనే అవకాశముందని న్యాయ నిపుణులు అంటున్నారు.

విచారణకు ముందు రోజు దాకా..

ఆర్టీసీ సమ్మె అంశంపై 28వ తేదీన హైకోర్టులో విచారణ జరుగనుంది. ఈ వారం పాటు సర్కారు దాటవేత ధోరణినే అవలంబించే అవకాశముందని, అందుకే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైనే దృష్టి పెట్టారని తెలుస్తోంది. ‘‘ఎన్ని రోజులు సమ్మె చేస్తరో చేయనీయండి. ఇప్పటికే 16 రోజులైంది. భవిష్యత్‌‌ లేని భవిష్యత్‌‌ కార్యచరణ రూపొందించుకుంటున్నరు..’’అని సీఎం సన్నిహితుల వద్ద పేర్కొన్నట్టు సమాచారం. కార్మికులపై జనంలో వ్యతిరేకత పెరుగుతోందని, ఇంకా పెరిగేలా సైలెంట్‌‌గా ఉండటమే బెటర్‌‌ అని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కోర్టు విచారణ ముందు రోజు చర్చలకు పిలవడం వల్ల.. కోర్టులో ఇబ్బంది లేకుండా ఉంటుందని యోచిస్తున్నట్టు సమాచారం.

జీతాలు అందుతయా?

కార్మికులకు సోమవారమైనా జీతాలు అందుతాయా అన్నదానిపై సందిగ్ధం నెలకొంది. ఆర్టీసీ ప్రతి నెలా 5వ తేదీనాటికి జీతాలు ఇచ్చేది. ఈ నెల 5వ తేదీ నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో జీతాలు ఇవ్వలేదు. జీతాలు లేకుండానే కార్మికులకు దసరా పండుగ గడిచింది. దీనిపై టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోర్టును ఆశ్రయించగా.. సోమవారం లోపు జీతాలు వచ్చేలా చూస్తామని సర్కారు చెప్పింది. కానీ ఇంకా అందలేదు. సోమవారం ఇస్తారా, లేదా అన్నది అధికారులు చెప్పలేకపోతున్నారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సమీక్షలు

సమ్మె కొనసాగుతుండటంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై రవాణా మంత్రి పువ్వాడ అజయ్​ సమీక్షించారు. సోమవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు తిరిగి ప్రారంభమవుతుండటంతో వంద శాతం బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. ఆదివారం 6,437 బస్సులు నడిపామని ఆర్టీసీ అధికారులు చెప్పారు.

సీఎం చెప్పేదాకా ఆగాల్సిందే..!

ఆదివారం మధ్యాహ్నం ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రగతి భవన్‌‌కు వెళ్లి సీఎంవో ఉన్నతాధికారులను కలిశారు. సమ్మె పరిస్థితిపై చర్చించారు. కోర్టు ఆర్డర్‌‌ కాపీ అందిందా అని సీఎంవో అధికారులు ఆరా తీయగా.. సోమవారం ఉదయం అందే అవకాశమున్నట్టు ఆర్టీసీ అధికారులు వివరించారు. కార్మికుల కోరినవాటిలో 12 డిమాండ్లు ఆర్థిక పరమైనవి కావని, వాటిని సులువుగా పరిష్కరించే అవకాశముందని విచారణ సందర్భంగా కోర్టు పేర్కొన్న నేపథ్యంలో.. అవేమిటో లిఖితపూర్వకంగా వచ్చిన కాపీలో పరిశీలించాలని అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. దాని ప్రకారం.. ఆర్టీసీపై ఆర్థిక భారం పడని హామీలను నెరవేర్చే విషయమై సీఎంకు నివేదించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలా, కోర్టు ఆర్డర్‌‌ కాపీని నేరుగా అందజేయాలా అన్నదానిపై ఆలోచిద్దామని సీఎంవో అధికారులు చెప్పినట్టు సమాచారం. మొత్తంగా సీఎం ఆదేశాలు వచ్చే వరకు వేచి ఉండాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు తిరిగి వెళ్లిపోయారు.