- అప్పుడే దేశ విభజనకు బీజం
- ఈ దేశాన్ని కొత్త శక్తితో నింపుతుంది
- వందేమాతరం స్మారకోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ కామెంట్స్
- స్మారక స్టాంపు, నాణెం విడుదల.. ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభం
న్యూఢిల్లీ: వందేమాతరం గేయంలోని కొన్ని ముఖ్యమైన చరణాలను 1937లో తొలగించారని, అప్పుడే దేశ విభజనకు బీజం పడిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఇప్పటికీ అలాంటి విభజన మైండ్‌సెట్ దేశానికి సవాల్‌గానే మారిందని విమర్శలు చేశారు.
శుక్రవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన వందేమాతరం 150వ స్మారకోత్సవంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక స్మారక స్టాంపు, నాణేన్ని విడుదల చేశారు. వీటితో పాటు ‘vandemataram 150.in’ అనే పోర్టల్‌ను ప్రారంభించారు. ఢిల్లీ ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఢిల్లీ సీఎం రేఖ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
మోదీ మాట్లాడుతూ..‘‘భారత స్వాతంత్య్ర ఉద్యమంలో వందేమాతరం గేయం దేశ స్వరంగా మారింది. ఆ గేయం ద్వారా ప్రతి భారతీయుడు తన భావాలను వ్యక్తపరిచాడు. కానీ దురదృష్టవశాత్తూ 1937లో ఆ గేయానికే ఆత్మలాంటి చరణాలను తొలగించారు. అప్పుడే విభజనకు నాంది పలికింది. జాతి నిర్మాణం కోసం రూపొందించిన ఈ ‘మహా మంత్రం’ పట్ల అన్యాయం ఎందుకు జరిగిందో నేటి తరం తెలుసుకోవాలి” అని సూచించారు.
వందేమాతరం.. ఓ మంత్రం
వందేమాతరం ఒక మంత్రం, ఒక శక్తి, ఒక కల, ఒక సంకల్పం అని మోదీ పేర్కొన్నారు. ఇది భరతమాతకు నివేదించే భక్తి, ఆరాధన అన్నారు. వందేమాతరం.. ప్రజలకు స్ఫూర్తి మంత్రంగా పనిచేస్తుందని, కొత్త శక్తితో నింపుతుందని చెప్పారు. ఇది ఘన చరిత్రను గుర్తుచేస్తూ, వర్తమానాన్ని ఆత్మవిశ్వాసంతో నింపుతుందని, బంగారు భవిష్యత్తు కోసం ధైర్యాన్ని అందిస్తుందన్నారు.
ఈ సామూహిక గేయాలాపన హృదయాన్ని స్పందింపజేస్తుందని చెప్పారు. ఉగ్రవాదం పేరుతో శత్రువులు మన భద్రత, గౌరవంపై దాడి చేస్తే, అప్పుడు భారత్ ఎలా దుర్గ అవతారాన్ని ఎత్తిందో ప్రపంచం మొత్తం చూసిందన్నారు. “దేశాన్ని రాజకీయ భూభాగంగా మాత్రమే చూసేవారికి.. దేశాన్ని తల్లిగా భావించడం ఆశ్చర్యం కలిగించవచ్చు.
కానీ భారత్ వేరు. తల్లి జన్మ ఇచ్చేది, పోషించేది, పిల్లలు ప్రమాదంలో ఉన్నప్పుడు దుష్ట శక్తులను నాశనం చేసేది” అని వ్యాఖ్యానించారు. శత్రు కుట్రలను సైనికులు అణచివేస్తున్నప్పుడు, ఉగ్రవాదం, -నక్సలిజం- ఓడిపోతున్నప్పుడు.. “వందేమాతరం గర్జిస్తున్నది” అని అన్నారు. భారతీయులు దేన్నైనా సాధించగలరని, జ్ఞానం..విజ్ఞానం.. సాంకేతికత నిండిన దేశాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు.
ఢిల్లీలో వందేమాతరం గేయం 150వ స్మారకోత్సవం
స్వాతంత్రోద్యమంలో కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తిగా నిలిచిన గేయం ‘వందేమాతరం’. ఈ గేయాన్ని బంకించంద్ర ఛటర్జీ 1875 నవంబరు 7న రచించారు. ఇది తొలిసారి ఆనంద్ మఠ్ నవలలో ప్రచురితమైంది. ఈ గేయానికి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా శుక్రవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రభుత్వం వేడుకలు నిర్వహించింది. ప్రధాని మోదీ ఈ వేడుకలను ప్రారంభించారు. ఇందులో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వందేమాతర గేయాలాపన చేశారు.
'వందే మాతరం' దేశ ప్రజల భావోద్వేగ చైతన్యానికి, సమైక్యతకు ప్రతీకగా నిలుస్తూనే ఉంది" అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు. 1905 నాటి స్వదేశీ ఉద్యమానికి ఈ పాట స్ఫూర్తిదాయకంగా మారిందని, అప్పటి నుంచి ఈ పాట మన దేశవాసుల భావోద్వేగ చైతన్యానికి, సమైక్యతకు ప్రతిబింబంగా ఉందని రాష్ట్రపతి చెప్పారు. వందేమాతరం గేయం 150 ఏళ్ల వేడుకలను అన్ని రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. ఆయా రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
