ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి : శరత్

ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి : శరత్

కొండాపూర్, వెలుగు:  ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వర్తించాలని  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శరత్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్​లో సెక్టోరల్ అధికారులు, స్టాటిస్టిక్​ సర్వైలెన్స్, ఫ్లయింగ్ స్క్వాడ్, సహాయ వ్యయ పరిశీలకులు, నిఘా బృందాల అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిఘా బృందాలు  పక్కాగా విధులు నిర్వర్తించాలని,  ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

ఎన్నికల కోడ్​ఉల్లంఘనలపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి క్షేత్రస్థాయి పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలన్నారు. తనిఖీల టైంలో సాధారణ ప్రజలను  ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు.  నగదును జప్తు చేసిన సందర్భాల్లో  ఆధారాలను చూపించి నగదును విడిపించుకోవచ్చని తెలియజేయాలన్నారు.సెక్టోరల్ ఆఫీసర్ల విధులు,  బాధ్యతలను తెలియజేసి నిబంధనలు పాటించాలన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు సెక్టోరల్ ఆఫీసర్ల పాత్ర కీలకమన్నారు. ఓటర్ టర్న్ అవుట్ తక్కువగా ఉన్న పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఓటర్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను మరోమారు తనిఖీ చేయాలని సూచించారు. ఎస్పీ రూపేశ్  మాట్లాడుతూ..  ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగేలా ప్రతి  ఒక్కరూ సహకరించాలన్నారు.

ప్రతి విషయంలో పూర్తి అవగాహనతో పనిచేయాలని, సొంత నిర్ణయాలు తీసుకోరాదని, పై అధికారుల సూచనలు తీసుకోవాలని సూచించారు. శిక్షణలో భాగంగా  ఈవీఎం, వీవీ ప్యాట్ల నిర్వహణ పై ప్రాక్టికల్ గా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్​ఓ నగేశ్​, డీసీఓ ప్రసాద్, నియోజకవర్గాల రిటర్నింగ్ ఆఫీసర్లు, డీఎస్పీలు, ఏఆర్వోలు, స్వీప్ నోడల్ ఆఫీసర్​అఖిలేష్ రెడ్డి,  కృష్ణ కుమార్,పాల్గొన్నారు. 

సీజైన డబ్బులు ఆధారాలు చూపించి పొందండి 

జిల్లాలో సీజ్ చేసిన నగదుకు సంబంధించి ఆధారాలను  గ్రీవెన్స్ కమిటీలో చూపించి తిరిగి పొందాలని కలెక్టర్​ శరత్​ సూచించారు. ఇప్పటివరకు సరైన ఆధారాలు సమర్పించిన 55 కేసుల్లో రూ. కోటి 47,87,180 లక్షలు విడుదల చేసినట్లు తెలిపారు. జహీరాబాద్ నియోజకవర్గం చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రూ.4 కోట్ల 55 లక్షల 46వేల 960  రూపాయల విలువగల 6,966.83 గ్రాముల బంగారు ఆభరణాలను పట్టుకుని సీజ్ చేశామన్నారు. ఈ వివరాలను ఇన్‌కమ్ టాక్స్​ ఆఫీసర్లకు పంపించినట్లు పేర్కొన్నారు. 

శివ్వంపేట: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 శాతం పోలింగ్​లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని మెదక్​ కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూలో   ఓటరు నమోదు అవగాహన  కార్యక్రమం, పారామిలటరీ దళాలతో  కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రలోభాలకు లోనూ కాకుండా  ఓటు వేయాలన్నారు.  ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ ఎక్కడైనా డబ్బు, మద్యం, ఏవైనా వస్తువుల పంపిణీ జరిగితే సి విజిల్​యాప్​ ద్వారా ఫిర్యాదు  చేయవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో  డీఎస్పీ ఫణిందర్, ఆర్డీఓ శ్రీనివాసులు, డీఎస్ఓ రాజిరెడ్డి పాల్గొన్నారు.

నామినేషన్ల సమయంలో ఎన్నికల కోడ్​ తప్పకుండా పాటించాలి

మెదక్ టౌన్: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల సమయంలో ఎన్నికల కోడ్​ తప్పకుండా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ రాజర్షి షా అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని ఆర్​వో కార్యాలయాన్ని  ఎస్పీ రోహిణి ప్రియదర్శినితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా మరికొద్ది రోజుల్లో  నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుందని.. ఆర్​వో కార్యాలయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,  సూచనలు అధికారులకు తెలియజేశారు.  ప్రతి రోజూ వచ్చిన నామినేషన్ పత్రాన్ని డిస్​ప్లే చేయాలని, ఎలక్షన్ కోడ్​ కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.

నవంబర్ 3 నామినేషన్  నోటిఫికేషన్ రిలీజ్​, నవంబర్ 10 నామినేషన్ సమర్పించేందుకు చివరి తేదన్నారు.  నవంబర్ 13 నామినేషన్ పరిశీలన , నవంబర్ 15 నామినేషన్ల  విత్​ డ్రా,  నవంబర్ 30  పోలింగ్ ఉంటాయని తెలిపారు. డిసెంబర్ 3  కౌంటింగ్ జరుగుతుందని, ఎన్నికల నిబంధనలు డిసెంబర్ 5 వరకు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.  కార్యక్రమంలో ఆర్వో,  ఆర్డీవో అంబదాస్​ రాజేశ్వర్​, ఏఎస్పీ మహేందర్, డీఎస్పీ ఫణీంద్ర, తహసీల్దార్​, ఎన్నికల సిబ్బంది ఉన్నారు. 

మెదక్​ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ రాజర్షి షా