సంగారెడ్డి జిల్లాలో అక్రమ మైనింగ్​పై ఉక్కుపాదం

సంగారెడ్డి జిల్లాలో అక్రమ మైనింగ్​పై ఉక్కుపాదం
  •     టాస్క్ ఫోర్స్ తనిఖీలు.. మంత్రి, కలెక్టర్​కు రిపోర్ట్​ 
  •     క్వారీలపై కేసులు.. పర్మిషన్​ రద్దు చేయాలని సిఫార్సు

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఏరియాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై జిల్లా యంత్రాంగం ఫోకస్ పెట్టింది. అక్రమ మైనింగ్​ దందాను అరికట్టేందుకు సమగ్ర సర్వే చేయాలని నిర్ణయించి.. ఆరు శాఖల అధికారులతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఈ బృందం సర్వే పూర్తిచేసి మంత్రి దామోదర, జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతికి నివేదిక అందజేసింది. ఈ నివేదిక ఆధారంగా అక్రమంగా మైనింగ్​చేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోనున్నారు. 

అడ్డగోలుగా తవ్వేశారు 

 పటాన్‌చెరు మండలం లక్డారం, రుద్రారం, చిట్కుల్ గ్రామాల్లోని ఐదు క్వారీల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు చెప్తున్నారు. లక్డారంలో 4.23 హెక్టార్లలో క్వారీకి అనుమతి ఇవ్వగా 15 ఎకరాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ కనీస రక్షణ చర్యలు తీసుకోలేదని అధికారులు గుర్తించారు. సంతోష్ సాండ్ గ్రానైట్ సప్లై సంస్థకు లక్డారంలో సర్వే నెంబర్ 738లో క్వారీ కేటాయించారు. కానీ వారు కేటాయించిన స్థలానికి తోడు మరో 5.32 ఎకరాల్లో అక్రమంగా తవ్వకాలు చేసినట్టు సర్వేలో తేలింది. ఈ క్వారీని మూసేయాలని ఏడాది కిందటే ఉత్తర్వులు ఇచ్చారు. ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్​రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డికి చెందినది కావడంతో మైనింగ్​ యథేచ్ఛగా సాగుతూనే ఉంది. 

ఇదే గ్రామంలోని సర్వే నెంబర్ 738/1 లో క్వారీ అనుమతి పొందిన ముత్తిరెడ్డి అనే వ్యక్తి అదనంగా 1.30 ఎకరాల్లో మైనింగ్ చేస్తున్నారు. లక్డారంలోని జెరిపెట్టి వడ్డెర వెల్ఫేర్ అసోసియేషన్ కు సర్వే నెంబర్ 738/1 లో క్వారీ నిర్వహణ అనుమతి ఇవ్వగా, వారు అదనంగా 1.30 ఎకరాల్లో తవ్వకాలు చేపట్టారు. రుద్రారంలో సర్వే నెంబర్ 132లో ఎం.మల్లికార్జునరావుకు క్వారీ పర్మిషన్ ఇవ్వగా, అదనంగా 0.21 ఎకరాల్లో క్రషింగ్ చేశారు. చిట్కుల్ లో శ్రీనిధి మెటల్ ఇండస్ట్రీకి సర్వే నెంబర్ 472లో క్వారీ అనుమతి ఇవ్వగా, పక్కన ఉన్న మరో రెండు ఎకరాల సర్కారు భూమిలో తవ్వకాలు చేస్తున్నారు. టాస్క్​ఫోర్స్​ సమగ్రంగా సర్వే చేసి ఈ అక్రమాలను నిర్దారించింది. 

ముమ్మరంగా తనిఖీలు

జిల్లా వ్యాప్తంగా అక్రమ మైనింగ్​ జరుగుతున్నట్టు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అనుమతులకు మించి మైనింగ్ జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ క్రాంతి పటాన్ చెరు ఏరియాపై ఫోకస్​ పెట్టారు. మంత్రి దామోదర సూచనతో 20 రోజుల కింద స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ, మైనింగ్, పోలీసు, ఇరిగేషన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సర్వే ల్యాండ్ రికార్డ్ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్​ఫోర్స్​ముమ్మరంగా తనిఖీలు చేసింది. 

అనుమతులకు మించి తవ్వకాలు జరపడం, చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూముల్లోనూ తవ్వడం లాంటి ఉల్లంఘనలను టాస్క్​ఫోర్స్​ గుర్తించింది. రూల్స్ అతిక్రమించిన వారిపై పటాన్ చెరు పోలీసుస్టేషన్​లో ఇప్పటికే కేసులు పెట్టిన జిల్లా యంత్రాంగం వారి క్వారీలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది.