అక్టోబర్ 3 నుంచి డివిజన్ యాత్ర: రేవంత్ రెడ్డి

అక్టోబర్ 3 నుంచి డివిజన్ యాత్ర: రేవంత్ రెడ్డి

అబద్దాలు చెప్పి ఓట్లు దండుకున్న టీఆర్‌ఎస్‌ నేతలు ఏం మొహం పెట్టుకుని రాబోయే GHMC, వరంగల్‌, ఖమ్మం ఎన్నికల్లో మళ్లీ ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రేవంత్‌రెడ్డి. వచ్చే ఎన్నికల్లో తాము గట్టి పోటీ ఇస్తామని  ప్రకటించారు. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు అన్ని మున్సిపల్‌ ఎన్నికలను తాము ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడుతామని అన్నారు.

అక్టోబర్‌ 3 నుంచి తన పార్లమెంట్‌ పరిధిలో ‘డివిజన్‌ యాత్ర’ చేపడుతున్నట్లు తెలిపారు రేవంత్ రెడ్డి. టీఆర్‌ఎస్‌ విస్మరించిన హామీలపై ప్రజలను చైతన్య పరుస్తానన్నారు. మున్సిపల్‌ మంత్రిగా విఫలమైన కేటీఆర్‌కు ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదన్నారు .గ్రేటర్‌ను ఇస్తాంబుల్‌ చేస్తామని, ట్యాంక్ బండ్‌లో నీళ్లను కొబ్బరి నీళ్లు చేస్తామని, లక్ష డబుల్‌ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పి 99 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ గెలిచిందన్నారు. కానీ, గ్రేటర్‌లో ఇప్పటివరకు కేవలం 128 ఇళ్లు మాత్రమే కట్టారని, డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇవ్వకపోవడంతో కిరాయి రూపంలో పేదలపై రూ.1,200 కోట్ల భారం పడిందన్నారు. హైదరాబాద్‌లో అద్భుతాలు సృష్టించినట్టు కేటీఆర్‌ గొప్పలు చెబుతున్నారని, పేద ప్రజలకు ఉపయోగపడే దగ్గర ఎక్కడా రోడ్లు కూడా వేయలేదని ఆరోపించారు. అయ్యప్ప సొసైటీలో ప్రజలను భయపెట్టి ఓట్లు దండుకున్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి.