పరిగిలో కొప్పుల మహేశ్ వర్సెస్ బుయ్యని మనోహర్

పరిగిలో  కొప్పుల మహేశ్ వర్సెస్ బుయ్యని మనోహర్
  •  భారీ కాన్వాయ్​తో హడావుడి 
  • హైవేలో ట్రాఫిక్​జామ్​తో జనానికి ఇబ్బందులు

పరిగి, వెలుగు: బీఆర్ఎస్ పరిగి సెగ్మెంట్​లో వర్గ పోరు కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లోనూ పరిగి ఎమ్మెల్యే టికెట్ తనకే వస్తుందని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​రెడ్డి ధీమాతో ఉండగా.. ‘లేదు ఈసారి నాకు వస్తుందని’ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నట్లు సమాచారం. కొన్ని రోజులుగా వీరిద్దరూ ఏ ప్రోగ్రామ్​కు వెళ్లినా భారీ కాన్వాయ్​ల్లో అనుచరులు, కార్యకర్తలను వెంట తీసుకెళ్తూ హడావుడి చేస్తున్నారు. ఆదివారం మహేశ్ రెడ్డి బర్త్ డే కాగా.. ఆయన అనుచరులు మన్నెగూడ నుంచి పరిగి పట్టణానికి సుమారు 70 కాన్వాయ్​లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటి ముందు సుమారు 20 నిమిషాల పాటు కాన్వాయ్​లను ఆపి ఆయనకు సన్మానం చేయడంతో ట్రాఫిక్​జామ్​ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉంటే.. బుయ్యని మనోహర్ రెడ్డి మాదారం గ్రామంలోని ప్రభుత్వ స్కూల్ లో టెన్త్ స్టూడెంట్లకు స్టడీ మెటీరియల్ అందించేందుకు సోమవారం సుమారు 60 కాన్వాయ్​లతో బయలుదేరి వెళ్లారు. దీంతో ఆ రూట్​లో  ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి, మనోహర్ రెడ్డి చేస్తున్న ఈ హడావుడి తమకు ఇబ్బందిగా మారుతోందని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.