వనపర్తి జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీ అస్తవ్యస్తం

వనపర్తి జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీ అస్తవ్యస్తం
  • తూకం తప్పుగా చూపెడుతున్నాయంటున్న డీలర్లు 
  • స్టాక్‌‌ పాయింట్లలోనూ దండె కొడుతున్నారని ఆరోపణ  
  • ఐదు రోజుల క్రితం అడిషనల్ కలెక్టర్‌‌‌‌కు ఫిర్యాదు

వనపర్తి, వెలుగు: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లుంది ఉంది పీడీఎస్‌‌ పరిస్థితి. రేషన్‌‌ పంపిణీలో పారదర్శకత పెంచాలనే ఉద్దేశంతో సర్కారు ఇటీవల డీలర్లకు ఇచ్చిన 4జీ టీఈపాస్‌‌ మెషీన్లు సరిగ్గా పనిచేయడం లేదు.  దీంతో వీటిని మార్చాలని, లేదంటే పాత పద్ధతే కొనసాగించాలని  డీలర్లు ఐదు రోజుల క్రితం వనపర్తి అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్‌‌కు ఫిర్యాదు చేశారు. ఇవ్వాల్సిన  దానికంటే ఎక్కువ తూకం చూపిస్తున్నాయని, స్టాక్‌‌ పాయింట్ల వచ్చే బస్తాల్లోనూ దండె కొడుతున్నారని ఆరోపించారు.  సమస్య పరిష్కారం కాకపోవటంతో గత శనివారం దుకాణాలు కూడా బంద్ పెట్టారు. 

తరచూ మార్పులు చేస్తున్న సర్కారు

ప్రభుత్వం రేషన్ పంపిణీలో తరచూ మార్పులు చేస్తోంది.  ముందు బయోమెట్రిక్‌‌, ఐరీస్‌‌ ద్వారా బియ్యం పంపిణీ చేసిన సర్కారు.. కరోనా వైరస్‌‌ వ్యాప్తి సమయంలో ఫోన్‌‌కు ఓటీపీ పంపే సిస్టంలో ఇచ్చింది. కరోనా తగ్గాక మళ్లీ బయోమెట్రిక్‌‌కు మారింది. అయితే సర్వర్‌‌‌‌ సమస్యతో పంపిణీ ఆలస్యం అవుతుండడంతో కొద్ది రోజుల క్రితం డీలర్లకు 4జీ ఈపాస్‌‌ మెషీన్లు ఇచ్చింది.  దీన్ని ఎలక్ట్రానిక్ కాంటాకు కనెక్ట్‌‌ చేసి లబ్ధిదారులు వేలిముద్రలు తీసుకొని బియ్యం ఇస్తున్నారు. అయితే  ఈ మెషీన్లు తూకం సరిగ్గా చూపకపోవడంతో ఇటు డీలర్లు, అటు లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. 

నష్టపోతున్నామంటున్న డీలర్లు

తూకంలో వ్యత్యాసాల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నామని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  మెషీన్లు 30 కిలోల బియ్యాన్ని 40 కిలోలుగా చూపిస్తున్నాయని,  ఒకటికి రెండు సార్లు సరిచూసుకొవాల్సి వస్తోందని అంటున్నారు.  ఇలా చూసుకునే క్రమంలో తాము కావాలని చేస్తున్నామని లబ్ధిదారులు గొడవ పడుతున్నారని వాపోతున్నారు. వనపర్తి జిల్లాలోని 325 రేషన్ దుకాణాల్లో ఆగస్టు కోటా బియ్యం పంపిణీ ప్రారంభం కాగా చాలాచోట్ల ఇలాంటి సమస్య ఎదురవుతోందని చెబుతున్నారు.  లోపాలు సరిచేస్తామని అడిషనల్ కలెక్టర్‌‌‌‌ చెప్పినా ఇప్పటి వరకు టెక్నికల్ టీమ్‌‌ను గ్రామాలకు పంపడం లేదు.  

15 రోజులైనా బియ్యం పంపిణీ ఒడుస్తలేదు..

 సర్కారు రూల్స్‌‌ ప్రకారం ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీలోగా బియ్యం పంపిణీ పూర్తి చేయాలి. కానీ, ఈపాస్‌‌ మిషన్లలో లోపాలు,  స్టాక్ పాయింట్లలో సమస్యల కారణంగా 7, 8 తేదీల తర్వాత పంపిణీ  ప్రారంభిస్తుండడంతో 20వ తేదీకి కూడా ఒడుస్తలేదు.  స్టాక్ పాయింట్ల నుంచి బియ్యం లేట్‌‌గా రావడమే కాదు.. బస్తాల్లో రెండు మూడు కిలోలు తక్కువగా ఉంటున్నాయని డీలర్లు ఆరోపిస్తున్నారు.  మరో వైపు మెషీన్లు తప్పుడు తూకం చూపిస్తుండడంతో పంపిణీ లేట్‌‌ అవుతుందని చెబుతున్నారు. 

లోపాలు సరిచేస్తం

4జీ ఈపాస్ మిషన్లలో సమస్యలు ఉన్నట్లు డీలర్లు మా దృష్టికి తీసుకొచ్చారు. లోపాలను సరిచేసేందుకు సాంకేతిక సిబ్బందిని ఆయా గ్రామాలకు పంపిస్తున్నం. కొన్ని గ్రామాల్లో తూకాల్లో వ్యత్యాసం రావడం వల్ల డీలర్లు నష్టపోయినట్లు చెప్పారు. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాతే  బియ్యం పంపిణీ చేయాలి.

 –వేణుగోపాల్ , అడిషనల్ కలెక్టర్, వనపర్తి