కేంద్ర పథకాల తీరును పట్టించుకోని ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు

 కేంద్ర పథకాల తీరును పట్టించుకోని ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు:కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన దిశ రివ్యూ మీటింగ్​ జాడ లేకుండా పోయింది. ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించాల్సిన ఈ మీటింగ్​ రెండేండ్లు కావొస్తున్నా నిర్వహించడం లేదు. ఈ మీటింగ్​పై అధికారులతో పాటు ఇటు ప్రజాప్రతినిధులకు పట్టింపు లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు మనకెందుకు అనుకున్నారేమో అధికార టీఆర్​ఎస్​ పార్టీ ప్రజాప్రతినిధులు దిశ మీటింగ్​ ఊసెత్తడం లేదు. 

మూడు నెలలకోసారి వట్టిమాటే..
మహబూబాబాద్​ ఎంపీ మాలోత్​ కవిత అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్​లో కో చైర్మన్​ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్​రావుతో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కలెక్టర్, ఎస్పీ, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఈ మీటింగ్​ను డీఆర్డీఏ అధికారులు సమన్వయం చేస్తుంటారు. జిల్లాలో రూ. కోట్ల కేంద్ర నిధులతో డెవలప్​మెంట్​ వర్క్స్​ జరుగుతున్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ది నిధులు, సీఎస్ఆర్​ ఫండ్స్​తో పాటు ప్రత్యేక నిధులు, ఈజీఎస్, హాస్పిటల్స్​లలో ఎన్ఆర్​హెచ్ఎంతో చేపడుతున్న పనులు, ఆర్అండ్​బీ, పంచాయతీరాజ్​, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, స్వచ్ఛ భారత్, ఐసీడీఎస్, పౌర సరఫరాల శాఖ, రైల్వే, టెలికాం, ఫారెస్ట్​, ఇతరత్రా శాఖల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న పథకాలను రివ్యూ చేస్తుంటారు. గతంలో జరిగిన మీటింగ్​పై సమీక్షిస్తారు. ఇంతటి కీలకమైన మీటింగ్​ పట్ల ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటికప్పుడు సమీక్షిస్తేనే పనుల్లో జాప్యం, ఫండ్స్, శాఖల మధ్య సమన్వయం తదితర అంశాలను చర్చించే అవకాశం ఉంటుందని అంటున్నారు.

చివరి సారిగా 2020 నవంబర్​లో దిశ మీటింగ్​ నిర్వహించారు. జూన్ లో దిశ మీటింగ్​ నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేయగా వరదలతో వాయిదా వేశారు. ఇటీవల దిశ మీటింగ్​ పెట్టాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్​రావు అధికారులకు సూచించినా చైర్మన్​తో పాటు అధికారులు పట్టించుకోలేదు. జిల్లాలోని పాండురంగాపురం నుంచి భద్రాచలం రైల్వే లైన్, నేషనల్​ హైవే పనుల్లో జాప్యం, ఇల్లందు, మణుగూరు హాస్పిటల్స్​లో వైద్యులు, సిబ్బంది కొరత వంటి పలు అంశాలు చర్చించాల్సి ఉంది. ఇప్పటికైనా కమిటీ చైర్మన్​తో పాటు కలెక్టర్​ స్పందించి మీటింగ్​ను నిర్వహించాలని ప్రజలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.