హైదరాబాద్: మేడ్చల్ జిల్లా నాగారంలో ఆగి ఉన్న లారీని డివైన్ గ్రేస్ స్కూల్ బస్ ఢీకొట్టింది. స్కూల్ బస్లో కేవలం ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అసలు ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న కీసర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ టౌన్లో గత నెలలో ఇలాంటి ఘటనే జరిగింది. రావుస్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
బస్సులో 40 మంది విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులను తీసుకొని స్కూలుకు వెళ్తుండగా బీదర్ క్రాస్ రోడ్డు దగ్గర బస్సు లోంచి పొగలు రావడం చూసి డ్రైవర్ అప్రమత్తమై నిలిపేశాడు. విద్యార్థులను క్షేమంగా దింపేశారు. పొగలు వచ్చిన ప్రాంతంలో మంటలు చెలరేగడంతో స్థానికులు నీళ్లను తెచ్చి ఆర్పేశారు. డ్రైవర్ అప్రమత్తతతో విద్యార్థులకు ప్రమాదం తప్పింది. డ్రైవర్ సమయస్ఫూర్తిని స్థానికులు కొనియాడారు.

