ఏపీ వాళ్లను అక్కడికి పంపుతలె.. మనోళ్లను ఇక్కడికి తెస్తలె

ఏపీ వాళ్లను అక్కడికి పంపుతలె.. మనోళ్లను ఇక్కడికి తెస్తలె
  • ముందుకు సాగని ఉద్యోగుల విభజన
  • రిలీవ్​ కోసం ఆర్డర్స్​ ఇచ్చి చేతులు దులుపుకున్న రెండు ప్రభుత్వాలు
  • రిలీవ్​ అయినోళ్ల డ్యూటీపై ఇప్పటికీ క్లారిటీ లేదు
  • తెలంగాణలో ఏపీ ఉద్యోగులు 7 వేల మంది
  • ఏపీలో తెలంగాణ ఉద్యోగులు 8 వేల మంది
  • సొంత రాష్ట్రంలో పనిచేయాలని ఎదురుచూపులు

హైదరాబాద్ , వెలుగు: రాష్ట్రంలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులను ఏపీకి, అక్కడ పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను ఇక్కడికి తీసుకొచ్చే ప్రక్రియ ముందుకు కదుల్తలేదు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఉద్యోగులను రిలీవ్ చేయడానికి జీవోలు ఇచ్చి చేతులు దులుపుకున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఎంత మంది అప్లయ్​ చేసుకున్నరు.. వారిని ఎలా రిలీవ్​ చేయాలి అనే దానిపై ఫోకస్​ పెట్టడం లేదు. దీంతో ఉద్యోగుల విభజన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా తయారైంది. రిలీవ్ అయినవాళ్లను డ్యూటీలోకి తీసుకుంటామని ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ, అటు ఏపీ ప్రభుత్వం కానీ ఆర్డర్స్​ ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
ఏపీలో తెలంగాణ స్థానికత గల ఉద్యోగులు సుమారు 8 వేల మంది.. మన దగ్గర ఏపీ స్థానికత ఉన్న ఉద్యోగులు దాదాపు 7 వేల మంది దాకా ఉన్నట్లు అంచనా. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులను రిలీవ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్ లో ఉత్తర్వులు ఇచ్చింది. పనిచేస్తున్న డిపార్ట్ మెంట్ హెచ్​వోడీలకు అక్టోబర్ 15 కల్లా అప్లయ్​ చేసుకోవాలని, అన్ని శాఖల ఆఫీసర్లు ఈ అప్లికేషన్లను సీఎస్ కు పంపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే అక్టోబర్ లో దసరా సెలవులు రావటంతో ఈ ప్రాసెస్  స్లో అయింది.  దీంతో అదే నెల చివరి వరకు గడువు పొడిగిస్తున్నట్లు హెచ్​వోడీలకు సర్కారు సమాచారమిచ్చింది. తరువాత ప్రక్రియ ఇప్పటికీ ముందుకు సాగడం లేదు.  
ఇద్దరు సీఎంలు అంగీకరిస్తేనే..!
ఉద్యోగుల పరస్పర బదిలీకి తెలంగాణ, ఏపీ సీఎంలు అంగీకరించాల్సి ఉంటుందని సీనియర్ ఉద్యోగులు చెప్తున్నారు. “ఇక్కడ నుంచి ఏపీ వాళ్లు అక్కడికి, అక్కడ ఉన్న తెలంగాణ వాళ్లు ఇక్కడికి వచ్చేందుకు ఇద్దరు సీఎంలు అంగీకరించాలి. అట్లా అంగీకరిస్తే.. ఇరు రాష్ట్రాల సీఎస్ లు సంతకాలు చేసి జీవో ఇస్తరు. కానీ, ఇప్పటివరకు అలాంటి ప్రాసెస్​ ఏమీ లేదు. తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ అయ్యేందుకు అప్లయ్​ చేసుకోవాలని ఆర్డర్స్ ఇచ్చి చేతులు దులుపుకుంది” అని ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ కు చెందిన ఓ ఆఫీసర్​ అన్నారు. 
మనదగ్గర ఉన్నోళ్లలో ఎక్కువ మంది టీచర్లు, పోలీసులే
రాష్ట్రంలో సుమారు 7వేల మంది ఏపీ ఉద్యోగులు పనిచేస్తుండగా.. వీరిలో టీచర్లు, పోలీస్ డిపార్ట్ మెంట్ వాళ్లే సగానికిపైగా ఉన్నట్లు అంచనా. రాష్ట్ర సర్కార్ ఇచ్చిన రిలీవ్​ ఉత్తర్వుల డెడ్ లైన్  దాటి నెల అవుతున్నది. సుమారు 2 వేల మంది ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్లు ఏపీకి వెళ్లేందుకు అప్లై చేసుకున్నట్లు పోలీస్ డిపార్ట్ మెంట్ చెప్తున్నది. మిగతా వాళ్లు చేసుకుందామనుకున్నా.. అక్కడ ఏపీలో తమను ఉద్యోగాల్లోకి తీసుకుంటారో లేదోనన్న భయంతో వెనుకడుగు వేస్తున్నారు. దీనికి తోడు ఏపీలో రిటైర్ మెంట్ ఏజ్ 60 ఉండగా , తెలంగాణ లో 61 ఉంది. ఏపీలో పీఆర్సీ ఇవ్వకపోగా ఇక్కడ ఇచ్చారు. ఈ అంశాల కారణంగా కూడా కొందరు ఉద్యోగులు అప్లయ్​ చేసుకునేందుకు వెనుకాడుతున్నట్లు ఓ సీనియర్​ ఆఫీసర్​ చెప్పారు. అయితే.. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులు వారి రాష్ట్రానికి వెళ్తే ఆ ప్లేస్ లో తమకు పోస్టింగ్ ఇస్తారని ఇక్కడి ఉద్యోగులు భావిస్తున్నారు. ఏపీ వాళ్లు రిలీవ్ అయితే చాలా మంది తెలంగాణ ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే అవకాశముంది. అయితే ఈ ప్రాసెస్ అనుకున్నంత స్పీడ్ కాకపోవటంతో వారు నిరాశ చెందుతున్నారు.
ఏపీ నుంచి భారీ క్యూ
ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు వేలల్లో ఉన్నారు. వీరు మెడికల్​, స్పౌజ్ కేటగిరిలో తెలంగాణకు వెళ్తామని, రిలీవ్ చేయాలని ఏపీ సర్కారుకు అప్లయ్​ చేసుకున్నట్లు తెలుస్తున్నది. వీరిలో గెజిటెడ్ ఆఫీసర్లు కూడా ఉన్నట్లు  సమాచారం. అయితే ఈ గెజిటెడ్ ఆఫీసర్లు ఇక్కడికి వచ్చి పోస్టింగ్ తీసుకుంటే వారు రిటైర్ అయి, పోస్ట్ ఖాళీ అయ్యేదాకా తమకు ప్రమోషన్స్ రావని తెలంగాణ ఆఫీసర్లు అభ్యంతరం చెప్తున్నట్లు తెలుస్తోంది.  ఏపీలోని 200 మందికి పైగా హెడ్ కానిస్టేబుళ్లు తెలంగాణకు వచ్చేందుకు అప్లయ్​ చేసుకున్నట్లు సమాచారం. వారు తెలంగాణకు వస్తే తమకు హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ రాదని ఇక్కడి కానిస్టేబుళ్లు వాదిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏ రాష్ట్రం వాళ్లు ఆ రాష్ట్రంలో పనిచేయాలి
ఏ రాష్ట్రం వాళ్లు ఆ రాష్ట్రంలో పని చేయాలని మొదటి నుంచి కోరుతున్నం. ఏపీ నుంచి 400 మంది ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్​ను  తెలంగాణకు తీసుకొచ్చినం. నేడో రేపో 123 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు తెలంగాణకు వస్తున్నరు. కొంత మంది  గ్రూప్ –1 ఉద్యోగులు వచ్చి జాయిన్ అయిన్రు. తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేయనున్న ఏపీ ఉద్యోగులను తీసుకుంటామని ఏపీ సర్కారు అధికారికంగా చెప్పాలి.  ఇక్కడి నుంచి వెళ్లేందుకు చాలా మంది ఎదురు చూస్తున్నరు. -మామిళ్ల రాజేందర్, టీఎన్జీవో అధ్యక్షుడు 
రిలీవ్​ జీవో ఇస్తే సరిపోతదా?
రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉద్యోగుల రిలీవ్  కోసం అప్లయ్​ చేసుకోవాలని జీవో ఇచ్చి చేతులు దులుపుకున్నాయి. కానీ, అప్లయ్​ చేసుకున్నోళ్లను రిలీవ్ చేయటానికి ఆర్డర్స్ ఎందుకు ఇవ్వట్లేదు? ఎంత మంది అప్లై చేసుకున్నరు... మిగతా వాళ్లు ఎందుకు చేసుకోట్లే, వాళ్లకు ఉన్న సమస్యలు ఏమిటి?.. అన్న విషయాలపై రెండు ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి.  రిలీవ్ అయిన వాళ్లను చేర్చుకునేందుకు రెడీగా ఉన్నామని ఇంతవరకు రెండు ప్రభుత్వాలు అంగీకరించలేదు. అలాంటప్పుడు  రిలీవ్ అయ్యేందుకు అప్లై చేసుకోవాలని ఎందుకు జీవో ఇచ్చిన్రు? - మధుసూదన్ రెడ్డి, ఇంటర్ జేఏసీ కన్వీనర్