ఇక తెలంగాణ ప్రధాన పంట పత్తి!

ఇక తెలంగాణ ప్రధాన పంట పత్తి!

హైదరాబాద్‌, వెలుగు వాణిజ్య పంట పత్తి ఇక నుంచి తెలంగాణ ప్రధాన పంట కానుంది. అధికారికంగా పత్తిని ప్రధాన పంటగా ప్రభుత్వం ప్రకటించనుంది. ఈ వానాకాలం నుంచి కొత్త వ్యవసాయ పాలసీలో పంటల సాగుకు రాష్ట్ర  ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా ఏ జిల్లాలో ఏయే పంటలు వేయాలనే విషయంపై ప్రత్యేక మ్యాపింగ్‌తో వ్యవసాయ శాఖ ప్లాన్​ను రెడీ చేసింది. వానాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కోటీ 35 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాలనే అంచనాలతో ఈ ప్లాన్​ రూపొందించింది. ఇందులో పత్తి, వరి, కంది పంటలు కలిపి కోటీ 19 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని ప్రతిపాదించింది. మిగతా పంటల్లో కొద్దిపాటి మార్పులు చేసింది. ఈ ప్లాన్​ను గురువారం అధికారికంగా ప్రకటించనున్నారు. వానాకాలంలో పత్తిని 64 లక్షల 70 వేల ఎకరాల్లో సాగు చేయాలని ప్లాన్​లో పేర్కొంది. నిరుడు వానాకాలంలో 46.48 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగైంది. దాంతో పోలిస్తే ఈసారి అదనంగా 18.22 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసేలా ప్లాన్​ను సిద్ధం చేసింది. వరిని 40.24 లక్షల ఎకరాల్లో సాగు చేసేలా ప్రతిపాదనలు ఉన్నాయి. నిరుడు వానాకాలంలో 41 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు దాదాపు 80 వేల ఎకరాల్లో వరి సాగు తగ్గనుంది. కంది పంట సాగును భారీగా పెంచేలా ప్రతిపాదనలు ఉన్నాయి. రాష్ట్రంలో 14.09 లక్షల ఎకరాల్లో కంది సాగుకు మ్యాపింగ్‌చేశారు. నిరుడు వానాకాలంలో కంది సాగు 7 లక్షల ఎకరాలే ఉంది.

పత్తిలో నల్గొండ టాప్

పత్తి ప్రధాన పంటగా మారుతున్నందున జిల్లాల వారీగా పంటల సాగుపైనా వ్యవసాయ శాఖ స్పష్టత ఇచ్చింది. తాజా ప్రతిపాదనల ప్రకారం.. పత్తి సాగులో నల్గొండ జిల్లా మొదటి ప్లేస్​లో నిలువనుంది. నల్లొండ జిల్లాలో 7.25 లక్షల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేసేలా వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది. 4.50 లక్షల ఎకరాలతో నాగర్‌కర్నూల్‌జిల్లా రెండో స్థానంలో ఉండనుంది. ఆదిలాబాద్‌జిల్లాలో 4.35 లక్షల ఎకరాలు, సంగారెడ్డి జిల్లాలో 4.20 లక్షల ఎకరాలు, కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో 3.40 లక్షలు ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 3.35 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేసేలా వ్యవసాయ శాఖ ప్లాన్​ రెడీ చేసింది. సిటీ ప్రాంతం ఎక్కువగా ఉండే మేడ్చల్​మల్కాజ్​గిరి జిల్లాలో సాగును వెయ్యి ఎకరాలకు పరిమితం చేసింది.

వరిలోనూ నల్గొండే టాప్​

తాజా ప్లాన్​ ప్రకారం.. 22 జిల్లాలో వరి సాగు తగ్గేలా ఉంది. వరి సాగులోనూ నల్గొండ జిల్లా మొదటి ప్లేస్​లో నిలువనుంది. ఈ జిల్లాలో 3.30 లక్షల ఎకరాల్లో వరి సాగుకు అనుమతిచ్చారు. 3.20 లక్షల ఎకరాలతో సూర్యాపేట రెండో స్థానంలో ఉంది. నిజామాబాద్‌జిల్లాలో 3 లక్షల ఎకరాలు, జగిత్యాల జిల్లాలో 2.52 లక్షల ఎకరాలల్లో వరి సాగుకు అనుమతిచ్చారు. అతి తక్కువగా ఆదిలాబాద్‌జిల్లాలో 1293 ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేసేలా ప్లాన్​ రెడీ చేశారు.

కందిలో వికారాబాద్‌టాప్

కంది సాగు విస్తీర్ణాన్ని రెట్టింపు చేయనున్నారు. దీంతో దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఈ పంట సాగు పెరుగనుంది. ప్రస్తుతం కంది సాగు ఎక్కువగా ఉండే వికారాబాద్ జిల్లా తాజా ప్లాన్​లోనూ మొదటి స్థానంలో ఉంది. వికారాబాద్​ జిల్లాలో 1.73 లక్షల ఎకరాల్లో కంది పంట సాగుకు ప్లాన్​ రెడీ చేశారు. 1.70 లక్షల ఎకరాలతో నారాయణపేట జిల్లా రెండో ప్లేస్​లో ఉంది. రంగారెడ్డి జిల్లాలో లక్ష ఎకరాలు, మంచిర్యాల జిల్లాలో 85 వేల ఎకరాలు, ఆదిలాబాద్‌జిల్లాలో 80 వేల ఎకరాలు, జయశంకర్​భూపాలపల్లిలో 80 వేల ఎకరాల్లో కంది సాగుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది.

మక్క బంద్​..సోయాబీన్​లో కోత

వానాకాలంలో మక్క పంట సాగు చేయొద్దని రాష్ట్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యవసాయ శాఖ ప్లాన్​లో సైతం ఇదే విధంగా ఉంది. జొన్న, మినుములు, ఆముదం పంటల సాగును పెంచాలని మ్యాపింగ్‌లో నిర్ణయించారు. 1.42 లక్షల ఎకరాల్లో జొన్న, 66 వేల ఎకరాల్లో మినుము, 1.39 లక్షల ఎకారాల్లో ఆముదం, 69,855 ఎకరాల్లో చెరుకు, 49,960 ఎకరాల్లో పల్లి సాగు చేసేలా పంటల మ్యాపింగ్ ఉంది. ఆదిలాబాద్‌లో ఎక్కువగా సాగయ్యే సోయాబీన్‌ పంటను సగానికి తగ్గించాలని ప్రతిపాదించారు. రాష్ట్రవ్యాప్తంగా సాధారణంగా 4.26 లక్షల్లో సాగు చేసే సోయాబీన్‌ను ఈసారి  1.80 లక్షల తగ్గించాలని నిర్ణయించారు. కూరగాయలు, మిర్చి ఇతర పంటల సాగు విస్తీర్ణాన్ని కూడా  మ్యాపింగ్ చేశారు.

క్లోరో క్విన్ పనిచేస్తోంది