
మల్లన్నసాగర్ ముంపు బాధితులకు చెట్లు కింద ఇస్తున్న పరిహారంపై వివాదం నడుస్తోంది. పెద్ద పెద్ద చెట్లకు నష్టపరిహారం 36 రూపాయలు, 52 రూపాయల చెక్కులు పంపిణీ చేస్తుండటంపై భూ నిర్వాసితులు మండిపడుతున్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం మల్లన్నసాగార్ ముంపు బాధిత గ్రామాలైన వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, లక్ష్మాపూర్ గ్రామాల్లో భూ నిర్వాసితుల వ్యవసాయ పొలాలు, ఇంటి ఆవరణలో ఉన్న పెద్ద పెద్ద చెట్లకు అధికారులు పరిహారం చెక్కులు పంపిణీ చేస్తున్నారు.
వీటిల్లో ఒకరికి 52 రూపాయలు చెక్కు ఇవ్వగా… మరొకరికి 36 రూపాయల చెక్కు ఇచ్చారు అధికారులు. ఇంకా ఇతర గ్రామాలకు చెందిన రైతులకు కూడా ఇలాగే ఇచ్చారని బాధితులు చెబుతున్నారు. నర్సరీ నుంచి ఒక చిన్న మొక్క కొంటేనే… వంద రూపాయల పైనే ఉంటుందనీ… అలాంటిది కొన్నేళ్ళుగా మొక్కలు పెంచి… పెద్ద చెట్లను చేస్తే… ఇంత తక్కువ డబ్బులు ఇవ్వడమేంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం ఇచ్చిన 36 రూపాయల చెక్కును బ్యాంకుకు వెళ్లి మార్చుకోడానికి తమకు ఆటో చార్జీలతో సహా కనీసం వంద రూపాయల పైనే ఖర్చు అవుతుందని అంటున్నారు. అలాంటప్పుడు 36 రూపాయలు, 52 రూపాయల చెక్కులు తీసుకొని ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై అధికారులను అడిగితే తమకేమీ తెలియదనీ.. మీ పేరున చెక్కు ఇంతే వచ్చింది తీసుకోండి అంటున్నారని బాధితులు చెబుతున్నారు. ప్రభుత్వం గానీ అధికారులు గానీ స్పందించి చెట్లకు తగినంత నష్టపరిహారం అందించాలని మల్లన్నసాగర్ భూ నిర్వాసితులు కోరుతున్నారు.