
హైదరాబాద్, వెలుగు: ఫార్మా రంగంలోని దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ నికరలాభం సెప్టెంబర్ 2022 క్వార్టర్లో 18.5 శాతం తగ్గిపోయింది. ఈ క్వార్టర్లో కంపెనీకి రూ. 494 కోట్ల లాభం వచ్చింది. తాజా సెప్టెంబర్ క్వార్టర్లో దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ రూ. 630 కోట్ల లాభం సంపాదిస్తుందని ఎనలిస్టులు అంచనా వేశారు. కానీ, కంపెనీ ఈ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ ఏడాది క్యూ2 లో రెవెన్యూ కూడా 3.6 శాతం తగ్గి రూ. 1,935 కోట్లకే పరిమితమైంది. అంతకు ముందు ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో కంపెనీ రెవెన్యూ రూ. 2,007 కోట్లు. సెప్టెంబర్ 2022 క్వార్టర్లో ఫారెక్స్ గెయిన్ రూ. 30 కోట్లని దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. అంతకు ముందు ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో ఈ గెయిన్ రూ. 7 కోట్లు మాత్రమే. తాజా క్వార్టర్లో కన్సాలిడేటెడ్ మార్జిన్లు 33.5 శాతానికి తగ్గిపోయినట్లు కూడా కంపెనీ వెల్లడించింది. క్వార్టర్లీ రిజల్ట్స్ ప్రకటన నేపథ్యంలో దివీస్ లేబొరేటరీస్ షేర్లు సోమవారం సెషన్లో 7 శాతం పతనమై రూ. 3,482 వద్ద క్లోజయ్యాయి.