‘కార్మికులెవరూ డిపోల దగ్గరకు రావొద్దు’

‘కార్మికులెవరూ డిపోల దగ్గరకు రావొద్దు’
  • డిపోల దగ్గరకు వచ్చి.. తాత్కాలిక కార్మికుల్ని అడ్డుకుంటే చట్టరీత్యా చర్యలు: జిల్లా ఎస్పీలు

ఆర్టీసీ సమ్మె విషయం లేబర్ కోర్టులో ఉన్నందున కార్మికులు డ్యూటీలో జాయిన్ అవడానికి ఎవరూ డిపోల దగ్గరకు రావద్దని పలు జిల్లాల ఎస్పీలు ఆర్టీసీ జేఏసీకి సూచించారు. లేబర్ కోర్టులో ఇంకా ఏమీ తేలలేదు కాబట్టి డిపోల దగ్గరకు వచ్చి చట్ట వ్యతిరేక చర్చలకు పాల్పడొద్దని చెప్పారు. తాత్కాలిక కార్మికుల విధులకు ఆటంకం కలిగించొద్దని, ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీలు.. ఆయా జిల్లాల జేఏసీ నేతలకు తెలిపారు.

సమ్మె విరమిస్తున్నాం

సోమవారం సాయంత్రం తాము సమ్మె విరమిస్తున్నామని ఆర్టీసీ జేఏసీ ప్రకటిచింది. మంగళవారం ఉదయం డిపోలకు వెళ్లి కార్మికులంతా విధుల్లో చేరాలని జేఏసీ నేతలు చెప్పారు. తాము డ్యూటీలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నామని, మంగళవారం నుంచి తాత్కాలిక ఉద్యోగులు విధులకు రావొద్దని అన్నారు జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి. 52 రోజుల పాటు తమ సమ్మె ఆర్టీసీని కాపాడుకోవడానికే చేసిందని చెప్పారు.

విధుల్లోకి తీసుకోం

కానీ, ప్రభుత్వం కార్మికులను విధుల్లోకి తీసుకోబోమని ప్రకటించింది. లేబర్ కమిషనర్ నిర్ణయం వచ్చేంతవరకు వేచి చూడాలని ఆర్టీసీ ఇన్‌చార్జ్ ఎండీ సునీల్ శర్మ. జేఏసీ నిర్ణయం హాస్యాస్పదంగా ఉందని.. ఇష్టం వచ్చినప్పుడు సమ్మె చేయడం, వారి ఇష్టం వచ్చినప్పుడు విధుల్లోకి రావడం సాధ్యం కాదని చెప్పారు. హైకోర్టు చెప్పిన ప్రక్రియ ముగిసే వరకు కార్మికులను విధుల్లోకి చేర్చుకోవడం కుదరదన్నారు. లేబర్ కమిషనర్ నిర్ణయం తీసుకునే వరకు అందరూ సంయమనం పాటించాలని సూచించారు. తాత్కాలిక కార్మికులను అడ్డుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అన్ని డిపోల దగ్గర పోలీసు భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.