
Monarch Surveyors IPO: గడచిన వారం రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లోకి జారుకుంటున్నప్పటికీ ఐపీవోలు మాత్రం భారీ లాభాలను అందిస్తూ ఇన్వెస్టర్లలో లాభాల ఆశలు చిగురింపచేస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది మోనార్క్ సర్వేయర్స్ కంపెనీ ఐపీవో గురించే. వాస్తవానికి ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన ఈ ఐపీవో నేడు బీఎస్ఈలో 68.5 శాతం ప్రీమియం ధర రూ.421.25 వద్ద మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. కానీ లిస్టింగ్ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపడంతో 5 శాతం లోయర్ సర్క్యూట్లో రూ.400.20 రేటు వద్ద ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి.
కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధర రూ.237 నుంచి రూ.250గా ప్రకటించగా.. నేడు షేరుకు రూ.170 వరకు లాభంతో మార్కెట్లోకి అడుగుపెట్టాయి. ఐపీవో ద్వారా కంపెనీ మెుత్తం రూ.93 కోట్ల 75 లక్షలు సమీకరించింది. రిటైల్ పెట్టుబడిదారుల సబ్ స్ర్కిప్షన్ కోసం ఐపీవో జూలై 22 నుంచి జూలై 24 వరకు అందుబాటులో ఉంచబడింది. ఐపీవో మెుత్తం మూడు రోజుల్లో 250 సార్ల కంటే ఎక్కువ సబ్‌స్క్రైబ్ చేయబడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.26కోట్ల 54 లక్షలను సమీకరించింది.
కంపెనీ వ్యాపారం..
1992లో స్థాపించబడిన ఈ సంస్థ సివిల్ ఇంజనీరింగ్ రంగంలో కన్సల్టెన్సీ సేవలను అందిస్తోంది. కంపెనీ టోపోగ్రాఫిక్ సర్వేలు, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ, డిజైన్ అండ్ ఇంజనీరింగ్, జియోటెక్నికల్ పరిశోధనలు, భూ సేకరణ, GIS మ్యాపింగ్, సాధ్యాసాధ్యాల అధ్యయనాలకు సంబంధించిన సమగ్ర సేవలను అందిస్తోంది. రైల్వేలు, రోడ్లు, ఓడరేవులు, ఆయిల్ & గ్యాస్ వంటి రంగాల్లో ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించిన అనుభవం కలిగి ఉంది.