
సిద్దిపేట/గజ్వేల్, వెలుగు: సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ మున్సిపాలిటీలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ పంచాయతీ ఎంతకూ తెగడం లేదు. రెండేళ్ల కిందనే పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించినా ఇంత వరకు లబ్ధిదారుల ఎంపిక కొలిక్కి రావడం లేదు. నెల కింద అధికారులు డ్రాఫ్ట్ లిస్ట్ విడుదల చేయగా.. అనర్హులకు చోటు లభించిందని పేదలు, ప్రతిపక్ష నేతలు ఆందోళనకు దిగారు. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన అధికారులు మున్సిపల్ ఆఫీసులో ఒక బాక్స్ ను ఏర్పాటు చేసి అభ్యంతరాలు స్వీకరించారు. ఇందులో 1045 అభ్యంతరాలు రాగా.. 20 రోజుల కింద కలెక్టర్ పరిశీలనకు పంపించారు. అనంతరం మరో జాబితాను రిలీజ్ చేసి.. సోమవారం లక్కీ డ్రా నిర్వహించాలని నిర్ణయించారు. కానీ, ఇందులోనూ అనర్హులున్నారని పేదలు, ప్రతిపక్ష నేతలు అభ్యంతరం తెలపడంతో అది కాస్తా వాయిదా పడింది.
దరఖాస్తులు స్వీకరించి రెండేళ్లు
ప్రభుత్వం గజ్వేల్ మున్సిపాలిటీలో 1250 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించింది. ఇందులో 132 ఇండ్లను రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన వారికి కేటాయించగా.. మిగిలిన 1,118 ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక కోసం 2021 నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులు ఆహ్వానించింది. 3,512 మంది దరఖాస్తులు రాగా.. ఆరు జిల్లాస్థాయి అధికారుల బృందాల ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఏడాదిన్నర పాటు సాగిన సర్వే అనంతరం నెల రోజుల క్రితం 1,118 మంది లబ్ధిదారులతో డ్రాఫ్ట్ లిస్టును రిలీజ్ చేశారు.
చిచ్చుపెట్టిన డ్రాఫ్ట్ లిస్ట్
ఇండ్ల పంపిణీ కోసం మున్సిపల్ అధికారులు 1,118 మందితో విడుదల చేసిన డ్రాఫ్ట్ లిస్ట్ పేదల మధ్య చిచ్చుపెట్టింది. ఇల్లు వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న ఎంతో మంది పేర్లు ఇందులో లేకపోవడం ఆందోళనకు దిగారు. వీరికి ప్రతిపక్ష పార్టీ నేతలు మద్దతుగా నిలిచారు. పరిస్థితి చేయిదాటుతుందని గ్రహించిన ఆఫీసర్లు ఇది డ్రాఫ్ట్ లిస్ట్ మాత్రమేనని, ఫైనల్ లిస్ట్ తర్వాత విడుదల చేస్తామని ప్రకటన చేశారు. ఏవైనా అభ్యంతరాలుంటే చెప్పాలని మున్సిపల్ ఆఫీస్ వద్ద బాక్స్ ఏర్పాటు చేశారు.
1,045 అభ్యంతరాలు
డ్రాఫ్ట్ లిస్ట్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ 1045 దరఖాస్తులు వచ్చాయి. వీటిని అధికారులు కలెక్టర్ పరిశీలనకు పంపించారు. రెండు రోజుల కింద అందిన దరఖాస్తుల్లో 289 మందితో రెండో జాబితాను విడుదల చేశారు. రెండు జాబితాల్లోని మొత్తం 1,407 మంది నుంచి 1,118 మంది ఎంపికకు సోమవారం లక్కీ డ్రా తీస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయం తెలియగానే లిస్ట్‌లో పేరులేని పేదలు రెండురోజుల కింద గజ్వేల్‌కు వచ్చిన మంత్రి హరీశ్‌రావును అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. కానీ, పోలీసులు వారి ప్రయత్నాలు సాగనివ్వలేదు. దీనిపై కొందరు కౌన్సిలర్లు కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
వాయిదా పడ్డ లక్కీ డ్రా
ఇండ్ల కేటాయింపు కోసం సోమవారం నిర్వహించాల్సిన లక్కీ డ్రా వాయిదా పడింది. రెండు జాబితాల్లో అనర్హులు ఉన్నారని ఆరోపణలు రావడంతో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్త, వైస్ చైర్మన్ జకియోద్దీన్, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాపరెడ్డి మంత్రి హరీశ్ రావు దృష్టికి తీసుకెళ్లారు. నిజమైన లబ్ధిదారులను గుర్తించి ఇండ్లు మంజూరు చేయాల్సి ఉందని కోరడంతో ఆయన లక్కీ డ్రా ఆపాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. దీంతో రెండేళ్లుగా ఎదరుచూస్తున్న పేదల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది.
అర్హులైన పేదలందరికీ ఇండ్లు లభించేలా చర్యలు
అర్హులైన పేదలందరికీ ఇండ్లు దక్కేలా చర్యలు తీసుకుంటున్నం. ఇప్పటి వరకు రెండు జాబితాలు విడుదల చేసినా ఇంకా అర్హులున్నారనే ఉద్దేశంతో లక్కీ డ్రాను వాయిదా వేసినం. ప్రస్తుతం విడుదల చేసిన రెండు జాబితాలతో పాటు మరింత మంది పేదలను గుర్తించి 1,118 ఇండ్లకు లక్కీ డ్రా తీస్తం.
రాజమౌళి గుప్త, మున్సిపల్ చైర్మన్ గజ్వేల్