
Fertility Crisis: ఓ వైపు ప్రపంచంలో జనాభా వేుల కోట్లకు చేరితే.. మరో వైపు పిల్లల్ని కనండి.. ఆఫర్స్ ఇస్తాం.. డబ్బులు ఇస్తాం అని కొన్ని దేశాలు యువ జంటలను ప్రోత్సహిస్తున్నాయి.. కొన్ని దేశాల్లో జనాభా సంఖ్య తగ్గిపోతుంటే.. మరికొన్ని దేశాల్లో పెరుగుతుంది. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న చైనా దేశం.. ఇప్పుడు జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. పుట్టే వాళ్లు రోజురోజుకు తగ్గిపోవటం.. వృద్ధుల సంఖ్య భారీగా పెరగటంతో.. రాబోయే రోజుల్లో పని చేసే వాళ్లు లేకుండా పోతారనే భయం పట్టుకున్నది చైనా దేశానికి.. ఈ క్రమంలోనే పెళ్లి.. పెళ్లాం.. పిల్లలు అనే కాన్సెప్ట్ తో భారీ ఆఫర్స్ ఇస్తుంది..
పెళ్లి చేసుకునే వాళ్లకు భారీగా బహుమతులు ఇవ్వటమే కాకుండా.. పిల్లల్ని కంటే.. ఒక్కో పిల్లోడికి ఏడాదికి 45 వేల రూపాయలు ఇస్తాం అనే బంపరాఫర్ ప్రకటించింది చైనా దేశం. అంటే ఏ స్థాయిలో జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదో అర్థం అవుతుంది. ఈ ఆఫర్ పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా. కానీ కొన్నేళ్ల కిందట అక్కడి ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక సంతానం పాలసీ ప్రస్తుతం పెద్ద సమస్యలను తెచ్చిపెట్టింది ఆ దేశానికి. పుడుతున్న పిల్లల సంఖ్య తగ్గిపోవటం వృద్ధ జనాభా పెరుగుదలతో చైనా ఇబ్బందులు ఎదుర్కొంటేంది.
ప్రతి ఏటా దిగజారుతున్న శిశు జననాల సమస్యతో పోరాడేందుకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం తొలిసారిగా చైనాలో నేషనల్ చైల్డ్ కేర్ సబ్సిడీ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిని జనవరి 1, 2025 నుంచి అందుబాటులోకి తెచ్చింది. దీనికింద ఏడాదికి మూడేళ్లలోపు ఉన్న ప్రతి బిడ్డ తల్లిదండ్రులకు 3వేల600 యువాన్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.45వేలు అందించాలని నిర్ణయించింది. దీని ద్వారా బిడ్డలను పెంచటంలో తల్లిదండ్రులకు ఆర్థికంగా సహాయం చేయటంతో పాటు జనన రేటును పెంచవచ్చని చైనా భావిస్తోంది.
అయితే ఈ సబ్సిడీ మెుత్తం శిశువుకు 3 ఏళ్లు వయస్సు వచ్చేవరకు మాత్రమే అందించబడుతుందని చైనా సర్కార్ వెల్లడించింది. ప్రస్తుతం చైనాలో దంపతులకు ఉపాధి సమస్యలు, పెరుగుతున్న విద్య, వైద్యం ఖర్చులు, ఆర్థిక మందగమనం తక్కువ సంతానం కలిగి ఉండేలా ప్రేరేపిస్తోంది. దీనిని గమనించిన చైనా ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బు జమ చేయటం ద్వారా తల్లిదండ్రులకు సహాయంగా నిలవాలని నిర్ణయించినట్లు అక్కడి జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది.
వాస్తవానికి పెరుగుతున్న జనాభాను అదుపుచేసేందుకు చైనా 1980 నుంచి 2015 వరకు ఒక జంటకు ఒక బిడ్డ పాలసీని అక్కడ అమలు చేసింది. దీంతో దశాబ్ధాలుగా జనన రేటు తగ్గి ప్రస్తుతం జనాభా తగ్గుదలను చూస్తోంది చైనా. వరుసగా మూడేళ్ల నుంచి చైనా జనాభా సంఖ్య తగ్గటంతో మేల్కొన్న అక్కడి ప్రభుత్వం కొత్త పాలసీని తాజాగా ప్రకటించింది. గత రెండు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రావిన్సులు పిల్లల సంరక్షణ సబ్సిడీలను అందిస్తూ వస్తున్నాయి. దీనికి తోడు సబ్సిడీ హోమ్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుతం భారత్ కూడా తగ్గుతున్న జననాల రేటుతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే.