చదరంగంలో యువ రాణి దివ్య దేశ్‎ముఖ్.. ఫిడే వరల్డ్ కప్ విజేత సక్సెస్ స్టోరీ

చదరంగంలో యువ రాణి దివ్య దేశ్‎ముఖ్..  ఫిడే వరల్డ్ కప్ విజేత సక్సెస్ స్టోరీ

చెస్ బోర్డుపై పట్టు, చదువులోనూ అంతే శ్రద్ధ. అకడమిక్స్, ఆటను అద్భుతంగా సమన్వయం చేసుకుంటూ దేశ చెస్ యవనికపై ఓ నవతార ఉదయించింది. కేవలం 19 ఏండ్లకే ఫిడే వరల్డ్ కప్ గెలిచి చెస్‌‌ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది నాగ్‌‌పూర్ సంచలనం దివ్య దేశ్‌‌ముఖ్. 24 రోజుల పాటు సాగిన ఈ టోర్నమెంట్ అసలేమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన దివ్య ఒక్కో ఎత్తుతో ప్రత్యర్థులకు చెమటలు పుట్టిస్తూ.. ఆఖరాటలో  దేశ తొలి మహిళా గ్రాండ్‌‌మాస్టర్ కోనేరు హంపిను ఓడించి ఒక్కసారిగా అసాధారణ విజేతగా మారింది. డాక్టర్ల ఫ్యామిలీలో పుట్టిన దివ్య స్కెతస్కోప్‌‌ కాకుండా చెస్ బోర్డు పట్టుకొని ఈ ఆటలో ఇప్పుడు యువ రాణి అయింది.  

తన అమ్మనాన్న ఇద్దరూ డాక్టర్లే అయినా.. అక్క షట్లర్ అయినా..  తనను చెస్ బోర్డులోని పావులే  ఎక్కువగా ఆకర్షించాయి. చిన్నతనం నుంచే ఆమె చదువుతో పాటు ఆటలోనూ అసాధారణ ప్రతిభ కనబరిచింది. పదేండ్లకే నేషనల్ చాంపియన్‌‌గా నిలిచిన దివ్య ఇంటర్నేషనల్ ఈవెంట్ల కోసం ప్రపంచమంతా చుట్టివచ్చినా తన చదువును ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదు. హోటల్ గదుల్లో, విమాన ప్రయాణాల్లో, ఆటల విరామ సమయంలో హోంవర్క్ పూర్తిచేసేది. రెగ్యులర్‌‌‌‌ టెన్త్, ప్లస్‌‌2లో డిస్టింక్షన్‌‌లో పాసైన దివ్య  డిస్టెన్స్ డిగ్రీలో తన ఆటకు పనికొచ్చేలా స్పోర్ట్స్‌‌ సైకాలజీ, పెర్ఫామెన్స్‌‌ సైన్స్‌‌, డాటా ఎనలిటిక్స్‌‌ సబ్జెక్టులు ఎంచుకుంది.  

చెస్‌‌లో ధోనీ..

సూపర్ టాలెంటెడ్ అయిన దివ్య ప్రధాన అస్త్రం ప్రశాంతత. ఎంతటి క్లిష్ట సమయంలోనైనా ఓపిగ్గా,  ప్రశాంతంగా ఆడటం ఇండియా క్రికెట్ దిగ్గజం ఎం.ఎస్. ధోనీని గుర్తుకు తెస్తుందని దివ్య మాజీ కోచ్, గ్రాండ్‌‌మాస్టర్ శ్రీనాథ్ నారాయణన్ అంటున్నాడు. ‘దివ్య దూకుడుగా ఆడే ప్లేయర్‌‌‌‌. కానీ కాలంతో పాటు తన ఆటను మరింత మెరుగుపరుచుకుంది. క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్.. ఇలా అన్ని ఫార్మాట్లలోనూ ఆమె రాణిస్తుంది. అత్యంత కీలకమైన, ఒత్తిడితో కూడిన క్షణాల్లో ఆమె అసలైన సత్తా బయటపడుతుంది. క్రికెట్‌‌లో చివరి ఓవర్లలో ధోనీ ఎలా మ్యాచ్‌‌లను గెలిపిస్తాడో, టై-బ్రేక్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో దివ్య కూడా అలాంటి అద్భుతాలనే చేస్తుంది’ అని కొనియాడాడు. 

2020 ఆన్‌‌లైన్ ఒలింపియాడ్‌‌లో గోల్డ్ నెగ్గిన ఇండియా తరఫున బరిలోకి దిగిన దివ్య..  చైనా, రష్యా వంటి బలమైన జట్లపై కీలక విజయాలు సాధించిపెట్టి వరల్డ్ చెస్‌‌లో  తన రాకను ఘనంగా చాటింది. 2021లో విమెన్ గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన ఆమె రెండేండ్లు తిరిగేసరికి 2023 ఆసియా విమెన్స్‌‌ చాంపియన్‌‌ అయింది. గతేడాది వరల్డ్ అండర్‌‌‌‌20 చాంపియన్‌‌షిప్ టైటిల్ సొంతం చేసుకున్న దివ్య..  బుడాపెస్ట్‌‌లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌‌లో స్వర్ణం గెలిచిన ఇండియా విమెన్స్ టీమ్‌‌లో దివ్య కీలక మెంబర్.

 గత నెలలో లండన్‌‌లో జరిగిన వరల్డ్ ర్యాపిడ్‌‌, బ్లిట్జ్‌‌ టీమ్ చెస్ చాంపియన్‌‌లో  వరల్డ్  నంబర్ వన్  హౌ యిఫాన్‌‌ను ఓడించింది. తాజా టోర్నీలో 15వ సీడ్‌‌గా బరిలోకి దిగినప్పటికీ అద్భుతమైన ఎత్తులతో, మేటి ప్లేయర్లను ఓడించి ఆశ్చర్యపరిచింది. నాలుగో రౌండ్‌‌లో  రెండో సీడ్ జు జినర్‌‌‌‌,  క్వార్టర్‌‌ ఫైనల్లో పదో సీడ్ హారిక, సెమీస్‌‌లో మూడో సీడ్  టాన్ జోంగ్యి పై గెలిచిన  ఈ టేనేజర్‌‌‌‌ చివరకు కోనేరు హంపికు చెక్ పెట్టిన తీరు అద్భుతం.  

తను ఇదే జోరును కొనసాగిస్తే..  ఇంకో రెండు, మూడేండ్లలో వరల్డ్‌‌ చాంపియన్‌‌ అయినా ఆశ్చర్యం లేదు.  ఏదేమైనా 19 ఏండ్ల  దివ్య దేశ్‌‌ముఖ్ జర్నీ కేవలం ఒక విజయం మాత్రమే కాదు. కొత్త తరానికి స్ఫూర్తినిచ్చే విజయగాథ. చదువును నిర్లక్ష్యం చేయకుండానే ఆటలో శిఖరాలను ఎలా అధిరోహించవచ్చో దివ్య చూపిస్తోంది. ఓవైపు వరల్డ్ చాంపియన్ గుకేశ్‌‎తో పాటు ఎరిగైసి అర్జున్‌‌, ప్రజ్ఞానంద వంటి కుర్రాళ్లు దూసుకెళ్తుండగా.. అమ్మాయిల్లో హంపి తర్వాత ఆ స్థాయికి చేరే సత్తా తనకుందని  ఈ విజయంతో దివ్య చెప్పకనే చెప్పింది.