డిసెంబర్ 9 నాటికి కుట్టు మెషీన్ల పంపిణీ: అధికారులకు మంత్రి పొన్నం ఆదేశం

డిసెంబర్ 9 నాటికి కుట్టు మెషీన్ల పంపిణీ: అధికారులకు మంత్రి పొన్నం ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ల పంపిణీ ప్రక్రియను డిసెంబర్ 9వ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికారులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. నియోజకవర్గానికి వెయ్యి చొప్పున కుట్టు మెషీన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ స్కీమ్‌‌కు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4.80 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. 

మంగళవారం సెక్రటేరియెట్‌‌లో బీసీ సంక్షేమ శాఖ పరిధిలో అమలవుతున్న వివిధ పథకాలు, గురుకుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఆత్మగౌరవ భవనాల నిర్మాణం, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ,  స్వయం ఉపాధి అవకాశాల కల్పనపై అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. మహాత్మా జ్యోతిబా ఫూలే విదేశీ విద్యా నిధి పథకం అమలు తీరును మంత్రి పరిశీలించారు. అర్హులైన మెరిట్ విద్యార్థులకు ఎలాంటి పెండింగ్ లేకుండా పూర్తి పారదర్శకతతో నిధులు అందజేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 

గురుకుల పాఠశాలలపై నివేదికలు అందించాలి
రాష్ట్రంలోని 327 మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలల్లో ఆర్సీవోలు క్షేత్రస్థాయి పర్యటనలు చేసి నివేదికలు అందించారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆ రిపోర్టుల ఆధారంగా గురుకులాల్లో ఉన్న మౌలిక వసతులు, సిబ్బంది ఖాళీలు, విద్యార్థుల సంఖ్య తదితర సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 

మొత్తం 327 గురుకులాల్లో ప్రస్తుతం కేవలం 26 పాఠశాలలకే సొంత భవనాలు ఉన్నాయని, మిగిలిన 301 పాఠశాలలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అయితే స్థలాలు సిద్ధంగా ఉన్న 37 గురుకులాలకు సొంత భవనాల నిర్మాణానికి అనుమతులు, నిధుల మంజూరుపై ప్రభుత్వంతో చర్చిస్తామని మంత్రి వెల్లడించారు.

ఉద్యోగులపై దాడి చేస్తే కఠిన చర్యలు
ఆర్టీసీ ఉద్యోగులపై దాడిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్​ హెచ్చరించారు. మూడు రోజుల క్రితం ఖమ్మం జిల్లా మణుగూరు డిపోకు చెందిన కండక్టర్ ప్రవళికను చిల్లర పైసల కోసం ప్రయాణీకురాలు తోసివేయడంతో తీవ్రంగా గాయపడింది. మంగళవారం హైదరాబాద్ దిల్‌‌సుఖ్ నగర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.