సంక్షేమ ఫలాలు అందించేందుకే..ప్రజాపాలన : దామోదర రాజనర్సింహ

సంక్షేమ ఫలాలు అందించేందుకే..ప్రజాపాలన : దామోదర రాజనర్సింహ
  • జిల్లా ఇన్​చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ 

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు నేరుగా అందించేందుకే ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా ఇన్​చార్జి మంత్రి  సి.దామోదర రాజనర్సింహ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ లో ఉమ్మడి మహబూబ్ నగర్  జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రజా పాలన సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ ప్రజలకు అందించే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆఫీసర్లు ప్రజల వద్దకు వెళ్లి ఆరు గ్యారంటీలను ప్రజలకు అందించాలన్నారు.

ప్రతిరోజు అధికారులు గ్రామాలకు వెళ్లి ప్రజల నుంచి అప్లికేషన్లు తీసుకుంటారని తెలిపారు. వివిధ కారణాలతో దరఖాస్తు చేయని వారి నుంచి జనవరి 6 తరువాత కూడా అప్లికేషన్లు తీసుకుంటామని, పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, ప్రజా పాలన  కార్యక్రమాన్ని సక్సెస్​ చేసేందుకు సూచనలు ఇస్తే స్వీకరిస్తామని తెలిపారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రజా పాలన కార్యక్రమంపై విస్తృతంగా ప్రచారం చేయాలని, ఎవరికీ ఇబ్బంది కలగకుండా దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు.

 వీలైనన్ని కౌంటర్లు ఏర్పాటు చేయాలని, కలెక్టర్లు, జిల్లా అధికారులు పూర్తి సహకారం అందించాలని కోరారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని సక్సెస్​ చేసే బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. వనపర్తి, నారాయణపేట కలెక్టర్లు తేజస్  నందలాల్ పవార్, కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మహబూబ్ నగర్, నాగర్​కర్నూల్​ ఎంపీలు మన్నె శ్రీనివాస్ రెడ్డి, రాములు, వనపర్తి జడ్పీ చైర్మన్  లోక్ నాథ్ రెడ్డి, గద్వాల జడ్పీ చైర్ పర్సన్  సరిత

మహబూబ్ నగర్  జడ్పీ చైర్ పర్సన్  స్వర్ణ సుధాకర్ రెడ్డి, నారాయణపేట జడ్పీ చైర్ పర్సన్ వనజమ్మ, ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, శ్రీహరి, పర్ణికారెడ్డి, అనిరుధ్​రెడ్డి, విజయుడు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, అడిషనల్  కలెక్టర్లు  చౌహాన్, శ్రీనివాసులు, శివేంద్ర ప్రతాప్, ఎస్.మోహన్ రావు, దీపక్, వనపర్తి ఎస్పీ రక్షిత పాల్గొన్నారు.

ఆరు గ్యారంటీలపై జనం ఆశలు

వనపర్తి : కాంగ్రెస్​ సర్కారు ప్రకటించిన ఆరు గ్యారంటీలపై ఉమ్మడి జిల్లా ప్రజలు ఆశలు పెంచుకున్నారు. ఇక గురువారం నుంచి ప్రారంభమయ్యే ప్రజా పాలన గ్రామసభల నిర్వహణకు స్పెషల్​ ఆఫీసర్లను నియమించారు. ఇప్పటికే గ్రామాలు, మున్సిపల్​ వార్డుల్లో ధరఖాస్తులను స్వీకరించేందుకు  తేదీ, సమయం ప్రకటించారు. ఎంపీడీవో,తహసీల్దార్ తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొననున్నారు. 

ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీలు గ్రామ సభల్లో పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకోనున్నారు. వనపర్తి జిల్లాలోని 255 గ్రామ పంచాయతీలతో పాటు ఐదు మున్సిపాలిటీల్లోని 80 వార్డుల్లో సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలతో పాటు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు.