ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగురామన్నకు అసంతృప్తి సెగ తగిలింది. రెండేళ్లుగా ఆదిలాబాద్, జైనథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకం విషయంలో జాప్యం చేయడమే కాకుండా, ఆదివాసీలకు రిజర్వ్ కావడంతోనే పట్టించుకోవడం లేదనే ఆరోపణల తర్వాత ఇటీవల రెండు చోట్ల చైర్మన్, మెంబర్ల ను నియమించారు. ఆదినుంచి వివాదాల్లో ఉన్న మార్కెట్ కమిటీ చైర్మన్​ పదవి ఇటీవల నియమించారు. అయితే తమకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ లీడర్లు కొందరు రచ్చకెక్కారు. 20 ఏళ్లుగా ఎమ్మెల్యే జోగురామన్న వెంట నడుస్తున్నా.. తనకు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వకుండా అన్యాయం చేశారని మార్కెట్ కమిటీ డైరెక్టర్ గేడం రాము ఆరోపించారు. పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదిలాబాద్ రూరల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొడప సోనేరావు, పలువురు నాయకులు ఆ పదవికి, పార్టీకి రాజీనామ చేస్తున్నట్లు చెప్పారు. ఆదివాసీ గూడెల్లో ఎమ్మెల్యే గెలుపుకోసం ఎంతో కృషిచేశామన్నారు. పార్టీలో న్యాయం జరగకపోవడంతోనే రాజీనామా చేసినట్లు వెల్లడించారు.

రాజీనామా.. వెంటనే సస్పెండ్..

ఇదిలాఉంటే బీఆర్ఎస్ మండల అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు కొడప సోనేరావు ప్రకటించిన రెండుమూడు గంటల్లోనే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఎమ్మెల్యే జోగురామన్న ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ పదవి నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.

టీచర్ల బదిలీల, పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించాలి

ఆదిలాబాద్,వెలుగు: టీచర్ల బదిలీలు, పదోన్నతుల షెడ్యుల్ వెంటనే ప్రకటించాలని ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెజ్జంకి రవీంద్ర డిమాండ్ చేశారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో సంఘ సభ్యత్వ నమోదు సందర్భంగా ఆయన మాట్లాడారు. పదోన్నతుల అనంతరం ఏర్పడే ఖాళీలన్నింటిని ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాలన్నారు. 2019 లో స్కూల్ అసిస్టెంట్స్ గా అప్ గ్రేడ్ చేసిన 10,479 పండిట్, పీఈటీ పోస్టుల వివాదాలు పరిష్కరించాలన్నారు. అన్ని జిల్లాలకు డీఈవో పోస్టులు, నియోజకవర్గానికి ఒక డిప్యూటీ ఈవో పోస్టు, ఎంఈవో పోస్టు మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ ఆదిలాబాద్ అర్బన్ మండల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు నిర్వానశాస్త్రీ, బేతం పోచారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి

నిర్మల్​/ఆదిలాబాద్​ టౌన్​, వెలుగు: రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కల్పించిన హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన ఆదిలాబాద్, నిర్మల్​జిల్లాలో నిర్వహించిన పోరుయాత్రలో మాట్లాడారు. సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, ఇతర పాఠశాలల భవనాలను నిర్మించాలంటే సీఎం కేసీఆర్ ప్రగతి భవన్, అసెంబ్లీ భవనాలను నిర్మిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యధికంగా జనాభా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు సీఎం పదవిలో ఉండాలని, కానీ.. ఒక్క శాతం ఉన్న అగ్రవర్ణాలు సీఎం పదవిలో కొనసాగుతున్నారన్నారని పేర్కొన్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్​మెంట్​విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రైవేట్ వర్సిటీల్లో రిజర్వేషన్లు అమలు చేయకపోవడం దారుణమన్నారు. బీసీ గురుకులాలకు పక్కాభవనాలు లేవన్నారు. బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అనగదొక్కడమే లక్ష్యంగా పాలకులు పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం వివక్షకు నిదర్శనమన్నారు. నిర్మల్​లో జరిగిన కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాసు ముదిరాజ్, కేంద్ర కమిటీ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు కనకాల శ్యాంకుర్మా, భాస్కర్, రామా గౌడ్, నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

రైతులను దోచుకుంటున్రు

కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ధర్నా

బెల్లంపల్లిరూరల్,వెలుగు: కాంటాలో కోత, హమాలీల ఖర్చు, లారీ డ్రైవర్లకు కమీషన్, మిల్లర్ల ఐదు కిలోలు ఇట్ల అందరికి ఇచ్చుకుంటు  పోతే మాకేం మిగలడంలేదని రైతులు ఫైర్​ అయ్యారు. శనివారం వేమనపల్లి మండలం నీల్వాయి, మంగెనపల్లి కొనుగోలు కేంద్రాల వద్ద ధర్నా నిర్వహించారు. మంగెనపల్లి పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం వద్ద రెండు రోజుల క్రితం నలుగురు రైతులకు చెందిన 599 బస్తాలు, 42 కిలోల చొప్పున తూకం వేసి నిర్మల్​జిల్లా కేంద్రంలోని రైస్ మిల్లులకు తరలించగా, క్వింటాల్​కు 10 కిలోలు కోత పెడతామని లేదంటే మీ వడ్లు తీసుకోమని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా లారీ అన్​లోడ్ చేయలేదని పేర్కొన్నారు. నీల్వాయి పీఏసీఎస్ కొనుగోలు  కేంద్రం వద్ద 15 రోజులుగా కాంటా వేస్తలేరని ఆరోపించారు. హమాలీకి క్వింటాల్​కు రూ.40 , డ్రైవర్ కు క్వింటాల్​కు రూ.5 ఇవ్వాలని, బస్తా 42 కిలోల ఉంటేనే కాంటా వేస్తామని నిర్వాహకులు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. లారీ డ్రైవర్, హమాలీలు, సీఈవో మచ్చ మధూకర్​తో గొడవకు దిగారు. తహసీల్దార్, సింగిల్​విండో చైర్మన్, ఏవో, సీఈవో రావాలని డిమాండ్​చేశారు. తహసీల్దార్ రాజ్ కుమార్​, సర్పంచ్​గాలి మధు, సీఈవో మధూకర్ కేంద్రం వద్దకు వచ్చి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

100 కోట్లతో 600 ఆలయాల నిర్మాణం

నిర్మల్, వెలుగు: నిర్మల్ నియోజక వర్గంలో రూ.100 కోట్లతో 600 కొత్త ఆలయాలు నిర్మించినట్లు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక విజయనగర్ కాలనీ మంజులాపూర్​ఏరియాలో నిర్మించిన అభయాంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవానికి మంత్రి హాజరయ్యారు. ఇటీవలె రూ. 3 కోట్లతో నిర్మించిన మహాలక్ష్మి ఆలయాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. వెళ్లి పోచమ్మ ఆలయాన్ని  కూడా కొత్తగా నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, పోశెట్టి, అల్లోల మురళీధర్ రెడ్డి తదితరులు 
పాల్గొన్నారు.