ఇప్పటికైనా గ్రూపులకు చెక్​ పడుతుందా?

ఇప్పటికైనా గ్రూపులకు  చెక్​ పడుతుందా?
  •     నెలరోజులుగా రాష్ట్ర బీజేపీలో అసంతృప్తి సెగలు
  •     పార్టీ లైన్​ దాటి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న లీడర్లు
  •     తాజా మార్పులు, చేర్పులతోనైనా వివాదాలకు తెర పడేనా?
  •     కొత్త అధ్యక్షుడు కిషన్​రెడ్డి ముందు పెద్ద టాస్క్​

 

హైదరాబాద్​, వెలుగు : నెల రోజులుగా రాష్ట్ర బీజేపీలో కొనసాగుతున్న పరిణామాలకు పార్టీ జాతీయ నాయకత్వం ఎట్టకేలకు తెర దింపింది. అందరూ ఊహించినట్లే కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డికి పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది. రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్​ని తప్పించింది. గాడి తప్పిన పార్టీ లీడర్లందరూ ఈ మార్పులతో ఒక్కతాటిపైకి వస్తారా? గ్రూపులుగా విడిపోయిన లీడర్లు ఐక్యతారాగం ఆలపిస్తారా? అనేది ఆసక్తి రేపుతున్నది.  కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్​రెడ్డి రాష్ట్ర పార్టీలో సీనియర్​. గతంలో రెండుసార్లు పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన అనుభవముంది. మూడోసారి వచ్చిన చాన్స్​ను ఆయన ఎలా వినియోగించుకుంటారు.. ఎన్నికలు ముంచుకొస్తున్న టైమ్ కావటంతో పార్టీని ఎలా ముందుకు నడిపిస్తారనే ఉత్కంఠ కేడర్​లో నెలకొంది. 

కిషన్​రెడ్డికి పార్టీలో సౌమ్యుడనే ముద్ర ఉంది. కొద్దిరోజులుగా బీజేపీ, బీఆర్​ఎస్​ ఒక్కటేనని, బీజేపీకి బీఆర్​ఎస్​ బీటీమ్​అనే విమర్శలు సూటిగా కమలం పార్టీని వెంటాడుతున్నాయి. ఈ టైమ్​లో కిషన్​రెడ్డి వీటిని ఎలా అధిగమిస్తారు? ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారు? ఇతర పార్టీ నుంచి వచ్చిన లీడర్లను కలగలుపుకుపోతారా? సొంత పార్టీ గ్రూపులను ఆయనెలా హ్యాండిల్​ చేస్తారనే కోణంలో చర్చలు జోరందుకున్నాయి. 

కవిత ఎపిసోడ్​ నుంచి కలహాలు

లిక్కర్​ స్కామ్​లో బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్​ నుంచి బీజేపీ జాతీయ నాయకత్వం అనుసరిస్తున్న తీరు రాష్ట్రంలో ఆ పార్టీని ఇరుకునపడేసింది. ఆ ఇష్యూపై రాష్ట్ర నేతలందరూ జాతీయ నాయకత్వంపై అసంతృప్తి వెలిబుచ్చారు. కవితను అరెస్ట్ చేయకపోవటంతో బీజేపీ, బీఆర్​ఎస్​ ఒక్కటేనని ప్రచారం జరుగుతున్నదని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి ట్వీట్​ చేయటం అప్పట్లో చర్చనీయాంశమైంది.  బండి సంజయ్​ని అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డి బహిరంగంగా గళమెత్తటం హాట్​ టాపికైంది. ఈటల రాజేందర్​ కూడా పలుమార్లు మీడియా చిట్​చాట్​లో మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని టార్గెట్​ చేశారు. కేసీఆర్​ను ఓడించే లక్ష్యంతోనే బీజేపీలో చేరానని, ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీతో సాధ్యమయ్యేలా లేదని కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి పలుమార్లు విరుచుకుపడ్డారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన లీడర్లకు ప్రాధాన్యం లేదని.. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావాలంటే సంజయ్​ను మార్చాలని ఈటల, రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి  కేంద్ర హోంమంత్రి  అమిత్​షాకు  ఫిర్యాదు చేశారు. 

ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నాగర్​కర్నూల్​ పర్యటనకు వచ్చిన సందర్భంగా, రెండు రోజుల కిందట ఢిల్లీలో పార్టీ ఎమ్మెల్యే రఘునందన్​రావు తన అసంతృప్తి వెలిబుచ్చారు. దుబ్బాకలో తన విజయమే బీజేపీకి టర్నింగ్​ పాయింట్​ అయిందని, తనకు మాత్రం పార్టీలో తగిన గుర్తింపు లేదన్నారు.  బండి సంజయ్​పై పలు ఆరోపణలు చేయటంతో పాటు అధిష్ఠానంపై సంచలన కామెంట్లు చేశారు. అప్పటికే పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని దున్నపోతుతో పోలుస్తూ ట్వీట్​ చేసిన మాజీ ఎంపీ జితేందర్​రెడ్డి.. ఈటలతో లంచ్​ భేటీ కావటం రాష్ట్ర కేడర్​లో కలకలం రేపింది. మరోవైపు సంజయ్​ను అధ్యక్ష పదవి నుంచి తప్పించటం ఆత్మహత్య సదృశమేనని మాజీ మంత్రి విజయరామారావు ట్వీట్​ చేశారు. సంజయ్​ను పార్టీ పదవి నుంచి తొలగించే అపోహలన్నీ మీడియా ప్రచారమేనని మాజీ ఎంపీ విజయశాంతి కొట్టిపారేశారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ రాచందర్​రావు, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్​రెడ్డి.. ​సంజయ్​కు అండగా నిలిచారు.  

నెల రోజులుగా వరుసగా జరిగిన ఈ పరిణామాలన్నీ పార్టీ లీడర్ల మధ్య అనైక్యతను బట్టబయలు చేశాయి.  ఇంత జరుగుతున్నా పార్టీ జాతీయ నాయకత్వం  సైలెంట్​గా ఉండటం బీజేపీ గ్రాఫ్​ను మరింత దిగజార్చిందనే అభిప్రాయాలున్నాయి. వీటన్నింటినీ గాడిలో పెట్టేందుకే పార్టీ అధిష్ఠానం తాజాగా పదవుల మార్పు నిర్ణయం తీసుకుందనే వాదనలున్నాయి. అవి ఏమేరకు ఫలితాన్నిస్తాయి.. వచ్చే ఎన్నికల దిశగా పార్టీకి ఊపునిస్తాయా..  లేదా  వేచిచూడాల్సిందే. 

పార్టీ లైన్​ దాటి..

మునుగోడు ఉప ఎన్నికకు ముందు రాష్ట్రంలో జోరుమీదున్న బీజేపీ.. సొంత పార్టీ లీడర్ల గ్రూపులతో నెల రోజులుగా ఢీలా పడింది. ఆ పార్టీ ముఖ్య నేతలు ఒకరిపై ఒకరు బాహాటంగా విమర్శలు చేసుకోవటంతోపాటు బహిరంగంగా ఆరోపణలు చేసుకున్నారు.  క్రమశిక్షణకు పెట్టింది పేరైన బీజేపీలో పార్టీ లైన్​ దాటి లీడర్లు ఎవరికి తోచినట్లు వాళ్లు మాట్లాడటం.. ఏకంగా అధిష్ఠానానికి సవాల్​ విసిరేంత వరకు వెళ్లింది. బీజేపీ అధిష్ఠానం రాష్ట్రంలో సెమీఫైనల్​గా భావించిన మునుగోడు ఎన్నికలో ఆ పార్టీకి విజయం త్రుటిలో చేజారింది. కాంగ్రెస్​కు రాజీనామా చేసి పార్టీలో చేరిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డిని ఓడిచేందుకు అధికార పార్టీ బీఆర్​ఎస్​ శక్తియుక్తులన్నీ ఒడ్డింది. అంతకు ముందు ఎన్నికలతో పోలిస్తే  బీజేపీ ఓటు బ్యాంక్​ ఒక్కసారిగా పది రెట్లకు..గణనీయంగా 87 వేలకు పెరిగింది. అంత జోష్​ను ప్రచారం చేసుకోవటంలో పార్టీ ఫెయిలైంది. 

కాంగ్రెస్​ నుంచి పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి ప్రాధాన్యం పెరిగిపోతుందని సొంత పార్టీలోనే కొందరు సహాయనిరాకరణ చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ ఎన్నిక తర్వాత ఓటమికి ఒకరంటే ఒకరు కారణమంటూ.. నేతలు తప్పులను లెక్కపెట్టారు. ఇటీవల కర్నాటక ఎన్నికల ఫలితాలు ఒక్కసారిగా బీజేపీ చాప కింద నీళ్లు తెచ్చాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్​కు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు మాట్లాడటం మొదలుపెట్టారు. దీంతో లీడర్ల మధ్య సమన్వయ లోపం బట్టబయలైంది. .