ఏక్ పేడ్ మాకే నామ్..ఒక్కో ఉద్యోగి ఒక్కో మొక్క నాటేలా ప్రోగ్రాం

ఏక్ పేడ్ మాకే నామ్..ఒక్కో ఉద్యోగి ఒక్కో మొక్క నాటేలా ప్రోగ్రాం
  • నేడు జిల్లాలో మెగా ప్లాంటేషన్
  • భాగస్వాములు కానున్న 13,900 ఉద్యోగులు

సిద్దిపేట, వెలుగు: భవిష్యత్ తరాలకు ఆరోగ్యంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడం  కోసం సిద్దిపేట జిల్లాలో  మొక్కల పెంపకం కోసం జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నెల 9న జిల్లాలో మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే  ఇందులో ప్రభుత్వ ఉద్యోగులందరినీ భాగస్వాములను చేయడం కోసం 'మాకే నామ్.. ఏక్ పేడ్'  పేరిట ఒక్కో ఉద్యోగి ఒక్కో మొక్క నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. 

కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలో పనిచేస్తున్న 13,900  మంది ఉద్యోగులు ఆయా ప్రాంతాల్లో ఒక్కో మొక్కను నాటి వాటి పరిరక్షణ కోసం  ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలోని 5 మున్సిపాలిటీలు, 508 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 9.30 గంటలకు నిర్వహించే కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వాములు కానున్నారు. మెగా ప్లాంటేషన్ లో భాగంగా జిల్లాలో ఒకే రోజు లక్ష మొక్కలకు పైగా నాటడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.

మెగా ప్లాంటేషన్ లో 13,900 ఉద్యోగులు

జిల్లాలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 13,900 మంది ఉద్యోగులు మెగా ప్లాంటేషన్ లో భాగస్వాములు కానున్నారు. ఈ సందర్భంగా మాకే నామ్ పే ఏక్ పేడ్ (తల్లి పేరిట మొక్క) పేరిట మొక్కలు నాటి వాటి పరరిక్షణకు చర్యలు చేపట్టనున్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలతో పాటు  మున్సిపాలిటీల సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే  సిద్దిపేట మున్సిపాలిటీలో స్మృతి వనంలో తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని మొక్కలు నాటేలా ప్రోత్సహిస్తున్నారు. 

యుద్ద ప్రాతిపదికన ఏర్పాట్లు

మెగా ప్లాంటేషన్ కార్యక్రమం కోసం యుద్ద ప్రాతిపదికన జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఆయా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మొక్కలు నాటడానికి అవసరమైన గుంతలను తవ్విస్తున్నారు. ఈజీఎస్ కూలీలు గుంతలు తవ్వే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఇందుకోసం గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మొక్కలను అందుబాటులో ఉంచారు. తల్లి పేరున నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను ఉద్యోగులు తీసుకోనున్నారు. ముందుగా గుర్తించిన ప్రదేశాల్లో గుంతలు తవ్వించి  మొక్కలు  నాటే కార్యక్రమం సజావుగా జరిగేలా  ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఆయా కార్యాలయాల అధికారులు బాధ్యతలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు.

భవిష్యత్ తరాల కోసం మెగా ప్లాంటేషన్

భవిష్యత్ తరాల ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం కోసం జిల్లా వ్యాప్తంగా ఒకే రోజు  మెగా ప్లాంటేషన్ ను నిర్వహిస్తున్నాం. కార్యక్రమంలో ఉద్యోగులను భాగస్వాములు చేయడం కోసం ఏక్ పేడ్ మా కే నామ్ పేరిట ప్రత్యేకంగా మొక్కలు నాటనున్నాం. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులతో పాటు ప్రజలను ఇందులో భాగస్వాములను చేసి పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందు కోసం గుర్తించిన ప్రాంతాల్లో గుంతలు తవ్వే కార్యక్రమం పూర్తయింది. - హైమవతి, జిల్లా కలెక్టర్