కారు ఆయిల్ లీకైందని.. నగలు చోరీ

కారు ఆయిల్ లీకైందని.. నగలు చోరీ

మెహిదీపట్నం, వెలుగు : కారు ఆయిల్ లీకైతుందని దృష్టి మరల్చి నగలను దుండగులు దోచుకుని పారిపోయిన  ఘటన షాహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సౌత్ అండ్ వెస్ట్ జోన్ డీసీపీ బి. బాలస్వామి   ఆదివారం మీడియాకు వివరాలు తెలిపారు. ఓల్డ్ సిటీ లోని హుస్సేన్ ఆలంకు చెందిన ముజఫర్ బంగారు నగల షాపు యజమాని. అతడు తన డ్రైవర్ తో కారులో శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు బషీర్ బాగ్  కు వెళ్తున్నారు. 

బేగంబజార్ ఛత్రి చౌరస్తా వద్ద కొందరు వ్యక్తులు వచ్చి కారు బంపర్ నుంచి వెనుక వైపు ఆయిల్ లీకవుతుందని తెలిపారు. వెంటనే ముజఫర్ తో పాటు డ్రైవర్ కారు దిగి చూస్తుండగానే ఢిల్లీకి చెందిన పాన్ షాప్ నిర్వహించే రమేశ్​కుమార్ (30), లేబర్ రోనక్ (20), శశికుమార్, (43), ఆజు బాబు, సూరజ్ కారు డోరు తీసి నగల బ్యాగ్​ను తీసుకొని పరారయ్యారు. వెంటనే బాధితుడు ముజఫర్ స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

సీసీ ఫుటేజ్ ల ఆధారంగా ఆదివారం మధ్యాహ్నం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రమేశ్​కుమార్, రోనాక్, శశికుమార్ ను టాస్క్ ఫోర్స్ వెస్ట్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద  ల్యాప్ టాప్ , డైమండ్ లాకెట్, డైమండ్ చైన్ , డైమండ్ రింగ్, డైమండ్ నోస్ పిన్, ఇయర్ రింగ్ తో పాటు 40వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు.  24 గంటల్లోపే కేసును చేధించిన పోలీసులను డీసీపీ అభినందించారు. మరో ఇద్దరు నిందితులు బాబులు, సూరజ్ లు పరారీలో ఉన్నట్టు పోలీసులు చెప్పారు.