- ఆదిలాబాద్ కొత్త డీసీసీ అధ్యక్షుడితో ఏకమైన అన్ని వర్గాలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కీలక పరిణామం
- సర్పంచ్ ఎన్నికలవేళ గ్రూప్ తగదాలకు చెక్ పడ్డట్లే..
- గెలుపే లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలని నేతల పిలుపు
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి నేతల చేతులు కలిసాయి. జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఈ పరిణామంతో పార్టీలో ఒక్కసారిగా జోష్ వచ్చింది. కొత్తగా ఎన్నికైన డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ తదితరులు సోమవారం అసెంబ్లీ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంపు ఆఫీస్‌కు వెళ్లిన విషయం తెలిసిందే.
అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురై.. ఇటీవలే తిరిగి పార్టీలో చేరిన డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డితోపాటు కంది శ్రీనివాస్ రెడ్డి వ్యతిరేక వర్గమైన కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఒకే వేదికపై చేతులు కలపడం రాజకీయాలను మలుపుతిప్పింది. తన కార్యాలయానికి వచ్చిన సీనియర్ లీడర్లందరిని సన్మానించి కౌగిలించుకొని సరదాగా మాట్లాడిన కంది వర్గ విభేదాలకు ఫుల్‌స్టాఫ్ పెట్టినట్లు తెలుస్తోంది. జిల్లా అధ్యక్షుడు నరేశ్ జాదవ్ ఆధ్వర్యంలో వీరంతా కలుసుకోవడం పార్టీకి మంచి పరిణామమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కాంగ్రెస్‌కు కలిసొచ్చినట్లేనా..!
సర్పంచ్ ఎన్నికల సమయంలో విభేదాలు పక్కన పెట్టిన నేతలంతా ఒక్కటి కావడంతో కాంగ్రెస్ కు కలిసొచ్చినట్లేననే చర్చ జరుగుతోంది. 2023 ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన కంది శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ రావడంతో ఎన్నో ఏండ్లుగా పార్టీని నమ్ముకొని ఉన్న సీనియర్ నేతలు సాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డి, గండ్రత్ సుజాత పార్టీ హైకమాండ్ పై విమర్శలు చేశారు.
ఆ ఎన్నికల్లో సంజీవ్ రెడ్డిని ఇండిపెండెంట్‌గా పోటీ చేయించారు. పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరించిన వీరిని కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని తిరిగి పార్టీలో చేర్పించే ప్రయత్నం జరిగినప్పటికీ సాధ్యం కాలేదు. ఎట్టకేలకు గత నెలలో పీసీసీ నిర్ణయంతో వారు పార్టీలోకి వచ్చారు.
ఈ నేపథ్యంలో తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో అసెంబ్లీలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరుగకుండా ఉండేందుకు అధిష్టానం చర్యలు తీసుకుంటోంది. ఎక్కడా అసమ్మతి ఉండకూడదనే ఉద్దేశంతో అందరిని కలుపుకోవాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే కొత్త డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ సమక్షంలో అసమ్మతి నేతలు కంది కార్యాలయంలో సమావేశమయ్యారు. వీరంతా ఒక్కటి కావడం కాంగ్రెస్‌కు కలిసొచ్చే అంశమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అసమ్మతి నేతలను ఒక్కటి చేయడంలో సక్సెస్
పదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ గ్రామాలను తమ ఖాతాలో వేసుకోవాలంటే నేతలంతా సమిష్టిగా పనిచేయాల్సిన అవసరముందని భావిస్తోంది. అందుకే అసమ్మతి నేతలను ఒక్కటి చేస్తూ సక్సెస్అవుతోంది.
ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మెజార్టీ సాధిస్తేనే తర్వాత జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తారని.. సర్పంచ్ ఎన్నికలే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిలకు మార్గదర్శకంగా మారనున్నాయని భావిస్తోంది.
