ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ ... సద్దుమణగని వివాదం

ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ ... సద్దుమణగని వివాదం

ఆస్కార్ కు కొన్ని అడుగుల దూరంలో ఉన్న ఆర్ఆర్ఆర్ చిత్రంపై సినీ ప్రముఖుల వ్యాఖ్యలు చేసిన వివాదం ఇంకా సద్దుమణగలేదు. వీలైతే సైలెంట్ గా ఉండాలి గానీ.. ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమని మెగా బ్రదర్ నాగబాబు ఫైర్ అయ్యారు. మన సినిమాకు ఆస్కార్ వస్తుందంటే గర్వపడాలి గానీ.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని మండిపడ్డారు. ప్రపంచమంతా నాటు నాటు సాంగ్ పై ప్రశంసలు కురిపిస్తుంటే.. మీకున్న పొలిటికల్ బ్యాగ్రౌండ్ తో ఇలా మాట్లాడడం చాలా తప్పు అని నాగబాబు అన్నారు. విజయం సాధిస్తే ప్రశంసించండి.. తప్పు చేస్తే మంచిగా చేయాలని వెన్ను తట్టండి.. అంతే గానీ ఇలా మాట్లాడడం తప్పని చెప్పారు. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి అంటూ నాగబాబు వీడియో ద్వారా తెలియజేశారు.

ఓ వైపు భారతీయ సినిమాను అందరూ పొగుడుతూ ఉంటే.. మరో వైపు ఆ సినిమాపైనే సినీ నిర్మాత తమ్మారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దీంతో పలువురు ఆయన్ను లక్ష్యంగా చేసుకొని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో నిలబడడానికి చిత్ర యూనిట్ రూ.80 కోట్లు ఖర్చు చేసిందని.. ఆ డబ్బుతో తాను పది సినిమాలు తీస్తానని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్ చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అసలు ఆ సినిమాకు రూ.80 కోట్లు ఖర్చు పెట్టడానికి మీ దగ్గర లెక్కలున్నాయా అంటూ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ప్రశ్నించడం మరో సంచలన విషయంగా మారింది. జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ వంటి వారు డబ్బు తీసుకొని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా? అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించడాన్ని నెటిజన్లు సపోర్ట్ చేస్తున్నారు. 

ఇక మెగా ఫ్యామిలీ కూడా ఈ విషయంపై రెస్పాండ్ అయింది. ఫ్యాన్స్ మెగా బ్రదర్ అని పిలుచుకునే నాగబాబు సైతం తమ్మారెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ‘నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా రూ.80 కోట్లు RRRకి ఆస్కార్ కోసం (RRR మీద కామెంటుకు వైసీపీ వారి భాషలో సమాధానం)’ అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. అంతే కాదు.. ఈ కామెంట్‌ను ఎవరికి కావాలంటే వారు అన్వయించుకోవచ్చని నోట్ కూడా పెట్టారు. నాగబాబు నుంచి ఏ మాత్రం ఊహించని రిప్లై రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆయనిచ్చిన రిప్లై ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే వైరల్ గా మారింది. 

ఆ తర్వాత తాను చేసిన కామెంట్లపైనా తమ్మారెడ్డి స్పందించారు. ఆర్ఆర్ఆర్ లోని సాంగ్ కోసం రూ.80 కోట్లు ఖర్చు పెట్టారని, అదే తనైతే 10 సినిమాలు తీసేవాడినని చెప్పినట్టు తెలిపారు. సినిమాలు రెండు రకాలు అనే ఉద్దేశంతో అలా అన్నానని.. ఒకటి రివార్డు సినిమాలు.. మరొకటి అవార్డు సినిమాలని పోలిక చేసి చెప్పానని ఆయన అన్నారు. ఓ సెమినార్‌లో భాగంగా ఆ వ్యాఖ్యలు చేసినట్లు చెప్పారు. అందులో మొత్తం తాను రెండున్నర గంటలు మాట్లాడితే.. కేవలం ఒక నిమిషం క్లిపింగ్‌ను మాత్రమే తీసుకొని తప్పుగా ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేద్దాం అనే కాంటెక్స్ట్ లో తాను చెప్పాను తప్పితే వాళ్ళు ఎలా ఖర్చు పెట్టుకుంటే తనకెందుకు అంటూ తమ్మారెడ్డి భరద్వాజ కౌంటర్ ఇచ్చారు. దీనికి సంబంధించి వీలైనంత త్వరగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తానని ఆయన పేర్కొన్నారు.