చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రమాదకరంగా తయారవుతున్న బీపీ, షుగర్

చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రమాదకరంగా తయారవుతున్న బీపీ, షుగర్
  • హెల్త్ డిపార్ట్​మెంట్ ఎన్​సీడీ స్క్రీనింగ్​లో వెల్లడి
  • 25 జిల్లాల్లో సర్వే పూర్తి.. ఇంకో 8 జిల్లాల్లో పెండింగ్
  • రాష్ట్రంలో 19 లక్షల మందికి బీపీ లేదా షుగర్
  • మరో 15 లక్షల మందికిపైగా షుగర్ ఉండొచ్చని అంచనా

హైదరాబాద్, వెలుగు: బీపీ, షుగర్ వంటి జబ్బులు చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రమాదకరంగా తయారవుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి వంద మందిలో 26 మందికి బీపీ, షుగర్ లేదా రెండింటిలో ఏదో ఒకటి ఉన్నట్లు హెల్త్ డిపార్ట్​మెంట్ అంచనా వేసింది. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్‌సీడీ) స్ర్కీనింగ్‌లో భాగంగా చేస్తున్న ఇంటింటి సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 25 జిల్లాల్లో సర్వే పూర్తవగా, హైదరాబాద్‌ సహా ఇంకో 8 జిల్లాల్లో పూర్తి చేయాల్సి ఉంది. కరోనా కారణంగా ఇన్నాళ్లు ఎన్‌సీడీ స్ర్కీనింగ్ ఆపేయగా.. ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టారు. రాష్ట్రంలో 30 ఏండ్లు దాటిన వాళ్లు 1.37 కోట్ల మంది ఉండగా.. సర్వేలో భాగంగా ఇప్పటిదాకా కోటి 8 లక్షల 41 వేల 495 మందికి టెస్టులు చేశారు. వీరిలో 12 లక్షల 95 వేల 146 మందికి బీపీ, 5 లక్షల 94 వేల 863 మందికి షుగర్ ఉన్నట్టు గుర్తించారు. ఇంకో 15 లక్షల మందికి పైగా షుగర్ ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వాళ్లకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టెస్టులు చేయిస్తున్నారు. 
ఎందుకింతలా?
బీపీ, షుగర్ మాత్రమే కాదు.. గుండె, కిడ్నీ జబ్బులు, సీవోపీడీ, కేన్సర్ కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఇవేవీ ఒకరి నుంచి ఒకరికి వచ్చే జబ్బులు కాదు. ఎవరికి వారు కొనితెచ్చుకుంటున్నవేనని, లైఫ్‌ స్టయిల్‌లో వచ్చిన మార్పులే ఇందుకు కారణమని డాక్టర్లు చెప్తున్నారు. సమయానికి తినకపోవడం, ఇన్‌స్టంట్ పేరిట ఉప్పు, ఇతర రసాయనాలు కలిపిన ప్యాక్డ్ ఫుడ్, జంక్​ఫుడ్ తినడం, గాలి కాలుష్యం, పంటల్లో పురుగు మందుల వాడకం, శారీరక శ్రమ తగ్గిపోవడం, ఎక్సర్​సైజ్ చేయకపోవడం, వర్క్ ప్రెజర్ వంటి అనేక కారణాలు ఉన్నాయని డాక్టర్లు వివరిస్తున్నారు. 
ఇలా చేస్తే బెటర్!
లైఫ్ స్టయిల్ డిసీజ్‌ల నుంచి జనాన్ని కాపాడాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మార్పులు రావాలి. హెల్త్​ ఎడ్యుకేషన్‌ను మెరుగు పరచాలి. పార్కుల సంఖ్య పెంచి, స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశం ఇవ్వాలి. కాలుష్య నియంత్రణకు, పంటల్లో పురుగుమందుల వాడకాన్ని తగ్గించేందుకు ప్రణాళికలు అమలు చేయాలి. తిండి, నీళ్లు, పాలు, ఇతర ఆహార పదార్థాలు కల్తీ కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పర్సనల్ లైఫ్​ బాగా తగ్గిపోయింది. 8 గంటల పని రూల్ అమలు కావట్లేదు. పని ఒత్తిడి, టార్గెట్ల వెనక పరిగెత్తడం పెరిగిపోయింది. ఆఫీస్ వర్క్, సోషల్ మీడియా, మొబైల్ గేమ్స్ తప్పితే శారీరక శ్రమ ఉండడం లేదు. చాలామంది యువతకు బీపీ, షుగర్ రావడానికి ఇదే కారణం. అది తగ్గాలంటే పని గంటల రూల్ కచ్చితంగా అమలయ్యేలా చూడాలి. పని వాతావరణం మారాలి. ఎవరికివారు తమ ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలి. వ్యాయమం చేయాలి. జంక్​ఫుడ్ అలవాట్లు మార్చుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
ప్యాక్డ్‌ ఫుడ్ పక్కనబెట్టాలి
స్క్రీనింగ్ లో తేలిన దాని కంటే ఎక్కువ మంది పేషెంట్స్‌ ఉండొచ్చు. ఇంతమందిలో బీపీ, షుగర్ ఉండడానికి లైఫ్‌ స్టయిల్‌లో వచ్చిన మార్పులే కారణం. ఆటోమేషన్‌తో ఫిజికల్ యాక్టివిటీ చాలావరకు తగ్గిపోయింది. స్మార్మ్ ఫోన్లు పర్సనల్ స్పేస్‌ను ఆక్రమించాయి. పని ఒత్తిడి పెరిగిపోయింది. ఆహారపు అలవాట్లలో మార్పులొచ్చాయి. ప్రతి ఇంట్లోనూ ఇన్‌స్టంట్ ప్యాక్డ్ ఫుడ్ అలవాట్లు వచ్చేశాయి. ప్రపంచంలోని ఏ దేశంలోనైనా బీపీ, షుగర్ రావడానికి ఇవే ప్రధాన కారణాలు. వీటిని మార్చుకోవాలి. రెగ్యులర్‌‌గా టెస్టు చేయించుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ పెంచడం, ప్యాక్డ్ ఫుడ్ పక్కనబెట్టి రోగాల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు.  - డాక్టర్ జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  ఎండోక్రైనాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌