ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వండి

ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వండి
  •     రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశం 
  •     కేసుల విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రత్యేక బెంచ్ ఏర్పాటు

హైదరాబాద్, వెలుగు: ప్రజా ప్రతినిధులపై వివిధ కోర్టుల్లో విచారణలో ఉన్న కేసుల వివరాలను అందజేయాలని హైకోర్టు రిజిస్ట్రీని డివిజన్‌‌ బెంచ్‌‌ ఆదేశించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను హైకోర్టు సుమోటోగా పరిగణించి విచారణ చేపట్టింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్ కుమార్‌‌‌‌ల డివిజన్ బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది. 

అశ్వనీ కుమార్ ఉపాధ్యాయ్ కేసులో ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉన్న కేసులను ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం సుప్రీంకోర్టు ఈ నెల 9న విచారణ జరిపింది. ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల పర్యవేక్షణకు తామిచ్చిన మార్గదర్శకాలను సుమోటో పిటిషన్‌‌గా విచారణ చేయాలని ఉత్తర్వులిచ్చింది. నేరాల తీవ్రత ఆధారంగా కేసుల జాబితా ఇవ్వాలని సుప్రీం సూచించింది. ఈ క్రమంలో జిల్లా కోర్టులతో పాటు హైకోర్టులో ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలను ఇవ్వడంతో పాటు విచారణ దశ ఎంతవరకు వచ్చిందో రెండు వారాల్లోగా సమగ్ర వివరాలు అందజేయాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశించింది. 

ఉరి శిక్ష పడే కేసులను ముందు విచారించాలని, తర్వాత ఐదేండ్లు అంతకన్నా ఎక్కువ శిక్షలు పడే కేసులను విచారణ చేపట్టాలని సుప్రీం మార్గదర్శకాలు ఉన్నాయని పేర్కొంది. అవసరమైతేనే వాయిదాలు ఇవ్వాలని, దీర్ఘకాల వాయిదాలకు అనుమతి ఇవ్వరాదని చెప్పింది. ఈ కేసుల విచారణ చేపట్టే ప్రత్యేక కోర్టుకు అన్ని మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించినట్టు వివరించింది. రాష్ట్రాల వారీగా ఉన్న కేసుల వివరాలను సుప్రీంకోర్టు వెలువరించిన ఉత్తర్వుల్లో ఉన్నాయని, తెలంగాణలో 2022 నాటికి 17 కేసులు ఉన్నాయని హైకోర్టు తరఫు సీనియర్ లాయర్ జి.విద్యాసాగర్ తెలిపారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు గడువు కావాలని కోరడంతో విచారణ రెండు వారాలకు వాయిదా పడింది.