మిడ్ డే మీల్స్ కు బియ్యం ఇయ్యట్లే

మిడ్ డే మీల్స్ కు బియ్యం ఇయ్యట్లే
  • తమ ఇండ్ల నుంచి బియ్యం తెస్తున్న నిర్వాహకులు
  • కొన్ని చోట్ల పక్క స్కూళ్ల నుంచి అరువు తెస్తున్న హెడ్మాస్టర్లు
  • మూడు నెలలుగా బిల్లులు కూడా పెండింగే
  • నిర్వా హకులకిచ్చే రూ. వెయ్యి జీతమూ 6 నెలలుగా బంద్
  • రూ.45 కోట్లకుపైగా బకాయిలు.. ఇట్లాగైతే ఎలాగనే ఆందోళన

వెలుగు నెట్​వర్క్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సర్కారీ స్కూళ్లకు మిడ్​ డే మీల్స్​ బియ్యం పంపిణీ నిలిచిపోయింది. ఈ–పాస్​ విధానంలో ఆన్​లైన్​ ద్వారా బియ్యం పంపించేందుకు సర్కారు చేసిన ప్రయోగం ఫెయిలైంది. కొన్ని జిల్లాల్లో గతంలో ఉన్నట్టుగా ఆఫ్​ లైన్​ ద్వారా, కొన్నిచోట్ల ఆన్​లైన్​ ద్వారా ఇండెంట్ రావటంతో గందరగోళం ఏర్పడింది. ఒకటో తేదీలోగా స్కూళ్లకు చేరాల్సిన బియ్యం.. 15వ తేదీ వచ్చినా అందలేదు. దాంతో మిడ్​ డే మీల్స్​ వండిపెట్టేందుకు ఏజెన్సీల నిర్వాహకులు, హెడ్మాస్టర్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. చాలాచోట్ల నిర్వాహకులు తమ ఇంటి నుంచి బియ్యం తెచ్చి వండి పెడుతున్నారు. కొన్నిచోట్ల పక్క స్కూళ్ల నుంచి బియ్యం బదులు తెచ్చుకుంటూ.. ఏ రోజుకారోజు గండం గట్టెక్కిస్తున్నారు. మరో రెండు, మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే పిల్లలకు భోజనం బంద్​ చేయటం తప్ప.. చేసేదేమీ లేదని ఏజెన్సీల నిర్వాహకులు చెప్తున్నారు. భారమంతా హెడ్మాస్టర్లపై నెట్టేస్తున్నారు. పాఠాలు చెప్పటం పక్కనపెట్టి పిల్లలకు ఈ రోజు భోజనమెలా.. అన్నది తమకు పరీక్ష పెట్టినట్టుగా మారిందని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొత్త విధానంతో గందరగోళం

గతంలో ప్రతి స్కూల్​కు దగ్గర్లోని రేషన్​ డీలర్​ పాయింట్​ నుంచి బియ్యం రవాణా చేసే వారు. అయితే ఈ–పాస్​ విధానం ద్వారా ఎంఈవోలు ఇచ్చే ఇండెంట్​ ఆధారంగా స్కూళ్లకే బియ్యం రవాణా చేయాలని ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. కొన్నిచోట్ల ఇది పక్కాగా అమల్లోకి రాగా, కొన్నిజిల్లాల్లో గాడిన పడలేదు. జనగాం, సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, వనపర్తితో పాటు పన్నెండు జిల్లాల్లో స్కూళ్లకు సెప్టెంబర్​ కోటా బియ్యం చేరలేదు. హెడ్మాస్టర్లు ఎంఈవోలు, డీఈవో ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. కొందరు హెడ్మాస్టర్లు పక్కన ఉన్న స్కూళ్ల నుంచి చేబదులు తెచ్చుకుంటున్నారు. వనపర్తి జిల్లాలో 589 ప్రభుత్వ స్కూళ్లు ఉండగా ప్రతి నెలా 1,200 క్వింటాళ్ల బియ్యం అవసరం. గత నెలలో బియ్యం ఇండెంట్ కూడా ఆన్ లైన్ లో తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించి విఫలమైంది. 3వ తేదీన ఇండెంట్లన్నీ మ్యాన్యువల్ గా పంపించాలని అధికారులు సూచించడంతో బియ్యం సరఫరా అగిపోయింది.

మూడు నెలలుగా బిల్లులు పెండింగ్

మూడు నెలలుగా ఏజెన్సీలు, నిర్వాహకులకు ఇచ్చే బిల్లులను ప్రభుత్వం ఆపేసింది. నిధుల్లేక బిల్లులన్నీ పెండింగ్​లో పెట్టింది. దీంతో గుడ్లు, పప్పులు, నూనె, సిలిండర్లను కొనేందుకు డబ్బుల్లేవంటూ నిర్వాహకులు వాపోతున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులందరికీ వారంలో మూడు రోజులు భోజనంతో పాటు గుడ్డును అందించాలి. వీటి కోసమే ప్రతి నెలా రూ.8 వేలకుపైగా ఖర్చవుతోంది. రెండు వందల మంది బడి పిల్లలుంటే ప్రతి నెలా రూ.20 వేలు అవసరం. 3 నెలలుగా బిల్లులు ఆపితే అంత డబ్బు తామెక్కడి నుంచి తెస్తామని.. ఇప్పటికే దుకాణాల్లో ఉద్దెర పెడుతున్నామని, పిల్లలకు భోజనం పెట్టేందుకు అప్పులు చేస్తున్నామని చెప్తున్నారు.

రూ.45 కోట్లకు పైగా బకాయిలు

రాష్ట్రంలోని 27,359 స్కూళ్లల్లో దాదాపు 23.87 లక్షల మంది పిల్లలకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. స్కూళ్లలో విద్యార్థులు అర్ధాకలితో ఇబ్బండి పడకూడదని, హాజరు శాతం పడిపోకుండా ఉండేందుకు నిర్దేశించిన ఈ పథకానికి నిధుల కొరత రాకుండా ప్రభుత్వం గతంలో స్పెషల్​ కేర్​ తీసుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి నెలా మధ్యాహ్న భోజన బిల్లులను గ్రీన్​ చానల్​ ద్వారా చెల్లించేది. ఆర్థిక శాలఖ, ట్రెజరీల్లో అలస్యం కాకుండా ఉండేందుకు ఈ విధానం అమలు చేసింది. ఇప్పుడు నిధుల్లేవనే సాకుతో మూడు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లులను పెండింగ్​లో పెట్టింది. మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ప్రతినెలా చెల్లించే రూ.1,000 జీతం కూడా ఆరు నెలలుగా పెండింగ్​లో పెట్టింది. జూన్​ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రూ.45 కోట్లకుపైగా బిల్లులు ఆగిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.

ఒకటో తారీఖు నుంచి రాలే..

ఒకటో తారీఖు నుంచి బియ్యం రాకపోవటంతో.. మధ్యాహ్న భోజనం వండటం భారమైతోంది. మిడ్​ డే మీల్స్​ వాళ్లు దాదాపు 80 కిలోల బియ్యం ఇంటి నుంచి తెచ్చిండ్రు. అయిపోయినయట. పిల్లలకు అన్నం పెట్టుడు కష్టమయ్యేటట్టు ఉన్నది. బియ్యం, బిల్లులు జల్దీ మంజూరు చేయాలి.

– వి. లక్ష్మినారాయణ, చందుర్తి ప్రైమరీ స్కూల్​ హెడ్మాస్టర్, సిరిసిల్ల జిల్లా​

అరువు తెచ్చి పెడుతున్నం

ఒకటో తేదీన రావాల్సిన బియ్యం ఇంకా రాలే. ప్రతి నెలా ఇంతే. గత నెలలో ఇచ్చిన బియ్యాన్నే ఇప్పటిదాకా వండిపెట్టినం. ఆరు రోజుల కిందట బియ్యం అయిపొయినయి. రోజుకో బడికి పోయి బియ్యం అరువు తెస్తున్నం. కొన్ని బడుల్లో వాళ్లు లేవంటూ ఇస్తలేరు. 358 మంది పిల్లలున్నరు. రోజూ 40 కిలోలపైనే వండాలె.

– ఎల్.నర్సింగరావు, తంగడపల్లి జెడ్పీహెచ్ఎస్​ హెడ్మాస్టర్, యాదాద్రి జిల్లా

బిల్లులిస్తలేరు.. బియ్యమిస్తలేరు

పిల్లలను ఉపవాసం ఉంచలేక బియ్యం ఇంటి నుంచి తీసుకొస్తున్నం. ఇప్పటికే 70, 80 కిలోలు తెచ్చిన. ఇక నా ఇంట్ల కూడా లేవు. రేపట్నుంచి షాపుల కొనుక్కొని రావాలే. పెద్దసార్​ తెప్పిస్తడో ఏమో తెల్వది. నెలనెలా బిల్లులు సరిగ్గ రావు. బియ్యం రావాలె, సిలిండర్లు రావాలె. తెలంగాణ ప్రభుత్వం వస్తే ఏదో అయితది. రూ.10 వేలు వేతనం వస్తదనుకున్నం. వెయ్యి రూపాయల జీతం కోసం చేస్తే.. ఉడికిన అన్నం మిగిలితే తింటున్నం లేకుంటే లేదు. జూన్​ నుంచి మూడు నెలలుగా బిల్లుల్లేవు.

– బొల్లు మల్లవ్వ, నిర్వాహకురాలు, చందుర్తి